Friday, June 19, 2026
తిరుమల కొండ పైన అత్త వంటలు
మా పెళ్ళి అయిన కొత్తల్లో అత్తగారింటి వాళ్ళందరమూ తిరుమల కొండకు వెళ్ళాము.పెద్దత్త,మామ,చిన్నత్త,చిన్నమామ,అందరి పిల్లలు,మా వారు,నేను.దగ్గర దగ్గర పదహైదు మందిమి ఉన్నాము.అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది.ఇంటి నుంచే వంట సామానులు,గిన్నెలు తీసుకెళ్ళాము.పాపం అత్త వాళ్ళు రూముకు వెళ్ళగానే గోతాలలో సామానులు,పప్పులు,బియ్యాలు బయటకు తీసి కట్టెలు ఏరుకుని,రాళ్ళ పొయ్యి పెట్టి వంటలు మొదలు పెట్టారు.ఆ రోజులలో హోటళ్ళు అంటే పెద్దవాళ్ళు ఇష్ట పడరు కదా!అందులో అత్త వాళ్ళకు మడి,ఆచారాలు ఎక్కువ.అందరమూ ముఖాలు కడుక్కుని ఊరికినే అట్లా తిరిగి వస్తాము అని బయలుదేరాము.మా మరదులు,ఆడబిడ్డ వాళ్ళకు బయటకు వస్తే హోటల్ లో తినాలి అని ఆశ.హోటల్ కనిపించగానే ప్రసదన్నా!ప్రసాదన్నా హోటల్కి పోతాము అని అడిగారు.అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు కదరా రూము దగ్గర అని అన్నాడు.కానీ తమ్ముళ్ళు అడిగితే కాదన లేక లోపలకు తీసుకెళ్ళాడు.ఒకరి తరువాత ఒకరు...మాకు మసాలా దోస కావాలి,పూరీ కావాలి,ఇడ్లీ వడ కావాలి అంటూ పోటీలేసుకుంటూ తిన్నారు.వాళ్ళందరూ తింటుంటే మేమెందుకు గమ్మున ఉంటాము?మేము మా సత్తా కొద్దీ లాగించాము.హోటల్ బయటకు వచ్చిన తరువాత రూముకెళ్ళి ఏమి చెప్పాలని తపన.
రూము దగ్గర అత్తావాళ్ళు మాకు పెట్టి తినాలని అన్నమూ,సాంబారు,కూర వేడి వేడిగా చేసి కాచుకుని కూర్చున్నారు.మేము తినేసి వచ్చాము అనగానే భలే బాథ పడ్డారు.వాళ్ళూ అన్ని గంటలు ప్రయాణం చేసారు.అలసట కూడా తీర్చుకోకుండా మా కోసమని అంతేసి వంటలు చేసారు.గుడికి అని వచ్చి చద్దివి రెండో రోజు తినరు కదా!వాళ్ళు తిననివి మాకు పెట్టరు కదా!ఉసూరోమని వాళ్ళు రెండు మెతుకులు నోట్లో వేసుకుని,కానిచ్చారు.
అప్పట్లో మాకు అసలు తెలివి లేదు.మన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని.ఆ స్పృహే లేనప్పుడు,అది ఎల నివారించగలము?
ఇప్పుడు తలచుకుంటే నాకు ఆ తెలివి లేని పనులకు చిన్నతనంగా అనిపిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment