Friday, May 1, 2020

దోమతెరనా లేక దోమలకు నివాసగృహమా?

చిన్నప్పుడు రాత్రిళ్ళు మాకు అన్నాలు కాగానే మా బాబు పక్కలు వేసి దోమ తెరలు కట్టేవాడు.మేము పక్కలపైకి వెళ్ళగానే అన్ని తట్లు పరుపు లోకి దోపేసేవాడు దోమలు లోపలికి రాకుండా.కానీ పది నిముషాలు కాకుండానే ఏదో ఒక సాకు పెట్టుకుని బయటకు వస్తుండే వాళ్ళము.ఇట్లా ఒకటికి రెండు సార్లు లోపలికి బయటికీ తిరిగే క్రమంలో కొన్ని దోమలు లోపలకు చేరేవి.ఇంక చప్పట్లు కొడుతూ వాటిని చంపే ప్రయత్నం చేసే వాళ్ళం.అవి మూలల్లోకి దాక్కునేవి కొంచెం సేపు.అన్నిటినీ చంపేసాము అనే శునకానందంతో నిద్రకు ఉపక్రమించే వాళ్ళము.ఇంక దోమలు వాటి తడాఖా చూపించేవి.మేము నిద్రలో అటూ ఇటూ పొర్లడం.కాళ్ళూ చేతులూ విదిలించడం చేయడంతో యధేచ్చగా ఇంకొన్ని లోపలికి వచ్చేవి.బయటకు వెళ్ళే మార్గం కానరాక కసిగా మా పైన దాడి చేసేవి.కొన్ని దోమలు అయితే మూలల్లో ఏకంగా సంసారాలేచేసి గుడ్లు పెట్టేవి.మధ్యలో నీళ్ళకోసం లేచేటప్పటికి ఒక్కొక్కటి రక్తం పీల్చి పీల్చి పొట్టలు పగిలేటట్లు వుండేది.అట్లా వుండే వాటిని చంపాలన్నా అసహ్యమే.ఎందుకంటే రక్తం అంతా చేతులకంటుకుంటుంది.
మనం అప్రమత్తంగాలేకపోయినా,అలసత్త్వం ప్రదర్శించినా పరాన్నభుక్కులు మన జీవితం లోకి మార్గం ఏర్పరుచుకుంటాయి.వాటినికానీ,వాళ్ళని కానీ మన జీవితంలో నుంచి దూరంగా పంపించటం చాలా కష్టం.
ఇలానే మనం మానసికంగా ధృఢంగా లేక పోతే చెడ్డ అలవాట్లు,చెడ్డ సంపర్కాలు అలవాటు అవుతాయి.వాటిని వదిలించుకోవడం ఈ జన్మకు కుదిరే పని కాదు.కాబట్టి తస్మాత్ జాగ్రత్త.

No comments: