Friday, July 24, 2026

ఎండా కాలంలో నీటి కష్టాలు

చిన్నప్పుడు అంతా ప్రతి ఇంట్లో బావులు ఉండేవి.మంచి నీళ్ళకు మున్సిపల్ కొళాయిలో నీళ్ళు తెచ్చుకునేవాళ్ళము.ఇంట్లో మంచి నీళ్ళ బావి ఉంటే ఆ అవసరం కూడా లేదు.కానీ ఎండా కాలంలో ఎండలు మండి పోయేవి కదా!బావుల్లో నీళ్ళు ఇంకి పోయేవి.అప్పుడు చాలా కష్టం అయ్యేది బొట్టు బొట్టుకు.అందులో మేము ఏడుగురం...అమ్మ,బాబు,పెద్దక్కయ్య,పెద్దన్నయ్య,చిన్నక్కయ్య,చిన్నన్నయ్య,నేను.ఎన్ని నీళ్ళు కావాలి?పని వాళ్ళు ఉంటే వాళ్ళ చేత బయట నుంచి తెప్పిచ్చేది అమ్మ.వాళ్ళు లేనప్పుడు బాగా కష్టం అయ్యేది.బాబు ఆఫీసు నుంచి వచ్చి,అన్నం తినేవాడు.వెంటనే చేద తీసుకుని,వీథి బావి దగ్గరకు వెళ్ళేవాడు.మిట్ట మధ్యాహ్నం ఎవ్వరూ బావి దగ్గర ఉండరు.మేమంతా బిందెలు,బక్కెట్లు తీసుకెళ్ళేవాళ్ళము.బాబు సర సర అంటూ నీళ్ళు తోడేవాడు.మేము టక టక నీళ్ళ బిందెలు తీసుకెళ్ళి,ఇంట్లో తొట్లకు,అండాలలోకు పోసేవాళ్ళము.పది నిముషాలలో ముప్పై,నలభై బిందెలు నీళ్ళు తోడేవాడు బాబు.ఇంక రెండో రోజు దాకా నిశ్చింత అమ్మకు.అదీ కాకుండా అమ్మ ప్రతి రోజూ వంటిల్లు,అన్నాలు తినే గది కడిగేది.ఇల్లూ వాకిళ్ళు కడుగుకోవడం...పొద్దున ముగ్గు,సాయంత్రం సంధ్య ముగ్గు.ముగ్గు పొద్దున అడ్డ గీతలు,సాయంత్రం నిలువు గీతలు వెయ్యాలి.స్నానాలు,పానాలు,కాళ్ళూ చేతులు కడుగుకునేదానికి,వంటా వార్పులకు,బట్టలు ఉతుక్కునేదానికి..।ఇక లేచి నప్పటినుంచీ నీళ్ళతోటే కదా పని!మా అమ్మకయితే పాపం నీళ్ళలో తిరిగి,తిరిగి కాళ్ళు పాచి పోయేవి.మెట్టెలు దగ్గర వాచి,రాత్రిళ్ళు అంతా నొప్పికి అల్లాడేది.అన్నయ్య వాళ్ళు హాస్పిటలు నుంచి ఏదో ఆయింట్ మెంటు తెచ్చి పూసేవాళ్ళు.వానాకాలంలో అయితే మరీ ఎక్కువ!అట్లనే మళ్ళీ పొద్దున లేచి పని చేసుకునేది ఆ తడిలోనే.ఇంటి బయట,దొడ్లో అంతా మట్టినేల కదా!

Thursday, July 23, 2026

డెట్టాల్ వాసనంటేనే ఇష్టం లేదు

నాకు చిన్నప్పటి నుంచి వాసనలు అంటే భయం.అప్పట్లో ప్రక్క ఇండ్లలో ఎవరైనా పోతే,ఘాటైన వాసన ఆ వీథి అంతా వచ్చేది.నేను డెడ్ బాడీస్ నుంచి ఆ వాసన అని ఫిక్స్ అయిపోయాను.ఆ వాసన ఎక్కడ వచ్చినా,ఏదో జరగ రానిది జరిగింది అని భయం.చాలా ఏళ్ళ తరువాత కానీ తెలియలేదు,అది సాంబ్రాణి కడ్డీల వాసన అని.అట్లాగే డెట్టాల్ వాసన కూడా! జువాలజీ ప్రాక్టికల్ క్లాసు లంచ్ ముందర పిరియడ్ వచ్చేది.ఆ కాక్రోచెస్,ఆ స్లైమీ ఫ్రాగ్స్ dissection కాగానే సారు డెట్టాల్ తో చేతులు కడుక్కోమని చెప్పేవాడు.ఏదో ఒక్క చుక్క ఏసుకుంటే చాలు అని తెలిసేది కాదు.మొహం రుద్దుకునేదానికి సబ్బు నురగ వచ్చేటట్లు ఇంతింత వేసుకునేదానిని.చేతులు ఎంత కడుక్కున్నా ఆ వాసన పోయేది కాదు.చేతులు ఇంకా స్లైమీగా,బంక బంకగా ఉన్నట్లు ఫీలింగ్.క్లాసు కాగానే,ఇంటికి పోయి అన్నం తినాలి.అమ్మ పెట్టిన అన్నం అంతా తినక పోతే అమ్మ ఒప్పుకోదు.ముద్ద నోటి దగ్గరకు రాగానే డెట్టాల్ వాసన గుప్పున ముక్కుకు తగిలేది.ఏడుపు వచ్చేది.అట్లానే తిని,కళ్ళు తుడుచుకుంటూ,మళ్ళీ బడికి పరిగెత్తేదాన్ని. డిగ్రీలో జువాలజీ లో యూనివర్సిటీ టాపర్ ను.కానీ బాటనీలో సీటు రాగానే బాటనీకి మారిపోయాను M.Scలో.చిన్నప్పటి నుంచీ ఆ కాక్రోచ్ మౌత్ పార్ట్స్..తెల్లగా పిండి పిండిగా ఇంటర్నల్ విసరా,స్లైమీ ఫ్రాగ్స్ తో dissections తో విసిగిపోయాను. ఒక సారి ఒక పార్టీలో మ్యాంగో లస్సీ ఒక పెద్ద జార్ కి చేసి పెట్టి ఉన్నారు.మామిడి పళ్ళు అంటే ఇష్టమే కదా అని అక్కడికి వెళ్ళి,ఒక గ్లాసులో పట్టుకున్నాను.జ్యూస్ ముక్కు దగ్గరికి రాగానే ఆ వాసనకు కడుపులో తిప్పింది.అది చెడిపోయిందేమో,ఎవ్వరూ తాగొద్దు అని చెప్పాలనుకున్నాను.చూస్తే అన్ని చోట్లకంటే అక్కడే క్యూ ఎక్కువ!ఒక్కొక్కరు రెండు,మూడు కప్పులు పట్టుకుని తాగుతున్నారు.అప్పుడు అర్థం అయింది లోపం నాలోనే ఉందని.

Tuesday, July 21, 2026

ఎప్పుడూ మగ వేషాలేనా?

నేను సన్నగా,పొడుగ్గా ఉండేదాన్ని.మంచి,చిక్కటి,పొడుగు జడ.కానీ వరుసగా డాన్సులలో,డ్రామాలలో మగ వేషాలే వచ్చేవి.గౌరమ్మా,నీ మొగుడెవరమ్మా ...డాన్సుకు గోపీ వేషంలో చేసాను.మథురా నగరిలో...చల్లనమ్మ బోవు పాటకు కృష్ణుడు వేషం!స్నేక్ చార్మర్ బ్యాలే లో పాములోడి వేషం.మరీ ఆ డాన్స్ చేసేటప్పుడు,వాళ్ళు జుట్టంతా ముడి లాగా వేసి,తలపాగా కట్టారు.మధ్యలో జుట్టు ముడి ఊడింది.పాములా చేసే విన్యాసాలకు జుట్టు స్టేజ్ అంతా జీరాడింది!డాన్సులో మగ వేషం అంటే అది నేనేలా అయిపోయింది.శాకుంతలమ్..।సంస్కృత నాటకంలో కణ్వ మహర్షిగా చేసాను. ఎప్పుడూ ఇంతేనా!అనిపించేది.కాదు,కాదు.అప్పట్లో చీఫ్ మినిస్టరు,కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మా స్కూలుకు వచ్చారు.అప్పుడు నాగమల్లి కోనలోన,నక్కిందో లేడి కూన పాటకు...పావడా,పమిట వేసుకుని చేసాను.భరత నాట్యానికి అయితే ఇంక వేరే డ్రెస్సు ఉంటుంది కదా!అప్పుడు అయితే ఆయన భుజం పైనచెయ్యి వేసి...బాగా చేసావు పాపా!బాగా చదువుకో!అని అన్నాడు.రెండో రోజు ప్రొద్దున అన్ని తెలుగు దిన పత్రికలలో ఫ్రంట్ పేజీలో మా గ్రూప్ ఫోటో పెద్దదిగా!ఆ కట్టింగ్ చాలా రోజులు దాచి పెట్టుకున్నాను.అసలు సిసలు కాంప్లిమెంటు మా దొడ్లు కడిగే ఆమె ఇచ్చింది.వాళ్ళు చీఫ్ మినిస్టరును చూసేదానికి వచ్చి,అలానే మా డాన్సులు కూడా చూసారు.పాపం!వాళ్ళయితే తాగి వచ్చేవాళ్ళు పొద్దున పనికి.కష్టమయిన పని కదా!ఆమె అమ్మతో అనింది.అమ్మా!మన అమ్మి జింక పిల్ల లాగా భలే చేసింది.ఆ మాటలు విని నాకు చాలా సంతోషమయింది.ఎందుకంటే అప్పటి దాకా ఆమె అంటే నాకు భయంగా ఉండేది.అసలు మమ్మలను గమనిస్తుందని కూడా తెలిసేది కాదు.నల్లగా,లావుగా,ఒక కన్ను పోయి ఉండేది.ఇంకో కన్ను ఎర్రగా ఉండేది.తూలుతూ పని చేసేది.ఆమె నన్ను కనిపెట్టి,ఇంటికి వచ్చినప్పుడు అమ్మకు చెప్పడం నిజంగా గ్రేట్ అనుపించింది.ఇప్పుడు నేను ఆమెకు సిన్సియర్ గా హాట్స్ ఆఫ్ చెబుతాను.

Monday, July 20, 2026

పంచవటీ కీ ఛాయా మే హై

పంచవటీ కీ ఛాయా మే హై సుందర్ పర్ణ కుటీర్ బనా। ఇస్కే సమ్ముఖ్ స్వచ్ఛ శిలా పర్ ధీర్ వీర్ నిర్భీక్ బనా॥ జాగ్ రహా యహ్ కౌన్ ధనుర్ధర్ జబ్ కి భువన్ భర్ సోతా హై। భోగీ కుసుమాయుధ్ యోగీ సా బనా దృష్టిగత్ హోతా హై॥ ఎంత బాగుంది కదా ఈ పద్యము చదువుకునేదానికి.వినే దానికి ఇంకా ఇంపుగా ఉంటుంది.చిన్నప్పుడు మా పాఠం.మైథిలీ శరణ్ గుప్త గారి రామ చరిత మానస్ లోది.లక్ష్మణుని వర్ణన.రాముడు,సీత,లక్ష్మణుడు అడవులకు వెళతారు కదా!కైక వరాల వలన.అప్పుడు పంచవటీ అనే ప్రదేశంలో కొంత కాలం ఉంటారు.లక్ష్మణుడి జీవిత ధ్యేయమే సీతారాముల సేవలో తరించడం.మరి పోటీకి కూడా ఎవరూ లేరంటే,వదులుకుంటాడా?రేయింబగళ్ళూ వాళ్ళను కాచుకుని ఉంటాడు.కవి అదే చెబుతున్నాడు.పంచవటిలో చిన్న కుటీరం ఉంది.దాని దగ్గరలోనే ఒక బండరాయి ఉంది.ఒక యువకుడు నిర్భీతితో,ఆ చీకటిలో,ఆ బండ పైన కూర్చుని నిరీక్షిస్తున్నాడు.భుజానికి ధనుస్సు,అంబుల పొది ఉంది.లోకమంతా నిద్రలో ఉన్నా,ఇతను మటుకు రెండు కళ్ళనూ ఆల్చిప్పల్లాగా చేసి చుట్టూరా గమనిస్తున్నాడు.చూసేదానికి వస్త్రధారణ పరంగా యోగిలా ఉన్నాడు.ఒక కోమలమయిన భోగి యోగి వేషంలో కనిపిస్తున్నట్లు ఉన్నాడు.నిజమే కదా!రాచరికాల్లో తేలాడాల్సిన భోగి,నార చీరలు కట్టుకుని,కటిక రాళ్ళ పైన కూర్చుని,రాత్రింబగళ్ళూ అడవిలో అటవికంగా ఉండాల్సి రావడం,ముని వేషంలో ఉండమూ విథి వైపరీత్యం కదా! ఇంకో పద్యం వేరే కవి రాసింది. రుండ్ కాటి ముండ్ కాటి రుండ్ కే దుఖండ్ కాటి।। ఇది అభిమన్యుడు పద్మ వ్యూహంలో వీరనృత్యం చేసేటప్పుడు వర్ణన.అభిమన్యుడు రణరంగంలో దూకి,యుద్థం చేస్తున్నాడు...వీరోచితంగా.అతని కరవాలానికి క్షణం తీరిక లేదు.తల నుంచి మొండెం వేరు చేస్తున్నాడుట!ఆ మరుక్షణమే...ఆ మొండాన్ని మరో రెండు తునకలు చేస్తున్నాడుట ఆ ముక్కు పచ్చలారని బాల వీరుడు...అభిమన్యుడు. అలాగే సుభధ్రా కుమారీ చౌహాన్ జీ కథలు,సూరదాసు,కబీర్ దాసు దోహాలు బాగా నచ్చేవి.డిగ్రీలో హరి వంశ్ రాయ్ బచ్చన్ గారి భూలే బిసరే చిత్ర అనే నవల ఉండేది.ప్రీ ఇండిపెన్డెన్స్ లో మన వాళ్ళ ఆలోచనా విథానం.కొంత మంది ఇంగ్లీషు నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం.ఇంగ్లీషు వాళ్ళ అప్రూవల్,acceptance కోసరం తపన...ఇవన్నీ బాగా ఆవిష్కరించాడు రచయిత.

పదో క్లాసుకు వచ్చినా పెద్దన్నయ్యే పెన్సిలు చెక్కిచ్చాడు

పెద్దన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం.నేను పుట్టిన క్షణం నుంచీ వాడి ఆఖరు శ్వాస దాకా అంతే ప్రేమగా ఉన్నాడు.నాకూ అంతే!ఎప్పుడూ బుల్లీ,బుల్లెమ్మా,తల్లీ అనే పిలిచేవాడు.నేను ఇంట్లో ఆఖరు,అందునా మబ్బురామిని.కాబట్టి అమ్మ,అక్కయ్య,అన్నయ్య నా అన్ని పనులకూ హాజరు...చేసి పెట్టేదానికి.బళ్ళు తెరవంగానే,పుస్తకాలకు అట్టలు వేయడం మొదలు.తరువాత మంచి,మంచి స్టిక్కర్లు అంటించి పేరు,క్లాసు రాయడం.టెక్స్ట్ బుక్స్ అయితే మరీను.ఎవరూ దొంగిలించకుండా అన్ని తట్లూ పేర్లు రాసేవాడు.పుస్తకం కొంచెం వంచి అన్ని పేజీలు కలిసేటట్లు పేరు రాసేవాడు.నాకు అవన్నీ చాలా గ్రేట్.మా పెద్దన్నయ్య రాసిచ్చాడు,మా పెద్దన్నయ్య చేసిచ్చాడు అంటూ అందరికీ చెప్పుకునే దాన్ని.నాకు బ్లేడు ఇవ్వాలంటే ఇంట్లో అందరికీ వణుకు!వేలు కోసుకుంటానేమో పెన్సిలు చెక్క బోతూ అని.అందుకని అన్నయ్యే రోజూ పెన్సిలు చెక్కి,నా పగోడా జామెట్రీ బాక్సులో పెట్టేవాడు.ఆ ప్రహసనం నా పబ్లిక్ పరీక్షల టైము దాకా జరిగింది.ఒకరోజు పబ్లిక్ పరీక్షల ముందు స్కూలులో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయమన్నారు.మా పెద్దన్నయ్య చేత చేయించుకుని వస్తాను అని చెప్పాను సర్ కి.పరీక్షలు ఎవరు రాయాల్సింది?నువ్వా?మీ అన్నయ్యా?అందరూ రాస్తున్నారు కదా,నువ్వూ రాయి.ఎక్కడన్నా తెలియక పోతే నేను చెబుతాను అని అన్నాడు.అలా ఆ రోజు బలవంతాన ఫిల్ అప్ చేసాను ఫార్మ్.

Saturday, July 18, 2026

డిల్లీలో ప్రదర్శన చేజారిన వేళ

బళ్ళో ఎప్పుడూ ఎగురుతూ,డాన్సులు వేస్తుండేదానిని.ఒక సంవత్సరము నన్ను,p.b.పద్మజను సెలెక్ట్ చేసారు.దేనికి అనుకుంటున్నారు?డిల్లీ లో జరిగే నేషనల్ కల్చరల్ ఈవెంటులో మా స్కూలును రెప్రజెంట్ చేసేదానికి.స్వరజతి నేర్పించారు.దానికి తగిన డ్రెస్సు,నగలు అన్నీ కూడా స్కూలు వాళ్ళే కొన్నారు.భరత నాట్యం...ఇరగ దియ్యాలి డిల్లీలో అని రోజూ ప్రాక్టీసు చేసేవాళ్ళము,స్కూలు అయిపోయిన తరువాత.అన్నీ వైనంగా,అనుకున్నట్లు జరిగితే...।అది జీవితం ఎలా అవుతుంది?సడెన్ గా ఒక రోజు పొద్దున లేచేటప్పటికి కళ్ళు అతుక్కుని పోయి ఉన్నాయి.కళ్ళు తుడుచోబోతే తడి తడిగా,బంకలు బంకలుగా చేతులకు.అమ్మా!అంటూ అమ్మ దగ్గరకు పోయాను.అయ్యో!కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి.కళ్ళు రెండూ పుసులు కట్టి ఉన్నాయి అనింది.చిన్నగా వేడి నీళ్ళతో కళ్ళు శుభ్రం చేసింది.ఈ రోజు బడికి వద్దులే తల్లీ.తగ్గిన తరువాత రేపు పోదువులే,అనింది.ఆ ఆగడం ఆగడం పది రోజులు బడికి వెళ్ళలేక పోయాను.ఎందుకంటే నాకు వచ్చింది గ్లకోమా అని చెప్పింది పెద్దక్కయ్య.హాస్పిటలుకు తీసుకెళ్ళి,డాక్టరుకు చూపించి మందులు వాడారు.బాగా సివియర్ గా వచ్చినట్లుంది.పూర్తిగా తగ్గేదానికి రెండు వారాలు పట్టింది.బడికి పోయి చూస్తే,పరిస్థితి అంతా తారు మారు.అన్ని రోజులు బడికి వెళ్ళక పోయేటప్పటికి,నేను ఎప్పుడు వస్తానో వాళ్ళకు తెలియలేదు.ఈ లోపల,ముఖ్యంగా డాన్సు ప్రాక్టీసు పోయింది.డిల్లీ అథారిటీస్ కి కేండిడేట్స్ పేర్లు చెప్పాల్సి రావడం,ట్రైను టికెట్స్ కొనాల్సి రావడం...వాళ్ళు రెండో ఆలోచన లేకుండా నా స్థానంలో రాథనో,సావిత్రినో సెలెక్ట్ చేసేసారు.నేను చాలా బాథ పడ్డాను.కనీసం నెక్స్ట్ ఇయర్ పంపిస్తారు అనుకున్నాను.కానీ కుదర లేదు.మా జూనియర్స్ ని సెలెక్ట్ చేసారు.ఇలా డిల్లీలో నా నాట్య ప్రదర్శన కల కలలాగానే నిలిచిపోయింది.

Thursday, July 16, 2026

ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్…ఎక్కిళ్ళు పెట్టి ఏడుపులు

నాకు అసలే ఫిజిక్స్ అంటే భయం.ఇంక ప్రాక్టికల్ ఎక్జామ్ అంటే ఎలా ఉంటుంది?ఒక సారి magnetism కు సంబంథించి ఎక్స్పెరిమెంటు వచ్చింది.నాకు తియరీ తెలుసు...like poles repel and unlike poles attract అని.కానీ అక్కడ తత్తర బిత్తర!రెండూ సౌత్ పోల్ ఎండ్స్ పెట్టి మాగ్నెటిక్ ఫీల్డ్ రమ్మంటే ఎట్లా వస్తుంది?ఇంకో సారి ట్రై చేసాను.ఈ సారి రెండూ నార్త్ పోల్స్ దగ్గరకర తీసుకు వచ్చాను.ఏమీ వర్క్ అవుట్ కావడం లేదు.బెల్ కొట్టారు.టైమ్ అయిపోయింది.బయటకు వచ్చేసాను దిగాలుగా.రెండో రోజు పొద్దున అరగంట ముందర స్కూల్ కి వెళ్ళి ఫిజిక్స్ జిపార్టిమెంటుకు వెళ్ళాను.సర్ నన్ను చూసి రా..రా.।।ఏంది ఆ ఎక్స్పెరిమెంటు చేయడం?అని నాలుగు అక్షింతలు వేసి,ఆన్సర్ పేపరు ఇచ్చాడు.సున్నా!తెలిసిందే,కానీ కళ్ళ ముందర సున్నా మార్కులు చూస్తుంటే ఏడుపు ఎగదన్నుకుని వచ్చింది.ప్రేయర్ కి టైము అయింది.ప్రేయర్ లో అంతా ఎక్కి ఎక్కి ఏడుపు.ప్రేయర్ అయిపోగానే ఏందా ఏడుపులు వికారంగా అంటూ పి.టి మాస్టరు వాయింపులు.మొత్తానికి ఆరోజంతా దిగులు పడుతూనే ఉన్నాను.

విజయ ముక్త మేడమ్ గారి Ophelia వర్ణన

డిగ్రీలో మాకు Hamlet ఉండేది.ఇంగ్లీషుకు విజయ ముక్త మేడమ్ గారు వచ్చేవారు.ఆమె నీట్ గా,సిమ్పుల్ గా,నవ్వు ముఖంతో ఉండేవారు ఎప్పుడూ.నా హాండ్ రైటింగ్ అంక చండాలంగా ఉంటుంది.చిన్నప్పుడు ఎడమ చేతి నుంచి కుడి చేతికి మారిన ప్రభావమేమో అని అనుకుంటాను.పదో క్లాసు వచ్చేదాకా కూడా ప్రాక్టీసు చేసాను కానీ హాండ్ రైటింగు బాగుపడలేదు.నా ఆన్సర్ షీట్లో ప్రతి సారీ ఆమె రైట్ ఎ గుడ్ హాండ్,రైట్ ఎ నీట్ హాండ్ అని రాస్తుండేది.ఆమె ఎంత ఇన్వాల్వ్మెంటు ఉండే లెక్చరర్ అంటే అప్పుడు కూడా సిలబస్ కంప్లీట్ కాలేదని ఎక్ట్రా క్లాసెస్ తీసుకునేది.షేక్స్పియర్ ఏమి రాసాడో కానీ,ఆమె చెబుతుంటే అంత నచ్చేది.ఒఫీలియా క్యారెక్టర్ గురించి చెబుతుంటే కళ్ళ నీళ్ళు తిరిగేవి.ఆమె అందమూ,అమాయకత్వమూ,ఆమె ప్రేమ,ఆమె నిస్సహాయత,నిర్వేదం,తొందరపాటుతనం ....అన్నీ కళ్ళకు కట్టినట్లు చెప్పేది.paradise lost book 4,Milton ది కూడా చాలా బాగా వివరించేది.లర్కింగ్,ల్యూరింగ్ అండ్ వెనమస్ వైపర్ గురించి చెప్పేటప్పుడు గానీ,గార్డెన్ ఆఫ్ ఈడెన్ వర్ణన కానీ,Adam and Eve అమాయకత్వమూ,ప్రేమ కానీ..।ఆమె చెబుతుంటే ఆ లోకంలోకి వెళ్ళిపోయినట్లు ఉండేది.నిజంగా ఆమె చెప్పే విథానం నాకు చాలా నచ్చేది.

Wednesday, July 15, 2026

Chase novels లో Sullivan brothers లా కాదు

chase novels లో sullivan brothers ఇద్దరు ఉంటారు.వాళ్ళు కిరాయి హంతకులు.వాళ్ళు ఒప్పుకున్నారంటే,ఇంక ఆ మనిషి పని అయిపోయినట్లే!ఎందుకంటే వాళ్ళు ఒక రోజు కాదు,ఒక వారము,నెల,సంవత్సరము అయినా విసుగు చెందరు.ఓపికగా ఆ మనిషి దొరికేదాక,ఓపికగా కాచుకుంటారు.వాళ్ళను black crows అని కూడా అంటారు.వాళ్ళ మిషన్ కాదు కానీ,వాళ్ళ ఓపిక,సహనం ...వాళ్ళు అనుకున్న పని అయ్యేదాక విసుగు,చీదర,అసహనం,అసంతృప్తి లేకుండా ఎదురు చూడడం అనేది అప్పట్లో నాకు చాలా గొప్ప అనిపించేది.వాళ్ళు కూల్ గా ఉంటారు.కోల్డ్ బ్లడెడ్ గా పని కానిస్తారు. నాకు అయితే అంతలా ఏంది...ఇసుమంత కూడా ఓపిక లేదు,ఉండదు.అప్పట్లో బస్ స్టాండులో ముందర వచ్చే పాసెంజరు ఎక్కేదాన్ని గానీ తరువాత వస్తుంది అనే ఎక్స్ప్రెస్ కోసం కాచుకునే దాన్ని కాదు.అందులో అప్పట్లో బస్సులు,ట్రైన్స్ తక్కువ .దూరం నుంచి వచ్చే బస్సులు అయితే...ఫుల్ అయితే ఊరి పొలిమెరలోనే డ్రైవరు తిప్పుకుని వెళ్ళిపోయేవాడు.మనమేమో ఇక్కడ ఇంకా బస్సు రాలేదు.ఎప్పటికి వస్తుందో,ఏమో అనుకుంటుంటాము.చాలా సేపు అయితే అసలు వస్తుందో,రాదో...ఊళ్ళోకి రాకుండానే వెళ్ళిపోయిందేమో అనే అనుమానాలు వస్తాయి.ఇంత టెన్షన్ నేను భరించలేను.ముందు వచ్చిన బస్సు ఎక్కితే....రై..రై అని పోతామో...।ఆడుతూ పాడుతూ ఆరు గంటలు లేటుగా చేరుతామో..।మొత్తానికి గమ్యం చేరుతాము కదా! సినిమాల విషయం కూడా అంతే!ముచ్చటగా మూడో రోజే కడ అనే సినిమా ముందరే చూసెయ్యాలి.వంద రోజులు ఆడే సినిమా ఎప్పుడైనా చూడొచ్చు.ఇందులో మా పెద్దక్కయ్య విశ్లేషణ ఇలాగుండేది.ఫ్లాప్ అయిన సినిమా పైన విశ్లేషణలు పుంఖాలు,పుంఖాలు చేసుకోవచ్చు.ఎన్టీవోడు అలా ఎందుకు చేసాడు.సావిత్రికి తగినంత బరువైన పాత్ర పడలేదు.మాటలు,పాటలలో పస లేదు.డైరెక్షన్ మరీ చెండాలం అంటూ!అదే హిట్ సినిమా అయితే ...సింపుల్ గా బాగుంది అనేసి ఊరుకుంటాము. నవల తీసుకుంటే ముందర ముప్పై పేజీల కంటే ఆఖరున ఆరు పేజీలు ముందర చదివేస్తాను.కథ సుఖాంతమా?దుఃఖాంతమా!హీరో హీరోయిన్లు కలుసుకున్నారా?పెళ్ళి చేసుకున్నారా?విలను పరిస్థితి ఏంది?ఇవన్నీ ఆఖరునే కదా తెలిసేది.తరువాత నిదానంగా నవల పూర్తి చేయవచ్చు టెన్షన్ లేకుండా. మన పాత కథలలో కథానాయిక విరహంతో,కళ్ళు కాయలు కాచేలాగ ఎదురు చూస్తుంది అని రాసేవాళ్ళు కదా!నాకయితే ఈ విరహమూ వద్దు,ఆ కళ్ళు కాయలూ కాయనక్కర లేదు.ఆ ఎదురు చూపులూ,బెదురు చూపులూ వద్దు.శుభ్రంగా,తిని పడుకుంటే ఒక పని అయిపోతుంది అనిపించేది.

Friday, July 3, 2026

అలాస్క ఎయిర్ లైన్న్…అందమయిన అనుభూతి

మొన్న వైట్ సాండ్ బీచ్ కి వెళ్ళాము.అక్కడ ఇసుక చాలా ఫైన్ గా ఉంది.పిండిలాగ మెత్తగా ఉంది.నీళ్ళు గ్రీనిష్ బ్లూ గా భలే ప్లెసెంట్ గా ఉన్నాయి.షాలో వాటర్స్ అయి,బ్లూ గ్రీన్ ఆల్గే ఎక్కువగా ఉంటే నీళ్ళు ఆరకంగా కనిపిస్తాయి.సముద్రము లోతు పెరిగే కొద్దీ లైట్ బ్లూ,డీప్ బ్లూ గా కనిపిస్తుంది.సముద్రం ని రత్న గర్భ ఇంటారు కదా!నిన్న నీరెండకు నీరు మెరుస్తూ,అల్లంత దూరం నుంచీ రత్నాల దుప్పటి పరుచుకున్నట్లు మెరిసిపోతూ ఉణ్ణింది. ఇక్కడ గ్రీన్ సాండ్ బీచ్ కూడా ఉందట.మాకు కుదరలేదు.అక్కడకు చేరడం కొంచెం కష్టం అనుకున్నారు. నిన్న మా తిరుగు ప్రయాణం.A-Bays అనే చోట బ్రేక్ఫాస్ట్ చేసాము.నేను వెనీలా ఫ్లేవర్డ్ యోగర్ట్ విత్ బ్లూ బెర్రీస్,స్ట్రా బెర్రీస్ తీసుకున్నాను.వచ్చేటప్పుడు అర్థరాత్రి దిగాము కాబట్టి అర్థం కాలేదు.పగటి పూట చూస్తే ఎయిర్ పోర్ట్ భలే డిఫరెంట్గా కనిపించింది.మొదటి సారి నేను అలాంటి ఎయిర్ పోర్టు చూడడం!అంతా ఓపన్ గా ఉంది.ఏదీ క్లోస్ గా లేదు.బాగేజ్ క్లైమ్,గేట్స్ అన్నీ!ఒక రకంగా చెప్పాలంటే వసారాలు ఉంటాయి కదా పల్లెలలో ఇండ్లలో .జస్ట్ రూఫ్..।నాలుగు తట్లూ తెరిచి ఉంటుంది ప్రతి చోటా.నిజానికి మా గేటు దగ్గరకు వెళ్ళి కూర్చుంటే ఎదురుగా వీథి,వెనకాలే విమానం,ప్రక్కనే విశాలంగా సముద్రమూ కనుపిస్తున్నాయి.అక్కడ నేటివిటీ,లోకల్ టచ్,వెదర్ కండిషన్స్ కి అలా వెరైటీగా కట్టారేమో అనిపించింది. అక్కడ గోడల పైన కూడా ఒక ఫోక్ లోర్ కనిపించింది.ఆ దీవికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారట!ఒక అమ్మాయి అక్కడక్కడా నివసించేదానికోసరము మంటలు వేసిందట!కానీ చెల్లెలు ఆ మంటలనన్నిటినీ ఆర్పుతూ వచ్చింది అట!కానీ మొత్తానికి అక్క అక్కడ నివాసం ఏర్పరుచుకుంది.మంటలు ఆరిపోకుండా కాపాడుకుంది. అలాస్క ఎయిర్ లైన్స్ లో ఎక్కాము.ఆ ఎయిర్ హోస్టెస్ లు నన్ను చాలా బాగా చూసుకున్నారు.ఒక రకంగా చెప్పాలంటే పామ్పర్ చేసారు.నన్ను ట్రిప్ బాగా జరిగిందా?ఏమేమి చూసావు?ఏది బాగా నచ్చింది?అని అడిగారు.ఇద్దరు ముగ్గురు ఎయిర్ హోస్టెస్సులు అటు,ఇటూ తిరిగేటప్పుడు నన్ను చూసి నవ్వడము,భుజం పైన తట్టడం చేస్తూ ఉన్నారు.అందులో ఒక ఆమె అయితే వచ్చేసేటప్పుడు హగ్ చేసుకుని,బై చెప్పింది.నాకు చాలా మంచిగా అనిపించింది. నేనూ ముప్పై అయిదు ఏళ్ళపైన సర్వీసు చేసాను.వికటాట్టహాసాలు చేసుంటానేమో కానీ,మందస్మిత...సుస్మిత లాగ ఎప్పుడూ బాంక్ కస్టమర్లను రిసీవ్ చేయలేదు.రెండేళ్ళ క్రితం కూడా Air France airlines లో కూడా ఇలాగే మంచిగా ఉణ్ణారు.

Thursday, July 2, 2026

observatory near Mauna Kea

నిన్న Mauna Kea mountain కి వెళ్ళాము.ఆ కొండ పైన చాలా దేశాలు,కొన్ని సంయుక్తంగా observatories పెట్టుకుని ఉన్నారు.NASA ది కూడా ఉంది.పిల్లలు పైదాకా వెళ్ళారు.కానీ నేను విజిటర్స్ సెంటరు దాకానే వెళ్ళాను.పైన ఆక్సిజను లెవల్స్ తక్కువగా ఉంటుంది,ఇబ్బంది అవుతుందేమో అని. ఈ కొండలు ఇక్కడ వారికి చాలా పవిత్రమయినవి.వీరి shrines,burials and other ritual places చాలా ఉన్నాయి.వీరు మనలాగే ప్రకృతిని దేవుడు లాగా పూజిస్తారు.goddess of mist,goddess of snow,goddess of mountains and summit cluster of mountains as God of mountains.ఇక్కడ ఒక సరస్సు ఉంది.గ్లేసియర్ వల్ల పుట్టిందట.swirling lake అని అంటారు కానీ నీరు ప్రశాంతంగానే ఉంటుంది.ఒక గని ఉంది.అది కూడా వీరికి పవిత్రమయిన స్థలమే.అక్కడ పచ్చటి రాయి దొరుకుతుంది.magnesium,ferro/ferric sulphate వల్ల ఫార్మ్ అయినది.radio carbon dating చేస్తే ఒక రాయిని,అది 1429-1480AD అని తేలిందట. పర్వతం పైన అబ్సర్వేటరీ ఉంది.ఆకాశం ప్రశాంతంగా ఉంటే చాలా నక్షత్రాలు కనిపిస్తాయట!

Wednesday, July 1, 2026

బ్లాక్ సాండ్ బీచ్…కథ..కమామిషు

నిన్న ఇక్కడ ఉండే రైన్ ఫారెస్టుకు వెళ్ళాము.ఆ ప్రకృతి శోభ వివరించలేము.వెదురు బొంగు చెట్లు ఆకాశం అంటుతున్నట్లు ఉంది.ఎన్ని రకాల చెట్లు!ఇంకెన్ని రకాల పూలు...వాగులు,వంకలు...జలపాతాలూ!మనోహరంగా ఉండింది.జలపాతం నీళ్ళు లోయలోకి పడుతున్నాయి.కాబట్టి కింద దాకా వెళ్ళేదారి లేదు.కానీ అంతదాకా వెళ్ళి వచ్చేదానికి నాలుగు వందల మెట్లు ఉన్నాయి. ఆ తరువాత black sand beach కి వెళ్ళాము.మొదటి సారి అలాంటి బీచ్ చూడడం!బీచ్ కొంచెం రాకీగా ఉంది.కానీ సేఫ్ గా కూడా ఉంది.పిల్లలు చాలా సేపు ఆడుకున్నారు.అక్కడ పచ్చ తాబేళ్ళు ఉంటాయట.కానీ మాకు కనిపించలేదు. అక్కడ ఆ ప్రదేశానికి సంబంథించి స్థల పురాణం వాడుకలో ఉంది.అప్పట్లో ఒక పచ్చ తాబేలు కావాలనుకున్నప్పుడు పిల్లవాడు లాగ మార గలిగేది అంట.అలా మారి పిల్లలతో ఆడుకునేది.వాళ్ళు నీళ్ళలో మునిగిపోకుండా కాపాడుతూ ఉండేదట!అది ఉండడం వలన అక్కడి ప్రజలకు తాగునీరు కూడా లభ్యమయ్యేదట!దాని తరువాత...దాని సంతతి కూడా అలానే అక్కడ బిడ్డలను,అక్కడి ప్రజలను కాపాడేవట!ఇప్పటికీ అక్కడ ప్రజలకు ఆ నమ్మకం ఉందట! అది చదివిన తరువాత మన ఊళ్ళలో కూడా కొన్ని కొన్ని నమ్మకాలు,కథలు గుర్తు వచ్చాయి నాకు.మొత్తానికి ఈ హవాయి సందర్శన భలే నచ్చింది నాకు.

Monday, June 29, 2026

అత్యద్భుతం అగ్నిపర్వతం!

నిన్న పిల్లలు హవాయిలోని బిగ్ ఐలాండులోని అగ్ని పర్వతం దగ్గరకు తీసుకెళ్ళారు.వెళ్ళే దారి అంతా గడ్డలు కట్టిన లావా రాళ్ళు.మేమున్న చోటి నుంచి సుమారు మూడు గంటల ప్రయాణం.1974 లో ఒకసారి ఎరప్ట్ అయిందట!దానికి సంబంధించిన లావా అది.అక్కడ అంతా అక్కడక్కడ పొగలు వస్తూ ఉన్నాయి.నాకు అయితే సల్ఫర్ వాసన తెలియలేదు కానీ సన్నగా వస్తుంది అన్నారు పిల్లలు.స్టీమ్ వెంట్ అని అక్కడక్కడ పొగలు.దగ్గరికి పోతే కొలిమి దగ్గర మనం మొహం పెట్టినట్లు ఆవిరులు! లావా ట్యూబు అనే చోటికి వెళ్ళాము.అక్కడ నుంచి అంతకు ముందు లావా బయటకు తన్నుకు వచ్చిన టన్నెల్.లోపలకు వెళ్ళి చూసాము.నిన్న పౌర్ణమి.సాయంత్రానికి అసలు వాల్కనో దగ్గరకు వెళ్ళాము.ఎంత పెద్ద క్రేటరో!రెండు రోజుల ముందే లావా బయటకు ఎగిసిందట!పొగలు వస్తున్నాయి.చీకటి పడేదాకా ఉన్నాము.ఒక తట్టు ఆకాశంలో పున్నమి చంద్రుడు.ఇంకో తట్టు ఆ అగ్ని పర్వతం నుంచి మంటలు ఎగబాకడం!రెండు కళ్ళు చాలలేదు ఆ అద్భుతమయిన దృశ్యం చూసేదానికి.ఆ క్రేటరు లో మోల్టెన్ లావా!నిజంగా జీవితం ధన్యమనిపించింది.ఒక లైవ్ వాల్కనో చూస్తాను అని ఎప్పుడూ కలగన లేదు కూడా నేను.ప్రకృతి పరమయిన అద్భుతాలు కదా!మనముందు ఆవిష్కృతము అవడం,పండు వెన్నెలలో ఆఅందాన్ని ఆస్వాదించ గలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.నన్ను ఓపికగా తీసుకెళ్ళి అవన్నీ బిడ్డలు చూపించడం నాకు ఇంకా హాయినీ,సంతోషాన్ని కలగచేస్తున్నది.

Tuesday, June 23, 2026

స్టూడెంటు ట్రైనీతో సినిమాకు

మా అబ్బాయి నెలల పిల్లవాడు.అత్త బయట ఉంటే బిడ్డను తీసుకోవడం,ఆడించడం చేసేది కాదు.ఓహో!అలాగా!అనుకున్నాను. మా బాంకులో అప్పుడు ఒక అమ్మాయి,పేరు నాగమణి అనుకుంటా,ఉండేది.అప్పట్లో సమ్మర్ వెకేషవ్లో మంచి స్టూడెంట్స్ ఒకరిద్దరిని స్టూడెంటు ట్రైనీస్ గా తీసుకునే వారు.వారిని వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ రెకమెండ్ చేసేవారు.మంచి స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ బెనిఫిట్,బాంకింగు పైన ఇంటరెస్టు కలిగించేదానికే అనుకుంటాను.ఆ ట్రైనీస్ నిజమయిన ఫైనాన్షియల్ డీలింగ్లు చూడరు.జస్ట్ బాలన్సింగు పనులు,టపాల్ సెక్షన్ లో పనులు చేసేవారు. ఆ అమ్మాయి అక్కా!అక్కా!అంటూ నా చుట్టూరా తిరుగుతుండేది.ఒకసారి అత్త నన్ను బిడ్డను తాకనివ్వదేమో అని ఆ అమ్మాయితో సినిమా ప్రోగ్రాము పెట్టుకుని ఇంటికి వచ్చాను.ఇంటికి రాగానే ముఖం కడుక్కుని,సినిమాకు పోతున్నాను,అత్తా అని చెప్పేసి సినిమాకు వెళ్ళిపోయాను.ఇంటికి రాగానే అత్త వివరించింది.అమ్మాయి!బిడ్డలకు సిడిగా ఉంటుంది అని వేరేవాళ్ళు ఎత్తుకోరు.నీవు కన్న తల్లివి కదా!కాబట్టి నీ బిడ్డను నీవు దగ్గరకు తీసుకోవచ్చు.దానికి ఏమీ మైల ఉండదు అని చెప్పింది.అంత మబ్బు శిఖామణిని నేను.లోకజ్ఞానం శూన్యంగా ఉండేదాన్ని.

Friday, June 19, 2026

తిరుమల కొండ పైన అత్త వంటలు

మా పెళ్ళి అయిన కొత్తల్లో అత్తగారింటి వాళ్ళందరమూ తిరుమల కొండకు వెళ్ళాము.పెద్దత్త,మామ,చిన్నత్త,చిన్నమామ,అందరి పిల్లలు,మా వారు,నేను.దగ్గర దగ్గర పదహైదు మందిమి ఉన్నాము.అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది.ఇంటి నుంచే వంట సామానులు,గిన్నెలు తీసుకెళ్ళాము.పాపం అత్త వాళ్ళు రూముకు వెళ్ళగానే గోతాలలో సామానులు,పప్పులు,బియ్యాలు బయటకు తీసి కట్టెలు ఏరుకుని,రాళ్ళ పొయ్యి పెట్టి వంటలు మొదలు పెట్టారు.ఆ రోజులలో హోటళ్ళు అంటే పెద్దవాళ్ళు ఇష్ట పడరు కదా!అందులో అత్త వాళ్ళకు మడి,ఆచారాలు ఎక్కువ.అందరమూ ముఖాలు కడుక్కుని ఊరికినే అట్లా తిరిగి వస్తాము అని బయలుదేరాము.మా మరదులు,ఆడబిడ్డ వాళ్ళకు బయటకు వస్తే హోటల్ లో తినాలి అని ఆశ.హోటల్ కనిపించగానే ప్రసదన్నా!ప్రసాదన్నా హోటల్కి పోతాము అని అడిగారు.అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు కదరా రూము దగ్గర అని అన్నాడు.కానీ తమ్ముళ్ళు అడిగితే కాదన లేక లోపలకు తీసుకెళ్ళాడు.ఒకరి తరువాత ఒకరు...మాకు మసాలా దోస కావాలి,పూరీ కావాలి,ఇడ్లీ వడ కావాలి అంటూ పోటీలేసుకుంటూ తిన్నారు.వాళ్ళందరూ తింటుంటే మేమెందుకు గమ్మున ఉంటాము?మేము మా సత్తా కొద్దీ లాగించాము.హోటల్ బయటకు వచ్చిన తరువాత రూముకెళ్ళి ఏమి చెప్పాలని తపన. రూము దగ్గర అత్తావాళ్ళు మాకు పెట్టి తినాలని అన్నమూ,సాంబారు,కూర వేడి వేడిగా చేసి కాచుకుని కూర్చున్నారు.మేము తినేసి వచ్చాము అనగానే భలే బాథ పడ్డారు.వాళ్ళూ అన్ని గంటలు ప్రయాణం చేసారు.అలసట కూడా తీర్చుకోకుండా మా కోసమని అంతేసి వంటలు చేసారు.గుడికి అని వచ్చి చద్దివి రెండో రోజు తినరు కదా!వాళ్ళు తిననివి మాకు పెట్టరు కదా!ఉసూరోమని వాళ్ళు రెండు మెతుకులు నోట్లో వేసుకుని,కానిచ్చారు. అప్పట్లో మాకు అసలు తెలివి లేదు.మన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని.ఆ స్పృహే లేనప్పుడు,అది ఎల నివారించగలము? ఇప్పుడు తలచుకుంటే నాకు ఆ తెలివి లేని పనులకు చిన్నతనంగా అనిపిస్తుంది.

Thursday, April 23, 2026

పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికినట్లు…

మనము మన జీవితంలో మంచి కోరే వాళ్ళని దూరం పెడతాము.ఎందుకంటే వాళ్ళు స్పైసీ గా ఉండరు.నీబాంచన్ దొరా అన్నట్లు అడుగులకు మడుగులొత్తరు.ఉన్నది ఉన్నట్లుగా,మొహమాటం లేకుండా చెబుతారు.మనకు అట్లాంటి వాళ్ళు ససేమిరా నచ్చరు కదా! మనము పనికి రాని వాళ్ళని,పస లేని వాళ్ళని వంది మాగధులుగా పెట్టుకుంటాము.ముత్యాల ముగ్గు సినిమాలలో లాగ మనం వెథవ పని చేసినా ఆహా,ఓహో అంటారు.మన మోరల్ బూస్ట్ చేస్తుంటారు.వాళ్ళ వలన మనకు పైసా లాభం లేకపోగా పెద్ద అగాథం.అందుకే అర్హత లేని వారిని అందలం ఎక్కించకూడదు అని అంటారు.పేనును తలలో ఉండనిస్తే ఏం చేస్తుంది?తలంతా కొరికి పెడుతుంది.బరుక్కునే దానికి సమయం సరిపోదు.అందుకే మన సహచరులను,స్నేహితులను ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే మనకు అనవసరపు తలనొప్పులు తీసుకొస్తారు.ఇబ్బందికర పరిస్థితులలో నిలబెడతారు.

Wednesday, April 15, 2026

Rolling stone gathers no moss

Rolling stone gathers no moss అని అంటారు కదా!ఒక చోట నిలకడగా లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు ఆస్తులూ,అంతస్తులూ కూడగట్టలేరు అనే అర్థంలో వాడుతారు.మాస్ అంటే నాచు అని అర్థం.ఒక రాయి ఒకేచోట ఉంటే దాని పైన నాచు పెరిగే ఆస్కారం ఉంది.అదే నీటి ప్రవాహంలో ఉండే రాళ్ళు ఆ నీటి ఒరవడికి ఒకచోట ఉండకుండా కదులుతుంటాయి.కాబట్టి ఏ ప్రదేశంలోనూ అవి కుదురుగా ఉండలేవు.అసలు నాచు పెరిగేది దేవుడెరుగు.ఆ రాళ్ళే అరిగి,కరిగి పోతుంటాయి. సహజంగా ఒకేదాని పైన దృష్టి పెడితే,ఆ రంగంలో మనము నిష్ణాతులం కావచ్చు.కానీ చాలా సార్లు,చాలా మంది వారి ప్రయారిటీస్ డిఫైన్ చేసుకోలేరు.డిసైడ్ చేసుకోలేరు.గాలి వాటంలాగా కనిపించిన ప్రతి ఒక్కదాంట్లో వేలు పెడుతుంటారు.రెండు రోజుల్లో మొహం మొత్తుతుంది.మళ్ళీ క్రొత్త విషయం వైపు దృష్టి మారిపోతుంది.ఇలాంటి వారు జీవితంలో ఏదీ పెద్దగా సాధించలేరు.వాళ్ళ గోల్ ఏందో కూడా ఫైనలైజ్ చేసుకోలేకపోతే,దాని సాథనకు ఏమి కార్యాచరణ చేయగలతారు?కాబట్టి జీవితంలో మనకు ఏమి కావాలో,ఎలా కావాలో,ఎప్పుడు కావాలో నిర్దిష్టంగా ఆలోచించి,కార్యోన్ముఖులం కావాలి.ఎందుకంటే కష్టపడకుండా ఎవరికీ ఏమీ దక్కదు.

Friday, April 10, 2026

శనైః శనైః….శూన్య్ శూన్య్ శూన్య్

నేను ఎనిమిదో క్లాసులో ఉండేటప్పటి విషయం.మా స్కూలు దగ్గరలో సంస్కృత విద్యాపీఠం ఉండేది.దేశం లో అన్ని చోట్ల నుంచీ విద్యార్థులు వచ్చేవారు.ఎక్కువగా టీచింగ్ కోర్సులు చెప్పేవారనుకుంటా అప్పట్లో.వాళ్ళను ట్రైనింగ్ కి మా స్కూలుకు తీసుకువచ్చేవాళ్ళు.ఒక్కొక్క స్టూడెంటు మాకు సంస్కృతంలోనే వివరించి పాఠం చెప్పాలి.వాళ్ళలో చాలా మందికి తెలుగు రాదు.అప్పట్లో మెల్లగా అనే దానికి శనైః అని,సున్నా కి శూన్య్ అని నేర్చుకున్నాను.ఒకతను ఉపమాలంకారం గురించి చెప్పాలనుకున్నాడు.దానికి ఉపోద్ఘాతంగా అరగంట సేపు ఉప్మా ఎలా చెయ్యాలో చెప్పాడు.సరిగ్గా ఉపమాలంకారం గురించి వివరంచే సమయానికి బెల్లు కొట్టేసారు.ఇంతకీ అతను పాసు అయ్యాడో లేదో ఆ ప్రాక్టికల్ క్లాసు,పాపం!మాకు అందరికీ హిందీ తెలుసు కాబట్టి ఎక్కువగా మాతో మాట్లేజే వాళ్ళు.వాళ్ళ క్లాసులు జరిగినన్ని పీరియడ్స్ భలే ఉండేది.ఏమీ సీరియస్ గా వినక్కరలేదు.అర్థం చేసుకో అక్కరలేదు..మా వెనకల మొత్తం వాళ్ళ స్టూడెంట్స్,టీచర్స్ కూర్చుని అసెస్ చేస్తుండేవాళ్ళు.పాఠం చెప్పే అతను మటుకు టెన్షన్ కి చమటలు కక్కుతూ ఉండేది.ఎంతైనా మా స్కూలు జ్ఞాపకాలు చాలా మథురం.

Monday, April 6, 2026

Oh my Lord!save the world!

చిన్నప్పుడు ఎడమ చెయ్యి వాటం.బలపం ఎడమ చేత్తో పట్టుకోకూడదు,సరస్వతి దేవికి కోపం వస్తుందని మా మహదేవయ్య అయ్యవారు.కుడిచేతికి బలవంతంగా మార్పించారు.ఇంకేముంది?అంతా అయోమయం,గందరగోళం.నా చేతుల మీదుగా ఎన్ని జారి పోయాయో,ఇంకెన్ని పగిలిపోయాయో లెక్కలేదు.సరిగ్గా పట్టుకున్నానా,సరి అయిన చేతితో పట్టుకున్నానా అనే జంకు నా కాన్ఫిడెన్స్ ని చంపేసింది.మా వాళ్ళకు నేను వాళ్ళలా డాక్టరు కావాలని కోరిక.ప్రజలు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళ కోరిక తీరని కోరికగా మిగిలిపోయింది.కాలేజీలో మా కెమిస్ట్రీ మేడమ్ అరిచేది.ఏ చేత్తో బ్యూరెట్ పట్టుకోవాలో,ఏ చేత్తో కోనికల్ ఫ్లాస్క్ పట్టుకోవాలో తెలియని వాళ్ళందరూ బి.ఎస్సీ కి వస్తారు అని.వాల్యుమెట్రిక్ అనాలసిస్ ప్రాక్టికల్స్ క్లాస్లో జరిగేది ఈ గొడవ.ఇట్లా ఉంటే డాక్టరు అయితే పేషంట్స్ భయపడరా? చిరంజీవి సినిమాలో లాగా ఓ మై లార్డ్ అంటూ కోర్టులో ప్రత్యర్థులను గడగడలాడించాలి అని కోరిక.మర్డర్ చేసి,వాదించి,గెలిచి,శిక్ష పడకుండా విజయగర్వంతో కోర్టు బయటకు రావాలని తపన. ఇంకేముంది?పని గట్టుకుని ఈవినింగ్ కాలేజీలో చేరి బి.ఎల్ చేసాను.చేతిలో ఉన్న ఉద్యోగం వదిలేసి రోరింగ్ ప్రాక్టిషనర్ కావాలని అభిలాష.కానీ ధైర్యం చాలలేదు.కనీసం రిటైరు అయిన తరువాత అయినా బార్లో ఎన్రోల్ కావాలనుకున్నాను.మా వాళ్ళకు పర్మిషన్ కు అప్లై చేస్తే జోన్స్ మారాయి.మా దగ్గర రికార్డ్స్ లేవంటే మా దగ్గర లేవని అన్నారు.సెర్వీసులో ఉండగా చేసాను కాబట్టి,బాంకు పర్మిషన్ తీసుకున్నానో లేదో అని అనుమానం వాళ్ళకు.తీరా నాకు అప్రూవల్ వచ్చేటప్పటికి కోవిడ్ వచ్చింది.ఇంకేముంది?నాకు మనసు విరిగిపోయింది.దేవుడు ప్రజలను ఊపిరి తీసుకోనిస్తున్నాడులే పాపం అనుకున్నాను.

Saturday, April 4, 2026

తథాస్తు దేవతలుంటారు,జాగ్రత్త!

చిన్నప్పుడు మనం తప్పుగా,నెగటివ్ గా మాట్లాడితే అమ్మావాళ్ళు అడ్డుకునేవాళ్ళు.తథాస్తు దేవతలు ఉంటారు పైన.మనం ఏది అనుకుంటే దానికి తథాస్తు అంటారు.కాబట్టి ఎప్పుడూ మనం మంచే కోరుకోవాలి అని చెప్పేవాళ్ళు.అది ముమ్మాటికీ నిజం. పెళ్ళైన తరువాత చాలా సంతోషంగా ఉండేది.బిడ్డలు,భర్త,ఉమ్మడి కుటుంబం.మా మామగార్లు ఉమ్మడిగా ఉండేవాళ్ళు.కాబట్టీ ఇంట్లో వంటా వార్పులకు అత్తలూ,ఆడబిడ్డలు.బయట పనులకు మామగార్లు,మరుదులు.ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టపళ్ళేదు.సినిమాలు,షికార్లూ,పార్టీలు.దిల్ ఖుష్!అప్పుడు దేముడికి సింపుల్ గా తాంక్స్ అని చెప్పుకోవచ్చు కదా!ఊహూ!అట్లా అయితే ఎట్లా?అథనప్రసంగులమూ,అతి చేసే వాళ్ళము కదా! నేను ఇలా మ్రొక్కుకున్నాను.స్వామీ!నాకు డబ్బులు లేకపోయినా పరవాలేదు,మనశ్శాంతి మటుకూ ఎప్పుడూ ఉండేలా చెయ్యి.దేవుడు బిజీ కదా!మనలాంటి వాళ్ళు కోర్కెలుకోరేదానికి యుగాలు నుంచీ క్యూ లో ఉంటారు.ఆయన ఏమి చేశాడు?మొదటి సగం విన్నాడు.ఓకే అన్నాడు.అంటే డబ్బులు అక్కరలేదు కదా నీకు.నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆడదులే ఇంక అని ఒట్టు పెట్టుకున్నాడు.మనశ్శాంతి ప్రసాదించు స్వామీ అన్నది వినలేదు,వినిపించుకోలేదు అసలు.50% సాంక్షన్ చేసాము కదా చాలు చాలు అనుకున్నట్లున్నాడు.దీని పర్యవసానం ఏంది?డబ్బులు లేక అడక్కతినే స్టేజ్ కి వచ్చాను.మనశ్శాంతి అంటే ఏంది? ఎట్లుంటుంది?దాని కథా కమామిషు ఏందో తెలియని స్టేజ్ కి వచ్చాను.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది పరిస్థితి. తప్పయింది స్వామీ,క్షమించు.నాకు డబ్బులూ కావాలి.మనశ్శాంతి కావాలి అని క్యూలో నిలుచుకున్నాను.దేవుడికి తీరిక చిక్కి నా మొర ఆలకించే సమయానికి పుణ్యకాలం అయిపోయింది.మూడొంతుల జీవితం జారి పోయింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏందంటే ఎప్పుడూ సింపుల్ సెన్టెన్స్ లే మాట్లాడాలి.మన ప్రతిభా పాటవాలు చూపించాలని కాంపౌండ్ సెన్టెన్స్,కాంప్లెక్స్ సెన్టెన్స్ లలో మాట్లాడితే వినే వాళ్ళకి సమయమూ ఉండదూ,ఓపికా ఉండదు అర్థం చేసుకునేదానికి.కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్!

Thursday, April 2, 2026

తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరా?

నాకు చిన్నప్పటినుంచి ఎదుటివారిలో తప్పులేరడం ఒక అలవాటు.వారిని కించ పరుస్తున్నాను అనిపించదు.సరిదిద్దుతున్నాను అని అనుకుంటాను.మా చిన్నప్పుడు మా ఇంగ్లీషు అయ్యవారు గ్రామర్,స్పెల్లింగ్స్,పంక్చుయేషన్ చాలా బాగా నేర్పించాడు.కాబట్టి ఎవరైనా తప్పులు రాస్తే భలే కోపం నాకు.దానికి తోడు బాంకులో కౌంటర్లో ఉద్యోగం.అందరి చెక్కులు చదివి పాస్ చెయ్యాలి.ఒకరు two కి బదులు to అని రాస్తారు.ఇంకొకరు eleven కి leven అని రాస్తారు.నాకు సర్ అని కోపం వచ్చేది.వాళ్ళను అక్కడే గుంజీలు తీయించి,గోడ కుర్చీ కూర్చోపెట్చినంత పని చేసేదాన్ని.పిలిచి ఇంగ్లీషులో రాక పోతే తెలుగులో రాయొచ్చు కదా!ఏడు కు స్పెల్లింగ్ చెప్పు,పదకొండుకు స్పెల్లింగ్ చెప్పు అని వాళ్ళ చేత ఒప్పచెప్పించి మళ్ళీ కొత్త స్లిప్ రాయించేదాన్ని.వాళ్ళు మళ్ళీ బాంకుకు వచ్చేదానికి భయపడేలా సాధించేదాన్ని.ఎవరైనా తప్పుగా సెన్టెన్స్ ఫార్మ్ చేసినా,గ్రామ్మర్ తప్పులు చేసినా నా దృష్టిలో ఎక్కడకో క్రిందికి పడిపోయేవాళ్ళు. అట్లా భలే గర్వానికి పోయేదాన్ని.దానికి శిక్ష అనుభవించే రోజు వచ్చింది.మా అబ్బాయి నా కోసం బ్లాగ్ క్రియేట్ చేసిచ్చాడు.ఇంక నా ఇక్కట్లు మొదలు.ప్రాపర్ గా టైపింగ్ నేర్చుకోలేదు.కీ బోర్డ్ మీద లెటర్స్ కొడుతుంటే ప్రతి వాక్యానికి ఒక తప్పు అయినా వచ్చేది.అవి ఎలా సరిదిద్దాలో తెలిసేది కాదు.కాపిటల్ లెటర్స్ వాడాల్సిన చోట్ల తప్పి పోయేది.వాక్యం కొసన ఫుల్ స్టాప్ గంగలో దూకేసేది.టైప్ చేసే తొందరలో తెలిసిన స్పెల్లింగ్స్ కూడా తప్పు అయ్యేవి.తప్పులు ఉన్నాయని తెలిసినా పోస్ట్ చేసేదాన్ని.అబ్బాయి తెలుగు టైపింగ్ వేర్పించే దానికి ప్రయత్నించినా నేర్చుకోలేకపోయాను.ఫలితం?తెలుగు ఇంగ్లీషు లెటర్స్ లో వ్రాయటం మొదలు పెట్టాను.అందరూ వ్యంగ్య బాణాలు వేసారు.లెక్క చేయకుండా,విక్రమార్క విజయంలాగా ముందుకు పోయాను.ఈ మధ్య తెలుగు టైపింగ్ నేర్చుకున్నాను.అది వేరే విషయం. దాని వలన నాకు తెలిసింది ఏమిటంటే మనిషికి గర్వం పనికి రాదు.మనకు ఆవగింజలో అర్థభాగం కూడా తెలియక పోయినా...ఓ అని ఫీల్ అయిపోతాము.మనము వేరేవాళ్ళలో చూపించిన తప్పులే మనము చేయాల్సి వస్తే ఆ ఆత్మన్యూనత వర్ణనాతీతం!ఒకప్పుడు అందరినీ జడ్జ్ చేసేదాన్ని.మా మనవళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు నా పని పడుతున్నారు.అమ్మమ్మ మెట్లమీద నుంచి ఎంత చిన్నగా దిగేది చేసి మరీ చూపిస్తారు.వాళ్ళు చిన్నగా మాట్లాడితే అసలు అర్థం కాదు.మళ్ళీ మళ్ళీ అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతుంటాను.దీనినే కదా అస్తాయిస్తం అనేది. ఎదుటి వారిని ఆక్షేపించడం చాలా తేలిక.మనల్ని మనం సరిదిద్దుకోవడం బ్రహ్మ ప్రళయం అని అనుభవం లోకి వచ్చింది.

Tuesday, March 24, 2026

కోరికలే గుర్రాలయితే…..పరవాలేదు

కోరికలు గుర్రాలు కాకూడదు అనేవాళ్ళు పాతరోజుల్లో.ఏభై ఏళ్ళ క్రితమే కాలేజీలో నన్ను బుల్లెట్ అని,బాంకులో చేరిన కొత్తల్లో జెట్ అని అనేవాళ్ళు.ఇప్పుడు బుల్లెట్ బుూఢీ అయింది.జెట్ కాస్త జేజెమ్మ అయింది.అదే నేను చెప్పేది.ఇంకా గుర్రాలూ,గూడ్స్ బండ్లు ఏంది?కోరికలు గుర్రాలు అంటే మనము,మన మనసు నేల పైన ఉన్నట్లే కదా!ఇప్పుడు అయితే సూపర్ సానిక్ గా ఉన్నాయి కోరికలు.ఒక కోరిక రూపు దిద్దుకునే లోపలే సవాలక్ష కోరికలు క్యూ కట్టి ఉంటున్నాయి.మనకు ఏది కావాలో రాండమ్ గా పిక్ చేసుకోవాలి.పాత కాలంలో మనవాళ్ళ కోరికలు వేళ్ళ పైన లెక్క పెట్టగలిగేలా ఉండేవి.అందులో మధ్య తరగతి వాళ్ళకు అయితే ఒకటి,మహా అయితే రెండు.అంతకు మించి అత్యాశకు పోయేవాళ్ళుకాదు.ఏదే ఒక ఇల్లో,ఆడబిడ్డ పెళ్ళో,పిల్లవాడి చదువు,ఉద్యోగమో...అంతే! ఇప్పుడు పిల్లు కన్సీవ్ కాకుండానే వాళ్ళ భవిష్యత్తు ప్లాన్ చేస్తున్నారు.పుట్టబోయే బిడ్డలు ఎక్కడ పుట్టాలి,ఎక్కడ చదవాలి,ఏమి కావాలి,ఇంకేమి కావాలి?పుట్టబోయే బిడ్డ ఆడో,మొగో కూడా ప్లాన్ చేస్తున్నారు.పిల్లల ఆలోచనలకు,అభిప్రాయాలకూ,ఇష్టా ఇష్టాలు,వారి సత్తా...ఏదీ ముఖ్యం కాదు.మరీ ఇంత అవసరమా?

Sunday, February 22, 2026

Punch కంటే పనికి మాలిన వాళ్ళమా?

ఈ మధ్య జపానులో ఒక జూ లో పంచ్ అనే ఆరు నెలల కోతి పిల్ల వీరగాథలు వింటున్నాము.పుట్టగానే అమ్మ వదిలేసింది.ఆరు నెలలు జూ వాళ్ళు చూసుకొని చిన్నగా ఆకోతుల గుంపులోకి వదిలారు.అవి చేర్చుకోలేదు.అప్పుడు దానికి ఒరాంగుటాన్ కోతి బొమ్మ ఇచ్చారు.అప్పటి నుండీ ఆ కోతి పిల్లకు కష్టమొచ్చినా ఆ బొమ్మే,నష్టం వచ్చినా,ఇష్టం వచ్చినా,భయమేసినా,బాధ వేసినా,నిద్రొచ్చినా,మెలకువ వచ్చినా ...ఆ బొమ్మే సర్వస్వం అయింది.కానీ ఆ కోతి పిల్ల నిరాశ పడలేదు.నీరుగారి పోలేదు.పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంది.ఇప్పుడిప్పుడే మిగిలిన పెద్ద కోతులు దానిని ఆదరిస్తున్నాయట! ఎంత స్పూర్తి దాయకం కదా దాని జీవితం!అనాధ అని సెల్ఫ్ పిటీ ఫీల్ కాలేదు.ఎవరి సహాయం లేకుండానే సర్వైవ్ అయింది.అప్పుడెప్పుడో డార్విన్ చెప్పాడు కదా!in the struggle for existance survival of the fittest అని.ఈ స్టేట్ మెంటుకు ప్రతీకగా నిలిచింది. అది ఒక ఆరు నెలల కోతి పిల్ల.మనకున్నంత తెలివి తేటలు లేనిది.కానీ ఎంత ధైర్యం చూపించింది.అది ఆధార పడిన కోతి బొమ్మ ది బెస్ట్ కాకపోవచ్చు,కానీ ఆల్వేస్ బెటర్ ఆప్షన్. దానీ సహాయంతో నిలదొక్కుకుంది.తన తోటి కోతులతో స్నేహ హస్తం చాస్తూ వాటిలో ఒకటవుతుంది. మనమూ ఉన్నాము.ఎవరైనా వద్దన్నా,ఏ చిన్న కష్టమొచ్చినా బర్రెల్లాగా ఏడుస్తాము.డిప్రెషన్ అని ఆరు నెలలు తలుపులు మూసుకుని,బయట ప్రపంచంతో సంబంధాలు కట్ చేస్తాము.దేవదాసు టైపులో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ దీనంగా పాడుకుంటాము. నిజంగా సెల్ఫ్ పిటీ, నెగటివిటీ అంత అవసరమా.జీవితంలో ముందరకు అడుగులు పడాలి.ఎక్కడా,ఏ విషయానికీ ఆగిపోకూడదు.

Friday, February 20, 2026

Step by step…till the last step

మనము ఏదైనా క్షుణ్ణంగా నేర్చుకోవాలి.ఊరికినే దాటుకుని పోతామంటే కుదరదు.అలాంటిది నిలవదు,నిలబడదు. ఉదాహరణకు తెలుగు నేర్చుకోవాలి అనుకో.అ,ఆ ల నుంచి మొదలు పెట్టాలి.అచ్చులు,హల్లులు అయిన తరువాత గుణింతాలు నేర్చురోవాలి.చిన్నగా పదాలు,పద్యాలు,వచనాలు,వాచకాలు,సంథులు,సమాసాలు దాకా రావాలి.ఆ తరువాతే గ్రంథాలూ,ప్రబంథాలూనూ! గుడి,గుడి దీర్ఘాలూ అన్నీ దండగ,అన్నీ దాటుకుని పోదాము అనుకుంటే ఎక్కడో ఒకక్కడ బోళ్ళా పడతాము.పునాది పటిష్టంగా లేకపోతే చిట్ట చివరన ప్రశాంతంగా ఎక్కువ కాలం మనలేము. కాబట్టి మన జీవితానికి సంబంథించి తీసుకునే ప్రతి విషయం,ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి,ప్రణాలిక వేసుకుని పాటించాలి.ఎందుకంటే ఏదీ ఆషామాషీగా రాదు.కొన్ని సార్లు నిజంగా మనసు పెట్టి కష్టపడినా దక్కదు.అలాంటిది మన కష్టం,మన నిబ్బరం,మన నిజాయితీ లేకుండా ఏదైనా దక్కినా దాని విలువ నిజంగా మనం తెలుసుకోలేము,నిలబెట్టుకోలేము. కష్టపడినవాడు ఎప్పుడూ నష్టపోడు.నిజాయితీ విలువెరిగినవాడు నీరుగారిపోడు.ఖచ్ఛితంగా జీవితంలో నిలదొక్కుకుంటాడు.

Thursday, February 19, 2026

గుడిలో ప్రదక్షిణలు గబ గబా

మనము మాములుగా గుడికి వెళితే ప్రదక్షిణలు చేస్తుంటాము కదా!ఎందుకు?పవిత్రమయిన స్థలానికి వచ్చాము.మూలవిరాట్టు చుట్టూ తిరుగుదాము.అక్కడ ఎక్కువ సేపు గడుపుదామని కదా! కానీ కొంత మంది ఉంటారు.రయ్ రయ్ మంటూ ఉరుకులు,పరుగులు మీద తిరుగుతుంటారు.ప్రక్కన వాళ్ళని పట్టించుకోరు.వాళ్ళదారికి అడ్డం ఎవరైనా వస్తే చాలు.విసుగు,చీదర,కోపం,అసహనం వాళ్ళ మొహాలలో తాండవం చేస్తుంటుంది.మనము గుడికి వెళ్ళేదే వాటిని పోగొట్టుకునేదానికి కదా!ప్రదర్శించే దానికి కాదు గదా! ఇంకో వర్గం సాయంత్రం షికారుకు వచ్చినట్లు వస్తారు.చేతిలో సెల్ఫోనులో నాన్ స్టాప్ మాట్లాడుతూ,చాటింగ్ చేస్తూ,బ్రౌస్ చేస్తూ!నిజంగా నిబద్ధతతో ప్రదక్షిణలు చేసేవారికి అందరికీ అనవసరపు డిస్ట్రాక్షన్స్ కదా! మనము ఆలయాలకు పోయేది మనశ్శాంతి కోసరము ముఖ్యంగా.మనకు విజ్ఞత,వివేకము,ఆత్మశాంతి ప్రసాదించమని స్వచ్ఛందంగా ఆ పరమేశ్వరుడిని కోరుకునేదానికి కదా! కాబట్టి నాలుగు ఘడియలు అలా ఉండగలము అనుకుని పోతే మంచిది అని నా అభిప్రాయము.హడావుడి,హంగామా,గందరగోళం,గలభా లేకుండా.

Wednesday, February 18, 2026

మరీ మూడు చుక్కల ముగ్గా?

మాములుగా మనము ఇంటి ముందర చిమ్ముకుని,ముచ్చటగా ముగ్గు వేసుకుంటాము.శుభ్రత,కళగా ఉండాలి అని.కానీ పోను పోనూ అది పోటీ అయిపోతుంది...ప్రక్క వాళ్ళతోటి,ఎదురింటి వీళ్ళతోటి.నాలాంటి వాళ్ళు అసలు మొదటి నుంచీ పోటీలో ఉండరు.ఎందుకంటే మూడు చుక్కల ముగ్గు కంటే పెద్ద ముగ్గు రాదు కాబట్టి.దానికి కూడా పాలుమాలి ఒక నక్షత్రమో లేక ఒక పద్మమో వేసి వచ్చేస్తాను కాబట్టి ఎంత పెద్ద పండగ అయినా! కొంత మంది వాళ్ళ ఇంటి వాకిలే కాకుండా,ప్రక్క ఇంటి వాకిలి కూడా ఎంక్రోచ్ చేస్తూ ఉంటారు ముగ్గుల కోసం.పోను పోనూ అది ఒక తపన లాగా అయిపోతుంది.ఈ రోజు పదహారు చుక్కల ముగ్గు వేసాము,రేపు ఇరవై ఆరు చుక్కల ముగ్గన్నా వేయాలి.అందరూ ఖంగు తినేలా చెయ్యాలని. ఎవరి పిచ్చి వాళ్ళకానందం అనుకో!కానీ మనకు అది ఒక్కటే కాదు కదా పని?పొద్దున లేస్తే సవాలక్ష పనులు ఉంటాయి.గంటలు గంటలు వీథి వాకిట్లో ముగ్గులు వేస్తూ కూర్చుంటే,మిగిలిన పనులు ఎవరు చేస్తారు?ఏదో ఒక కర వేసి ఇంట్లోకి రాకుండా. ఏదో పండగకో,పబ్బానికో మంచిగా,పెద్దగా,ఆకర్షణీయంగా వేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయము.ముగ్గు పిండి చేతులో ఉంది కదా అని ముప్పొద్దులూ ముగ్గులు వేస్తూ కూర్చోకుండా ఇంటి ముందర. మనము పండగకో,పబ్బానికో ,శుభకార్యానికో పప్పు,పాయసము,వడలు,పులిహోర చేసుకుంటే బావుంటుంది.అన్నీ వెసులుబాటులో ఉన్నాయి కదా అని రోజూ చేసుకుని,చేసుకున్న పాపానికి తింటూ కూర్చుంటే ఏమవుతుంది?భుక్తాయాసం,భుజగశయనం,బానపొట్ట వేసుకుని,అడుగడుగుకీ బుసలు కొట్టుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఇంతకీ నేను చెప్పేది ఏందంటే అతి సర్వత్ర వర్జయేత్ అని మాత్రమే!సమయాన్ని సరిగ్గా,సమయస్పూర్తితో వాడుకోవాలి.సమయపాలన ఉండాలి.ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ,ఎంత శ్రమ పడితే చాలో అంతే శ్రమ పడితో శ్రేయస్కరము.ఊళ్ళోవాళ్ళ కోసరము కాకుండా మనకోసం బ్రతికితే చాలు.

Friday, February 13, 2026

పనిదొంగల పరాకాష్ఠ

సహజంగా పనిదొంగలను మనము ఇండ్లలోనే తయారుచేస్తాము.అది ముమ్మాటికీ నిజం.చాలాసార్లు అతి ప్రేమతో,అంతా మనవాళ్ళే కదా అనుకుంటూ.ఆఖరికి వాళ్ళు కొరకరాని కొయ్యలు అవుతారు. చిన్న పని చెప్తే చేయడం నామోషీ అనుకుంటారు.సరే అని పెద్దపని చెబితే ....అస్సలు నేను ఉండాలనా,ఊడాలనా..ఇంత పెద్ద పనులు నేను ఎక్కడ చేస్తాను అని అంటారు.ఇంక బాగా ఆలోచించి,ఒక మోస్తరు పెద్ద పని చెప్తాము.నీవు ఆ పని గురించి మరిచి పో.అయిపోయింది అనుకో అని భరోసా ఇస్తారు.ఇన్నాళ్ళకు మనవాళ్ళు పనిమంతులు అవుతున్నారు అని మురిసిపోతాము.ఆ రోజు రానే వస్తుంది,పోనూ పోతుంది.షరా మామూలే!పని మటుకు కాదు.ఏంది అని అడిగేలోపలే తమను తాము తిట్టుకుంటారు.నావల్ల నీకు ఏమీ లాభం లేదని వాపోతారు.కనీసం తిట్టి,ఆక్రోశం తగ్గించుకునే అవకాశం కూడా ఇవ్వరు. లేదా...ఎన్టీఆర్ సినిమా విడుదల.ఎంత మంది టిక్కెట్లు దొరక వెనక్కి వెళ్ళిపోయారో తెలుసా!నేను తెలివిగా క్యూలో వాళ్ళ భుజాలమీద నడిచివెళ్ళి టికెట్టు సంపాదించాను.ఒళ్ళు హూనమైపోయింది అని సెలవిస్తారు. కొంత మంది ఉంటారు.రావడం రావడం ఏదో ఒక పనిలోకి దూరిపోతుంటారు.వీళ్ళు మటుతు తలపైన తుపాకీ పెట్టి బెదిరించినా తొణకరు,బెణకరు.నీ ఇష్టం వచ్చింది చేసుకో!నేను మాత్రం కదలను అని కూర్చుంటారు. వీళ్ళకి ఇంకో ప్రతిభ కూడా ఉంటుంది.నేను నీ కంటికి అసలు ఆనను.నాకు పనులు చెప్పనే చెప్పరు.చెబితేకదా ఎవరైనా నేర్చుకునేది అని మనపైనే నిందలూ,నిష్టూరాలు. అలకలకైతే ఇంక కొరవే ఉండదు. మనకు పోను పోనూ ఎంత విసుగు పుడుతుందంటే...ఇంకో రెండు నిముషాల్లో ప్రాణం పోయేటట్లు ఉంది అన్నామే అనుకో....కాళ్ళకి,వ్రేళ్ళకీ తాళ్ళప కట్టుకుని పడుకో.ఆ పనికి మాలిన పనులు అన్నీ చేయలేను,నా వల్లకాదు అని అంటారేమో అని.

Thursday, February 12, 2026

ఎప్పుడు,ఎక్కడ,ఎలా,ఎంతలా….

ఎవరికీ సరిగ్గా స్పందించడం రాదని నా నమ్మకం.ఎందుకంటే నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా బాగున్నారా అని అడిగారు అనుకో!ఏమీ,ఇక్కడ ఎవరికీ మాయరోగాలు ఏమీ లేవు అన్నట్లు చూస్తారు కొంతమంది.ఇంకొకరు మొదలు పెడతారు.మొన్న దగ్గాను.నిన్న తుమ్మాను.ఆ మొన్న ఆకలి అయితే కుంభాలు,కుంభాలు లాగించాను అని.అడిగిన వాడు ఎందుకు అడిగామురా స్వామీ అంటూ చెంపలేసుకోవాలి.వేరొకరు నిర్వికారంగా,మనము ఏమీ అడగనట్లు,వారు ఏమీ విననట్లు శూన్యంలోకి చూస్తారు. నా మటుకు నాకు ఎందుకు,ఎప్పుడు,ఎవరిపైన,ఏ రేంజ్లో కోపం వస్తుందో నాకే తెలియదు.ఎవరైనా బాగున్నారా అంటే ఒక్కొక్కసారి వ్యంగ్యంగా అంటున్నారు అనిపిస్తుంది.చంపుతాము,నరుకుతాము అని వస్తే..।పాపం!ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో!ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసుకుని శాంత పరుస్తాము అనిపిస్తుంది. బిడ్డలు తప్పు చేస్తే నిజంగా కోపం రాదు అమ్మలకు.కానీ కోపపడినట్లు నటిస్తారు,పిల్లలకు భయం తెలిసేదానికి. మనము ప్రతి ఒకళ్ళకూ,వాళ్ళ చేష్టలకూ స్పందిస్తూ పోతే మనకంటూ ఒక జీవితం ఉండదు.కాబట్టి ఖచ్చితంగా కొందరి మాటలు,చేతలు ఇగ్నోర్ చెయ్యాలి .తప్పదు.మన మంచి కోరేవారి అభిప్రాయాలకు విలువనివ్వాలి.

Wednesday, February 11, 2026

సమయానికి లేనిది…..

మా బాబు(నాన్న)చిన్నప్పుడు విసుకుగా ఉంటే తరచూ ఈ మాట అనేవాడు.సమయానికి లేనిది చంక నాకనా!అని.అంటే అంత ఫ్రస్ట్రేషన్ అన్నమాట.ఎంతైనా సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి కదా! మనము గోచీ కొనేదానికి కూడా ఇబ్బంది పడుతుంటాము.మన శ్రేయోభిలాషులు(!)ముప్పై ఏళ్ళ తరువాత వచ్చే షష్టి పూర్తికి పట్టు వస్త్రాలు చదివించాలని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు.ఆ రోజుల్లో భాక్రా నంగల్ ప్రాజెక్ట్ ప్రణాలిక లాగా వేస్తారు.ఇప్పటి నుంచే బాంకులో రికరింగ్ డిపాజిట్ మొదలు పెడతామంటారు. ఇంకో వర్గం ఉంటుంది.వాళ్ళకు మన కష్టాలూ,కడగళ్ళూ అన్నీ తెలుసు.గూఢాచారి జేమ్స్ బాండ్ 007 కూడా వీళ్ళ ముందు దిగదుడుపే!కానీ మనము కొంచెము సర్దుకున్న తరువాత వచ్చి వాళ్ళ నటనా కౌశలము అంతా చూపిస్తారు.ఒక్క మాట చెప్పి ఉండకూడదా?కనీసం ఒక్క సైగ చేసి ఉన్నా రెక్కలు కట్టుకుని వాలిపోయి ఉంటాము కదా!అని వాపోతుంటారు.భలే నమ్మేస్తాము. ఆఖరుగా కొంత మంది ఉంటారు.వాళ్ళు నిజంగా మన మంచి కోరే వాళ్ళు.నిజంగా మన ఇబ్బందులు వాళ్ళకి తెలిసి ఉండవు.వాళ్ళు నిజంగా మన దగ్గరకొచ్చి బాథ పడతారు.అప్పుడు మనము ఏమి చేస్తాము?మన ఆక్రోశం అంతా వాళ్ళ పైన వెళ్ళగ్రక్కుతాము.నోటికొచ్చినట్లు చెడా మడా తిడతాము.అలాంటి వాళ్ళను అస్సలు నమ్మము దేవుడు దిగి వచ్చి చెప్పినా!ఇలా మన మంచికోరేవారిని చేజేతులా పోగొట్టుకుంటాము. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే...కష్టాలూ,కడగళ్ళూ,నష్టాలూ ప్రతి ఒక్కరి జీవితంలో,ఏదో ఒకప్పుడూ,ఏదో ఒక రకంగా వస్తూ ఉంటాయి.మనము మనుష్యులను సరిగ్గా బేరీజు వేసుకోవాలి.నోరు అదుపులో పెట్టుకోవాలి.కొంచెం కుదురుగా ఆలోచించి వ్యవహరించాలి.మంచి వాళ్ళని పోగొట్టుకుని ఏకాకులు కాకూడదు.

Sunday, February 8, 2026

Good guestures do matter

మొన్న పిల్లల దగ్గరకు అని బయలుదేరాను.చెన్నై ఎయిర్ పోర్టులో నీళ్ళ కోసం పోతుంటే బృందావనంలో కృష్ణుడు బొమ్మ కనిపించింది.ఆ ప్రక్కనే పది మంది పిల్లలు ఫోటోలు తీసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.వాళ్ళలో ఒక అమ్మాయిని ఫోటో తీయి పాపా అని అడిగాను.సరే అని తీస్తుణ్ణింది.ఆ ప్రక్కనే ఒక అబ్బాయి మాతో కూడా ఒక ఫోటో తీసుకోండి ఆంటీ,మీ పిల్లలు అనుకోండి అన్నాడు.మా పిల్లలు మీకు అంటే చాలా పెద్ద అన్నాను.అయితో మీ మనవళ్ళు,మనవరాళ్ళు అనుకోండి అని అందరూ వచ్చి గ్రూప్ ఫోటో తీసుకున్నారు.మీరు ఒక్కరే వెళుతున్నారా అంటే అవునమ్మా అని అన్నాను.అమ్మాయిలు అందరూ గ్రేట్ అంటూ వరసగా హగ్గులు,అబ్బాయిలు అందరూ షేక్ హాండ్స్! చాలా సంతోషం అనిపించింది నాకు.అందరూ,అందులో యంగ్స్టర్స్ వావ్ అనే మెటీరియల్ కాదు నేను.క్రొత్తగా చేయించుకున్న కొండ గుండు విత్ సిల్వర్ లైనింగ్ హేర్!అంతేనా?నవ్వితే నాలుగు పళ్ళు మిస్సింగ్?ఏమి అంత కక్కుర్తి?పళ్ళు కట్టించుకోవచ్చుగా అని ఉచిత సలహాలు.ఏంది కట్టించుకునేది?ఏడంతస్తుల మేడలు!ఒకటి కట్టమని అడిగితే ఈ తట్టు నాలుగు,ఆతట్టు నాలుగు పీకాలంటారు.అప్పుడు గానీ అంబుజా సిమెంటుతో కట్టడంలాగా పటిష్టంగా ఉండదు అని అంటారు. మీరు చెప్పండి.డెబ్బై ఏళ్ళుదాటిన తర్వాత గోడకు కొట్టిన మేకుల్లాగా ఎవరికి ఉంటాయి పళ్ళు గట్టిగా?వాటికి తెలిసినంతలో హిప్ హాప్ డాన్స్ లో,జాజ్ డాన్సులో చేసుకుంటూ ఉంటాయిగానీ!కొన్ని బాక్ స్టేజికి వెళుతుంటాయి. అలాంటి నన్ను ఆ పిల్లలు దగ్గరకు తీసుకుని ప్రేమలు పంచడం నాకు చాలా నచ్చింది. నాకూ ఫాన్స్ ఉన్నారోచ్ అనుకుని తెగ మురిసిపోయాను.really I thank all those kids for boosting up my morale.thank you again!

Saturday, January 3, 2026

క్రీనీడల్లో నా నీడ

physicsలో absolute heat,apparent heat అని చదువుకున్నాము కదా!మన విషయంలో కూడా అలాగే ఉంటుంది.మనం నిజంగా ఏందో ఎవరికీ తెలియదు.apparent heat అంటే మనకు అనిపించే వేడి.అసలు వేడికి వాతావరణంలో ఉండే తేడాలతో కలుపుకుని మనకు అనిపించేది.absolute heat అంటే అసలు సిసలు నిఖార్సు అయిన వేడి. మనము ఏంటో మనకే చాలా సార్లు అర్థం కాదు.అలాంటిది ఎదుటి వాళ్ళు మనలని సరిగ్గా అర్థం చేసుకోలేదని బాథ పడటం ఎంత వరకు సమంజసం? ఎదుటి వాళ్ళు మనలని అర్థం చేసుకోవడం అంటే మనలని కాకుండా మన నీడని బేరీజు వేస్తున్నట్లు లెక్క.మన నీడ నీరెండలో మనకంటే పొడుగ్గా ఉంటుంది.సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే కొద్దీ మనకంటే పొట్టి అవుతుంది.మిట్ట మధ్యాహ్నానికి అది మనపైనే పడి వేరే నీడ ఏమీ కనిపించదు.క్రీనీడలో మసక మసకగా కనిపిస్తాము.చిమ్మ చీకటిలో అసలు నీడ అనే ప్రసక్తి ఉండదు.అంటే మనము లేనట్లు కాదు కదా!మనలను కొందరు ఆకాశానికి ఎత్తేస్తారు.అందులో నిజమెంత అని మనమే బేరీజు వేసుకోవాలి.కొంత మంది పురుగును చూసినట్లు చూస్తారు,లెక్క చేయరు.మనమేంటో మనకు తెలిసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పని లేదు.చాలా కొద్ది మందే మనలను సరిగ్గా అర్థం చేసుకునేది.వారిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోకూడదు.మరి ఇంకొంత మంది మనలను అసలు మనుష్యులుగా గానీ,అసలు బ్రతికి ఉన్నామని కూడా గ్రహించరు.అంత మాత్రం చేత మనం లేనట్లు కాదు కదా! మనం మన కోసం బ్రతికాలి.విలువలతో బ్రతకాలి.మనవారి కోసం బ్రతకాలి.