Thursday, July 23, 2026
డెట్టాల్ వాసనంటేనే ఇష్టం లేదు
నాకు చిన్నప్పటి నుంచి వాసనలు అంటే భయం.అప్పట్లో ప్రక్క ఇండ్లలో ఎవరైనా పోతే,ఘాటైన వాసన ఆ వీథి అంతా వచ్చేది.నేను డెడ్ బాడీస్ నుంచి ఆ వాసన అని ఫిక్స్ అయిపోయాను.ఆ వాసన ఎక్కడ వచ్చినా,ఏదో జరగ రానిది జరిగింది అని భయం.చాలా ఏళ్ళ తరువాత కానీ తెలియలేదు,అది సాంబ్రాణి కడ్డీల వాసన అని.అట్లాగే డెట్టాల్ వాసన కూడా!
జువాలజీ ప్రాక్టికల్ క్లాసు లంచ్ ముందర పిరియడ్ వచ్చేది.ఆ కాక్రోచెస్,ఆ స్లైమీ ఫ్రాగ్స్ dissection కాగానే సారు డెట్టాల్ తో చేతులు కడుక్కోమని చెప్పేవాడు.ఏదో ఒక్క చుక్క ఏసుకుంటే చాలు అని తెలిసేది కాదు.మొహం రుద్దుకునేదానికి సబ్బు నురగ వచ్చేటట్లు ఇంతింత వేసుకునేదానిని.చేతులు ఎంత కడుక్కున్నా ఆ వాసన పోయేది కాదు.చేతులు ఇంకా స్లైమీగా,బంక బంకగా ఉన్నట్లు ఫీలింగ్.క్లాసు కాగానే,ఇంటికి పోయి అన్నం తినాలి.అమ్మ పెట్టిన అన్నం అంతా తినక పోతే అమ్మ ఒప్పుకోదు.ముద్ద నోటి దగ్గరకు రాగానే డెట్టాల్ వాసన గుప్పున ముక్కుకు తగిలేది.ఏడుపు వచ్చేది.అట్లానే తిని,కళ్ళు తుడుచుకుంటూ,మళ్ళీ బడికి పరిగెత్తేదాన్ని.
డిగ్రీలో జువాలజీ లో యూనివర్సిటీ టాపర్ ను.కానీ బాటనీలో సీటు రాగానే బాటనీకి మారిపోయాను M.Scలో.చిన్నప్పటి నుంచీ ఆ కాక్రోచ్ మౌత్ పార్ట్స్..తెల్లగా పిండి పిండిగా ఇంటర్నల్ విసరా,స్లైమీ ఫ్రాగ్స్ తో dissections తో విసిగిపోయాను.
ఒక సారి ఒక పార్టీలో మ్యాంగో లస్సీ ఒక పెద్ద జార్ కి చేసి పెట్టి ఉన్నారు.మామిడి పళ్ళు అంటే ఇష్టమే కదా అని అక్కడికి వెళ్ళి,ఒక గ్లాసులో పట్టుకున్నాను.జ్యూస్ ముక్కు దగ్గరికి రాగానే ఆ వాసనకు కడుపులో తిప్పింది.అది చెడిపోయిందేమో,ఎవ్వరూ తాగొద్దు అని చెప్పాలనుకున్నాను.చూస్తే అన్ని చోట్లకంటే అక్కడే క్యూ ఎక్కువ!ఒక్కొక్కరు రెండు,మూడు కప్పులు పట్టుకుని తాగుతున్నారు.అప్పుడు అర్థం అయింది లోపం నాలోనే ఉందని.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment