Thursday, July 10, 2025

బుర్రీ బుర్రడి కథ లా….

మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ కథ చెబుతుండేది.ఒక ఊర్లో బుర్రీ బుర్రడు అని మొగుడూపెళ్ళాలు ఉంటారు.ఒకరోజు బుర్రడు అడవికి పోయి కట్టెలు కొట్టుకొస్తాను అని బయలుదేరుతాడు.వెళుతూ,గడప దగ్గర ఆగి,బుర్రీ నాకు వడలు తినాలని ఉంది.సాయంత్రం నేను వచ్చేటప్పటికి చేసి పెట్టు అని అడవికి బయలు దేరుతాడు.బుర్రి వెంటనే మినపపప్పు నాన బెడతుంది.ఇంకో గంటలో బుర్రడు వస్తాడు అనంగా మినపపప్పు రుబ్బుకుంటుంది.కట్టెలపొయ్యి రాజేసి,వడలు చేయటానికి కూర్చుంటుంది.ఒక వాయ అవుతుంది.అసలు మినపపప్పు సరిగ్గా నానిందో లేదో అని ఒక నాలుగు వడలు నోట్లో వేసుకుంటుంది.రెండో వాయ కూడా కాలుస్తుంది.అసలు ఉప్పు సరిగ్గా,మోయనగా పడిందో లేదో చూసేదానికి,ఇంకో నాలుగు వడలు రుచి చూస్తుంది.మూడో వాయ కూడా కాలుస్తుంది.అసలు కారం సరిగ్గా వేసానా,లేదా?చప్పగా ఉంటే మా ఆయనకు అసలు నచ్చదు అని ఇంకో నాలుగు తిని చూస్తుంది.ఇంతకీ అసలు నేను సరిగ్గా కాలుస్తున్నానా,లేక పోతే లోపల ఏమైనా పచ్చి నిలిచి ఉందా?అట్లా అయితే తిన్న తరువాత కడుపు నొప్పి వస్తుంది అని ఇంకో నాలుగు తిని చూస్తుంది.పొయ్యి ఆపి ఇవతలకు వస్తుంది.ఇంత కష్టపడి పని చేసిన నాకు ఒక నాలుగు వడలు తినే యోగం కూడా లేదా?అని అనుకుంటూ ఇంకో నాలుగు తింటుంది. చీకటి పడి మొగుడు వస్తాడు.భలే అలసి పోయి ఉంటాడు.హాయిగా వేడి నీళ్ళు ఒంటి మీద పోసుకుని,ఆవురావురు మంటూ వస్తాడు వడలు తినేదానికి.చేసావా?అని అడిగితే నువ్వు చెబితే చేయకుండా ఉంటానా అంటుంది.కంచం ముందర కూర్చుంటాడు.బుర్రి వంటింట్లోకి పోయి గిన్నె మూత తీస్తే,ఏముంది???? గిన్నె అంతా ఖాళీ!!!ఒక్క వడ కూడా మిగిలి ఉండదు!!! చాలా సార్లు మన ఇండ్లలో కూడా ఇలానే జరుగుతుంది.ఒకసారి మా బంథువులను అన్నానికి పిలిచాను.మా పిల్లలు అప్పుడు బడికి వెళ్ళే వయసు.పిలిచిన వాళ్ళు ఒంటి గంట,రెండు అవుతున్నా రాలేదు.ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కరూ చిన్నగా వంటింట్లోకి వెళ్ళేది..।ఒక వడో,కొంచెం పులిహోర తెచ్చుకుని తినేది.పిలిచిన వాళ్ళు ఎప్పుడో వచ్చే సమయానికి చేసిన పులిహోర,వడలు,పాయసం అంతా హుష్ కాకి అయిపోయాయి. ఇలా ఒక్క తిండి విషయం లోనే కాదు.డబ్బు విషయం లో కూడా తరచూ జరుగుతుంటుంది.ఒక ఖర్చుకు అని డబ్బు దాచి పెడతాము.కానీ వేరే వేరే చిన్న చిన్న ఖర్చులు అనుకోకుండా మీద పడుతుంటాయి.అప్పుడు మన కళ్ళు అంతా దాచి పెట్చిన ఈ డబ్బు మీదే పడుతుంది.అది అంతా అయిపోయేదాకా నిద్ర పట్టదు.అసలు అవసరానికి ఆ డబ్బులు ఎప్పుడో హారతి కర్పూరం అయిపోయి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు తరచూ చెబుతుంటారు.మనపైన మనకు నియంత్రణ ఉండాలి.లేక పోతే కష్టం అని.

1 comment:

Nirmala said...

కథ తమాషాగా అనిపించినా మంచి నీతి దాగుంది.