Sunday, February 22, 2026
Punch కంటే పనికి మాలిన వాళ్ళమా?
ఈ మధ్య జపానులో ఒక జూ లో పంచ్ అనే ఆరు నెలల కోతి పిల్ల వీరగాథలు వింటున్నాము.పుట్టగానే అమ్మ వదిలేసింది.ఆరు నెలలు జూ వాళ్ళు చూసుకొని చిన్నగా ఆకోతుల గుంపులోకి వదిలారు.అవి చేర్చుకోలేదు.అప్పుడు దానికి ఒరాంగుటాన్ కోతి బొమ్మ ఇచ్చారు.అప్పటి నుండీ ఆ కోతి పిల్లకు కష్టమొచ్చినా ఆ బొమ్మే,నష్టం వచ్చినా,ఇష్టం వచ్చినా,భయమేసినా,బాధ వేసినా,నిద్రొచ్చినా,మెలకువ వచ్చినా ...ఆ బొమ్మే సర్వస్వం అయింది.కానీ ఆ కోతి పిల్ల నిరాశ పడలేదు.నీరుగారి పోలేదు.పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంది.ఇప్పుడిప్పుడే మిగిలిన పెద్ద కోతులు దానిని ఆదరిస్తున్నాయట!
ఎంత స్పూర్తి దాయకం కదా దాని జీవితం!అనాధ అని సెల్ఫ్ పిటీ ఫీల్ కాలేదు.ఎవరి సహాయం లేకుండానే సర్వైవ్ అయింది.అప్పుడెప్పుడో డార్విన్ చెప్పాడు కదా!in the struggle for existance survival of the fittest అని.ఈ స్టేట్ మెంటుకు ప్రతీకగా నిలిచింది.
అది ఒక ఆరు నెలల కోతి పిల్ల.మనకున్నంత తెలివి తేటలు లేనిది.కానీ ఎంత ధైర్యం చూపించింది.అది ఆధార పడిన కోతి బొమ్మ ది బెస్ట్ కాకపోవచ్చు,కానీ ఆల్వేస్ బెటర్ ఆప్షన్.
దానీ సహాయంతో నిలదొక్కుకుంది.తన తోటి కోతులతో స్నేహ హస్తం చాస్తూ వాటిలో ఒకటవుతుంది.
మనమూ ఉన్నాము.ఎవరైనా వద్దన్నా,ఏ చిన్న కష్టమొచ్చినా బర్రెల్లాగా ఏడుస్తాము.డిప్రెషన్ అని ఆరు నెలలు తలుపులు మూసుకుని,బయట ప్రపంచంతో సంబంధాలు కట్ చేస్తాము.దేవదాసు టైపులో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ దీనంగా పాడుకుంటాము.
నిజంగా సెల్ఫ్ పిటీ, నెగటివిటీ అంత అవసరమా.జీవితంలో ముందరకు అడుగులు పడాలి.ఎక్కడా,ఏ విషయానికీ ఆగిపోకూడదు.
Friday, February 20, 2026
Step by step…till the last step
మనము ఏదైనా క్షుణ్ణంగా నేర్చుకోవాలి.ఊరికినే దాటుకుని పోతామంటే కుదరదు.అలాంటిది నిలవదు,నిలబడదు.
ఉదాహరణకు తెలుగు నేర్చుకోవాలి అనుకో.అ,ఆ ల నుంచి మొదలు పెట్టాలి.అచ్చులు,హల్లులు అయిన తరువాత గుణింతాలు నేర్చురోవాలి.చిన్నగా పదాలు,పద్యాలు,వచనాలు,వాచకాలు,సంథులు,సమాసాలు దాకా రావాలి.ఆ తరువాతే గ్రంథాలూ,ప్రబంథాలూనూ!
గుడి,గుడి దీర్ఘాలూ అన్నీ దండగ,అన్నీ దాటుకుని పోదాము అనుకుంటే ఎక్కడో ఒకక్కడ బోళ్ళా పడతాము.పునాది పటిష్టంగా లేకపోతే చిట్ట చివరన ప్రశాంతంగా ఎక్కువ కాలం మనలేము.
కాబట్టి మన జీవితానికి సంబంథించి తీసుకునే ప్రతి విషయం,ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి,ప్రణాలిక వేసుకుని పాటించాలి.ఎందుకంటే ఏదీ ఆషామాషీగా రాదు.కొన్ని సార్లు నిజంగా మనసు పెట్టి కష్టపడినా దక్కదు.అలాంటిది మన కష్టం,మన నిబ్బరం,మన నిజాయితీ లేకుండా ఏదైనా దక్కినా దాని విలువ నిజంగా మనం తెలుసుకోలేము,నిలబెట్టుకోలేము.
కష్టపడినవాడు ఎప్పుడూ నష్టపోడు.నిజాయితీ విలువెరిగినవాడు నీరుగారిపోడు.ఖచ్ఛితంగా జీవితంలో నిలదొక్కుకుంటాడు.
Thursday, February 19, 2026
గుడిలో ప్రదక్షిణలు గబ గబా
మనము మాములుగా గుడికి వెళితే ప్రదక్షిణలు చేస్తుంటాము కదా!ఎందుకు?పవిత్రమయిన స్థలానికి వచ్చాము.మూలవిరాట్టు చుట్టూ తిరుగుదాము.అక్కడ ఎక్కువ సేపు గడుపుదామని కదా!
కానీ కొంత మంది ఉంటారు.రయ్ రయ్ మంటూ ఉరుకులు,పరుగులు మీద తిరుగుతుంటారు.ప్రక్కన వాళ్ళని పట్టించుకోరు.వాళ్ళదారికి అడ్డం ఎవరైనా వస్తే చాలు.విసుగు,చీదర,కోపం,అసహనం వాళ్ళ మొహాలలో తాండవం చేస్తుంటుంది.మనము గుడికి వెళ్ళేదే వాటిని పోగొట్టుకునేదానికి కదా!ప్రదర్శించే దానికి కాదు గదా!
ఇంకో వర్గం సాయంత్రం షికారుకు వచ్చినట్లు వస్తారు.చేతిలో సెల్ఫోనులో నాన్ స్టాప్ మాట్లాడుతూ,చాటింగ్ చేస్తూ,బ్రౌస్ చేస్తూ!నిజంగా నిబద్ధతతో ప్రదక్షిణలు చేసేవారికి అందరికీ అనవసరపు డిస్ట్రాక్షన్స్ కదా!
మనము ఆలయాలకు పోయేది మనశ్శాంతి కోసరము ముఖ్యంగా.మనకు విజ్ఞత,వివేకము,ఆత్మశాంతి ప్రసాదించమని స్వచ్ఛందంగా ఆ పరమేశ్వరుడిని కోరుకునేదానికి కదా!
కాబట్టి నాలుగు ఘడియలు అలా ఉండగలము అనుకుని పోతే మంచిది అని నా అభిప్రాయము.హడావుడి,హంగామా,గందరగోళం,గలభా లేకుండా.
Wednesday, February 18, 2026
మరీ మూడు చుక్కల ముగ్గా?
మాములుగా మనము ఇంటి ముందర చిమ్ముకుని,ముచ్చటగా ముగ్గు వేసుకుంటాము.శుభ్రత,కళగా ఉండాలి అని.కానీ పోను పోనూ అది పోటీ అయిపోతుంది...ప్రక్క వాళ్ళతోటి,ఎదురింటి వీళ్ళతోటి.నాలాంటి వాళ్ళు అసలు మొదటి నుంచీ పోటీలో ఉండరు.ఎందుకంటే మూడు చుక్కల ముగ్గు కంటే పెద్ద ముగ్గు రాదు కాబట్టి.దానికి కూడా పాలుమాలి ఒక నక్షత్రమో లేక ఒక పద్మమో వేసి వచ్చేస్తాను కాబట్టి ఎంత పెద్ద పండగ అయినా!
కొంత మంది వాళ్ళ ఇంటి వాకిలే కాకుండా,ప్రక్క ఇంటి వాకిలి కూడా ఎంక్రోచ్ చేస్తూ ఉంటారు ముగ్గుల కోసం.పోను పోనూ అది ఒక తపన లాగా అయిపోతుంది.ఈ రోజు పదహారు చుక్కల ముగ్గు వేసాము,రేపు ఇరవై ఆరు చుక్కల ముగ్గన్నా వేయాలి.అందరూ ఖంగు తినేలా చెయ్యాలని.
ఎవరి పిచ్చి వాళ్ళకానందం అనుకో!కానీ మనకు అది ఒక్కటే కాదు కదా పని?పొద్దున లేస్తే సవాలక్ష పనులు ఉంటాయి.గంటలు గంటలు వీథి వాకిట్లో ముగ్గులు వేస్తూ కూర్చుంటే,మిగిలిన పనులు ఎవరు చేస్తారు?ఏదో ఒక కర వేసి ఇంట్లోకి రాకుండా.
ఏదో పండగకో,పబ్బానికో మంచిగా,పెద్దగా,ఆకర్షణీయంగా వేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయము.ముగ్గు పిండి చేతులో ఉంది కదా అని ముప్పొద్దులూ ముగ్గులు వేస్తూ కూర్చోకుండా ఇంటి ముందర.
మనము పండగకో,పబ్బానికో ,శుభకార్యానికో పప్పు,పాయసము,వడలు,పులిహోర చేసుకుంటే బావుంటుంది.అన్నీ వెసులుబాటులో ఉన్నాయి కదా అని రోజూ చేసుకుని,చేసుకున్న పాపానికి తింటూ కూర్చుంటే ఏమవుతుంది?భుక్తాయాసం,భుజగశయనం,బానపొట్ట వేసుకుని,అడుగడుగుకీ బుసలు కొట్టుకుంటూ తిరగాల్సి వస్తుంది.
ఇంతకీ నేను చెప్పేది ఏందంటే అతి సర్వత్ర వర్జయేత్ అని మాత్రమే!సమయాన్ని సరిగ్గా,సమయస్పూర్తితో వాడుకోవాలి.సమయపాలన ఉండాలి.ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ,ఎంత శ్రమ పడితే చాలో అంతే శ్రమ పడితో శ్రేయస్కరము.ఊళ్ళోవాళ్ళ కోసరము కాకుండా మనకోసం బ్రతికితే చాలు.
Friday, February 13, 2026
పనిదొంగల పరాకాష్ఠ
సహజంగా పనిదొంగలను మనము ఇండ్లలోనే తయారుచేస్తాము.అది ముమ్మాటికీ నిజం.చాలాసార్లు అతి ప్రేమతో,అంతా మనవాళ్ళే కదా అనుకుంటూ.ఆఖరికి వాళ్ళు కొరకరాని కొయ్యలు అవుతారు.
చిన్న పని చెప్తే చేయడం నామోషీ అనుకుంటారు.సరే అని పెద్దపని చెబితే ....అస్సలు నేను ఉండాలనా,ఊడాలనా..ఇంత పెద్ద పనులు నేను ఎక్కడ చేస్తాను అని అంటారు.ఇంక బాగా ఆలోచించి,ఒక మోస్తరు పెద్ద పని చెప్తాము.నీవు ఆ పని గురించి మరిచి పో.అయిపోయింది అనుకో అని భరోసా ఇస్తారు.ఇన్నాళ్ళకు మనవాళ్ళు పనిమంతులు అవుతున్నారు అని మురిసిపోతాము.ఆ రోజు రానే వస్తుంది,పోనూ పోతుంది.షరా మామూలే!పని మటుకు కాదు.ఏంది అని అడిగేలోపలే తమను తాము తిట్టుకుంటారు.నావల్ల నీకు ఏమీ లాభం లేదని వాపోతారు.కనీసం తిట్టి,ఆక్రోశం తగ్గించుకునే అవకాశం కూడా ఇవ్వరు.
లేదా...ఎన్టీఆర్ సినిమా విడుదల.ఎంత మంది టిక్కెట్లు దొరక వెనక్కి వెళ్ళిపోయారో తెలుసా!నేను తెలివిగా క్యూలో వాళ్ళ భుజాలమీద నడిచివెళ్ళి టికెట్టు సంపాదించాను.ఒళ్ళు హూనమైపోయింది అని సెలవిస్తారు.
కొంత మంది ఉంటారు.రావడం రావడం ఏదో ఒక పనిలోకి దూరిపోతుంటారు.వీళ్ళు మటుతు తలపైన తుపాకీ పెట్టి బెదిరించినా తొణకరు,బెణకరు.నీ ఇష్టం వచ్చింది చేసుకో!నేను మాత్రం కదలను అని కూర్చుంటారు.
వీళ్ళకి ఇంకో ప్రతిభ కూడా ఉంటుంది.నేను నీ కంటికి అసలు ఆనను.నాకు పనులు చెప్పనే చెప్పరు.చెబితేకదా ఎవరైనా నేర్చుకునేది అని మనపైనే నిందలూ,నిష్టూరాలు.
అలకలకైతే ఇంక కొరవే ఉండదు.
మనకు పోను పోనూ ఎంత విసుగు పుడుతుందంటే...ఇంకో రెండు నిముషాల్లో ప్రాణం పోయేటట్లు ఉంది అన్నామే అనుకో....కాళ్ళకి,వ్రేళ్ళకీ తాళ్ళప కట్టుకుని పడుకో.ఆ పనికి మాలిన పనులు అన్నీ చేయలేను,నా వల్లకాదు అని అంటారేమో అని.
Thursday, February 12, 2026
ఎప్పుడు,ఎక్కడ,ఎలా,ఎంతలా….
ఎవరికీ సరిగ్గా స్పందించడం రాదని నా నమ్మకం.ఎందుకంటే నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి.
ఎవరైనా బాగున్నారా అని అడిగారు అనుకో!ఏమీ,ఇక్కడ ఎవరికీ మాయరోగాలు ఏమీ లేవు అన్నట్లు చూస్తారు కొంతమంది.ఇంకొకరు మొదలు పెడతారు.మొన్న దగ్గాను.నిన్న తుమ్మాను.ఆ మొన్న ఆకలి అయితే కుంభాలు,కుంభాలు లాగించాను అని.అడిగిన వాడు ఎందుకు అడిగామురా స్వామీ అంటూ చెంపలేసుకోవాలి.వేరొకరు నిర్వికారంగా,మనము ఏమీ అడగనట్లు,వారు ఏమీ విననట్లు శూన్యంలోకి చూస్తారు.
నా మటుకు నాకు ఎందుకు,ఎప్పుడు,ఎవరిపైన,ఏ రేంజ్లో కోపం వస్తుందో నాకే తెలియదు.ఎవరైనా బాగున్నారా అంటే ఒక్కొక్కసారి వ్యంగ్యంగా అంటున్నారు అనిపిస్తుంది.చంపుతాము,నరుకుతాము అని వస్తే..।పాపం!ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో!ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసుకుని శాంత పరుస్తాము అనిపిస్తుంది.
బిడ్డలు తప్పు చేస్తే నిజంగా కోపం రాదు అమ్మలకు.కానీ కోపపడినట్లు నటిస్తారు,పిల్లలకు భయం తెలిసేదానికి.
మనము ప్రతి ఒకళ్ళకూ,వాళ్ళ చేష్టలకూ స్పందిస్తూ పోతే మనకంటూ ఒక జీవితం ఉండదు.కాబట్టి ఖచ్చితంగా కొందరి మాటలు,చేతలు ఇగ్నోర్ చెయ్యాలి .తప్పదు.మన మంచి కోరేవారి అభిప్రాయాలకు విలువనివ్వాలి.
Wednesday, February 11, 2026
సమయానికి లేనిది…..
మా బాబు(నాన్న)చిన్నప్పుడు విసుకుగా ఉంటే తరచూ ఈ మాట అనేవాడు.సమయానికి లేనిది చంక నాకనా!అని.అంటే అంత ఫ్రస్ట్రేషన్ అన్నమాట.ఎంతైనా సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి కదా!
మనము గోచీ కొనేదానికి కూడా ఇబ్బంది పడుతుంటాము.మన శ్రేయోభిలాషులు(!)ముప్పై ఏళ్ళ తరువాత వచ్చే షష్టి పూర్తికి పట్టు వస్త్రాలు చదివించాలని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు.ఆ రోజుల్లో భాక్రా నంగల్ ప్రాజెక్ట్ ప్రణాలిక లాగా వేస్తారు.ఇప్పటి నుంచే బాంకులో రికరింగ్ డిపాజిట్ మొదలు పెడతామంటారు.
ఇంకో వర్గం ఉంటుంది.వాళ్ళకు మన కష్టాలూ,కడగళ్ళూ అన్నీ తెలుసు.గూఢాచారి జేమ్స్ బాండ్ 007 కూడా వీళ్ళ ముందు దిగదుడుపే!కానీ మనము కొంచెము సర్దుకున్న తరువాత వచ్చి వాళ్ళ నటనా కౌశలము అంతా చూపిస్తారు.ఒక్క మాట చెప్పి ఉండకూడదా?కనీసం ఒక్క సైగ చేసి ఉన్నా రెక్కలు కట్టుకుని వాలిపోయి ఉంటాము కదా!అని వాపోతుంటారు.భలే నమ్మేస్తాము.
ఆఖరుగా కొంత మంది ఉంటారు.వాళ్ళు నిజంగా మన మంచి కోరే వాళ్ళు.నిజంగా మన ఇబ్బందులు వాళ్ళకి తెలిసి ఉండవు.వాళ్ళు నిజంగా మన దగ్గరకొచ్చి బాథ పడతారు.అప్పుడు మనము ఏమి చేస్తాము?మన ఆక్రోశం అంతా వాళ్ళ పైన వెళ్ళగ్రక్కుతాము.నోటికొచ్చినట్లు చెడా మడా తిడతాము.అలాంటి వాళ్ళను అస్సలు నమ్మము దేవుడు దిగి వచ్చి చెప్పినా!ఇలా మన మంచికోరేవారిని చేజేతులా పోగొట్టుకుంటాము.
ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే...కష్టాలూ,కడగళ్ళూ,నష్టాలూ ప్రతి ఒక్కరి జీవితంలో,ఏదో ఒకప్పుడూ,ఏదో ఒక రకంగా వస్తూ ఉంటాయి.మనము మనుష్యులను సరిగ్గా బేరీజు వేసుకోవాలి.నోరు అదుపులో పెట్టుకోవాలి.కొంచెం కుదురుగా ఆలోచించి వ్యవహరించాలి.మంచి వాళ్ళని పోగొట్టుకుని ఏకాకులు కాకూడదు.
Sunday, February 8, 2026
Good guestures do matter
మొన్న పిల్లల దగ్గరకు అని బయలుదేరాను.చెన్నై ఎయిర్ పోర్టులో నీళ్ళ కోసం పోతుంటే బృందావనంలో కృష్ణుడు బొమ్మ కనిపించింది.ఆ ప్రక్కనే పది మంది పిల్లలు ఫోటోలు తీసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.వాళ్ళలో ఒక అమ్మాయిని ఫోటో తీయి పాపా అని అడిగాను.సరే అని తీస్తుణ్ణింది.ఆ ప్రక్కనే ఒక అబ్బాయి మాతో కూడా ఒక ఫోటో తీసుకోండి ఆంటీ,మీ పిల్లలు అనుకోండి అన్నాడు.మా పిల్లలు మీకు అంటే చాలా పెద్ద అన్నాను.అయితో మీ మనవళ్ళు,మనవరాళ్ళు అనుకోండి అని అందరూ వచ్చి గ్రూప్ ఫోటో తీసుకున్నారు.మీరు ఒక్కరే వెళుతున్నారా అంటే అవునమ్మా అని అన్నాను.అమ్మాయిలు అందరూ గ్రేట్ అంటూ వరసగా హగ్గులు,అబ్బాయిలు అందరూ షేక్ హాండ్స్!
చాలా సంతోషం అనిపించింది నాకు.అందరూ,అందులో యంగ్స్టర్స్ వావ్ అనే మెటీరియల్ కాదు నేను.క్రొత్తగా చేయించుకున్న కొండ గుండు విత్ సిల్వర్ లైనింగ్ హేర్!అంతేనా?నవ్వితే నాలుగు పళ్ళు మిస్సింగ్?ఏమి అంత కక్కుర్తి?పళ్ళు కట్టించుకోవచ్చుగా అని ఉచిత సలహాలు.ఏంది కట్టించుకునేది?ఏడంతస్తుల మేడలు!ఒకటి కట్టమని అడిగితే ఈ తట్టు నాలుగు,ఆతట్టు నాలుగు పీకాలంటారు.అప్పుడు గానీ అంబుజా సిమెంటుతో కట్టడంలాగా పటిష్టంగా ఉండదు అని అంటారు.
మీరు చెప్పండి.డెబ్బై ఏళ్ళుదాటిన తర్వాత గోడకు కొట్టిన మేకుల్లాగా ఎవరికి ఉంటాయి పళ్ళు గట్టిగా?వాటికి తెలిసినంతలో హిప్ హాప్ డాన్స్ లో,జాజ్ డాన్సులో చేసుకుంటూ ఉంటాయిగానీ!కొన్ని బాక్ స్టేజికి వెళుతుంటాయి.
అలాంటి నన్ను ఆ పిల్లలు దగ్గరకు తీసుకుని ప్రేమలు పంచడం నాకు చాలా నచ్చింది.
నాకూ ఫాన్స్ ఉన్నారోచ్ అనుకుని తెగ మురిసిపోయాను.really I thank all those kids for boosting up my morale.thank you again!
Saturday, January 3, 2026
క్రీనీడల్లో నా నీడ
physicsలో absolute heat,apparent heat అని చదువుకున్నాము కదా!మన విషయంలో కూడా అలాగే ఉంటుంది.మనం నిజంగా ఏందో ఎవరికీ తెలియదు.apparent heat అంటే మనకు అనిపించే వేడి.అసలు వేడికి వాతావరణంలో ఉండే తేడాలతో కలుపుకుని మనకు అనిపించేది.absolute heat అంటే అసలు సిసలు నిఖార్సు అయిన వేడి.
మనము ఏంటో మనకే చాలా సార్లు అర్థం కాదు.అలాంటిది ఎదుటి వాళ్ళు మనలని సరిగ్గా అర్థం చేసుకోలేదని బాథ పడటం ఎంత వరకు సమంజసం?
ఎదుటి వాళ్ళు మనలని అర్థం చేసుకోవడం అంటే మనలని కాకుండా మన నీడని బేరీజు వేస్తున్నట్లు లెక్క.మన నీడ నీరెండలో మనకంటే పొడుగ్గా ఉంటుంది.సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే కొద్దీ మనకంటే పొట్టి అవుతుంది.మిట్ట మధ్యాహ్నానికి అది మనపైనే పడి వేరే నీడ ఏమీ కనిపించదు.క్రీనీడలో మసక మసకగా కనిపిస్తాము.చిమ్మ చీకటిలో అసలు నీడ అనే ప్రసక్తి ఉండదు.అంటే మనము లేనట్లు కాదు కదా!మనలను కొందరు ఆకాశానికి ఎత్తేస్తారు.అందులో నిజమెంత అని మనమే బేరీజు వేసుకోవాలి.కొంత మంది పురుగును చూసినట్లు చూస్తారు,లెక్క చేయరు.మనమేంటో మనకు తెలిసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పని లేదు.చాలా కొద్ది మందే మనలను సరిగ్గా అర్థం చేసుకునేది.వారిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోకూడదు.మరి ఇంకొంత మంది మనలను అసలు మనుష్యులుగా గానీ,అసలు బ్రతికి ఉన్నామని కూడా గ్రహించరు.అంత మాత్రం చేత మనం లేనట్లు కాదు కదా!
మనం మన కోసం బ్రతికాలి.విలువలతో బ్రతకాలి.మనవారి కోసం బ్రతకాలి.
Subscribe to:
Comments (Atom)