Monday, April 6, 2026
Oh my Lord!save the world!
చిన్నప్పుడు ఎడమ చెయ్యి వాటం.బలపం ఎడమ చేత్తో పట్టుకోకూడదు,సరస్వతి దేవికి కోపం వస్తుందని మా మహదేవయ్య అయ్యవారు.కుడిచేతికి బలవంతంగా మార్పించారు.ఇంకేముంది?అంతా అయోమయం,గందరగోళం.నా చేతుల మీదుగా ఎన్ని జారి పోయాయో,ఇంకెన్ని పగిలిపోయాయో లెక్కలేదు.సరిగ్గా పట్టుకున్నానా,సరి అయిన చేతితో పట్టుకున్నానా అనే జంకు నా కాన్ఫిడెన్స్ ని చంపేసింది.మా వాళ్ళకు నేను వాళ్ళలా డాక్టరు కావాలని కోరిక.ప్రజలు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళ కోరిక తీరని కోరికగా మిగిలిపోయింది.కాలేజీలో మా కెమిస్ట్రీ మేడమ్ అరిచేది.ఏ చేత్తో బ్యూరెట్ పట్టుకోవాలో,ఏ చేత్తో కోనికల్ ఫ్లాస్క్ పట్టుకోవాలో తెలియని వాళ్ళందరూ బి.ఎస్సీ కి వస్తారు అని.వాల్యుమెట్రిక్ అనాలసిస్ ప్రాక్టికల్స్ క్లాస్లో జరిగేది ఈ గొడవ.ఇట్లా ఉంటే డాక్టరు అయితే పేషంట్స్ భయపడరా?
చిరంజీవి సినిమాలో లాగా ఓ మై లార్డ్ అంటూ కోర్టులో ప్రత్యర్థులను గడగడలాడించాలి అని కోరిక.మర్డర్ చేసి,వాదించి,గెలిచి,శిక్ష పడకుండా విజయగర్వంతో కోర్టు బయటకు రావాలని తపన.
ఇంకేముంది?పని గట్టుకుని ఈవినింగ్ కాలేజీలో చేరి బి.ఎల్ చేసాను.చేతిలో ఉన్న ఉద్యోగం వదిలేసి రోరింగ్ ప్రాక్టిషనర్ కావాలని అభిలాష.కానీ ధైర్యం చాలలేదు.కనీసం రిటైరు అయిన తరువాత అయినా బార్లో ఎన్రోల్ కావాలనుకున్నాను.మా వాళ్ళకు పర్మిషన్ కు అప్లై చేస్తే జోన్స్ మారాయి.మా దగ్గర రికార్డ్స్ లేవంటే మా దగ్గర లేవని అన్నారు.సెర్వీసులో ఉండగా చేసాను కాబట్టి,బాంకు పర్మిషన్ తీసుకున్నానో లేదో అని అనుమానం వాళ్ళకు.తీరా నాకు అప్రూవల్ వచ్చేటప్పటికి కోవిడ్ వచ్చింది.ఇంకేముంది?నాకు మనసు విరిగిపోయింది.దేవుడు ప్రజలను ఊపిరి తీసుకోనిస్తున్నాడులే పాపం అనుకున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment