Thursday, April 30, 2020

ఘనమైన వాళ్ళను తేలికైన వాళ్ళు ఎత్తుకుంటే?

చిన్నప్పుడు మా అక్కయ్య సన్నగా,పీలగా,బక్కగా,పొట్టిగా  లింగు లిటుకులిక్కి లాగ వుండేది.నేనేమో ఘనంగా,బరువుగా,పెద్దగా,ఘన పరిమాణం,ఘన వైశాల్యం ఎక్కువగా ఒకమోస్తరు పిట్టు బస్తా లాగ వుండేదాన్ని.ఒక రోజు మా అమ్మ నన్ను ఆడించుకోమని మాఅక్కయ్యకు చెప్పింది.అది నన్ను చంకలోకి ఎత్తుకోని ఆయాస పడుతూ ఇంటి బయటకు తీసుకెళ్ళింది.దాని వల్ల ఎక్కువ సేపు నన్ను ఎత్తుకోలేక పోయింది.అప్పుడే ఒక శెట్టిగారు రెండు బియ్యం బస్తాలు రిక్షా లో వేసుకొని పోతున్నాడు.కరెక్ట్ గా ఆ రిక్షా మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కయ్య  చంకనుంచి జారి నేను కింద పడ్డాను రిక్షా ముందర.అక్కయ్య నేను రిక్షా కింద పడ్డానని భయపడింది.కానీ రిక్షా అతను పక్కకు తిప్పినట్లున్నాడు.అప్పటి నుంచి అక్కయ్య నన్ను ఎత్తుకునే సాహసం చేయలేదనుకుంటాను.
ఈ విషయం అన్నిటికీ వర్తిస్తుంది.మనం ఎప్పుడూ మోయగలిగే బరువే ఎత్తుకోవాలి.బాధ్యతల విషయంలో కూడా అంతే.ఎందుకంటే శక్తికి మించిన పనిని ఆద్యంతం చెయ్యలేము.సగం లో ఆపేయాల్సి వస్తే మనమూ నిరుత్సాహానికి గురి అవుతాము.మనల్ని నమ్ముకున్న వాళ్ళు నిరాశ చెందుతారు.అందరి కంటే ముందుగా మన బలాబలాలను మనమే బేరీజు వేసుకోవాలి.అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిది అంటారు కదా.మనం చెయ్యలేమని చెబితే వాళ్ళు చేసే వాళ్ళ దగ్గరకు వెళతారు.కనీసం వాళ్ళ పని అన్నా అవుతుంది భ్రష్టు పట్టకుండా.

Wednesday, April 29, 2020

చిన్నప్పుడు తప్పిపోతే!

నేను రెండేళ్ళ పిల్లగా వున్నప్పుడు తప్పిపోయానట.ఆ రోజుల్లో కూడా చిన్న పిల్లలను పట్టుకుపోయే వాళ్ళు వుండేవాళ్ళట.వాళ్ళు కాలో చెయ్యో వించేసి ముష్టి వాళ్ళను చేస్తారని పెద్ద వాళ్ళు భయపడేవాళ్ళు.ఒక రోజు మధ్యాహ్నం మాబాబు(మా నాన్న) ఇంటికి వచ్చాడు.అన్నం తినేదానికి కంచం ముందు కూర్చుంటూ యదాలాపంగ పద్మ ఏది అని అడిగాడట.ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుందిలే ముందు అన్నం తినమని అమ్మ చెప్పింది.మా బాబు మొదట పద్మను చూపించమని గట్టిగా అడిగాడు.అక్కయ్య,అన్నయ్య,అమ్మ నాకోసమ పక్క ఇండ్లలో,ఎదురు ఇండ్లలో చూసారు.ఎక్కడా నేను లేక పోయేటప్పటికీ వాళ్ళకు భయం వేసింది.ఇంక అందరూ వీధిలో వెతికేదానికి బయలుదేరారు.పక్క ఇండ్లలో వాళ్ళు కూడా ఇంటి వెనకల బావి దగ్గర,నీళ్ళ తొట్టి దగ్గర,గోవిందరాజస్వామి గుడి దగ్గర,రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లారు.ఇంటి నుంచి బయటకు నాలుగు అడుగులు వేసిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియక,ఇంటికి రావటం తెలియక రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ వున్నాను.అప్పుడు పోలీసు ఆయన నన్ను ఎత్తుకొని నా పేరు అది అడుగుతూ వుండగా మా పక్క ఇండ్ల వాళ్ళు మా పాపేఅని చెప్పి తీసుకు వచ్చారట.
ఇప్పుడు కాదు,ఎప్పుడైన,ఎప్పటికైనా తప్పు పోవడం చాలా డేంజరు.మనం ఎక్కడికి పోతామో,ఎవరి చేతిలో పడతామో తెలియదు.మంచి వాళ్ళు అయితే తల్లి దండ్రుల దగ్గరికి చేరుస్తారు.అది కుదరక పోతే మంచిగా అయినా చూసుకుంటారు.చెడ్డ వాళ్ళ చేతిలో పడితే మన భవిష్యత్తు అంధకారమౌతుంది.ఎన్నెన్ని భయంకరమైన విషయాలు,జుగుప్సాకరమైన అనుభవాలు వింటుంటాము అట్లాంటి బాధితుల దగ్గర నుంచి.ఈ రోజుల్లో పెద్ద వాళ్ళకే దిక్కు లేదు చెడ్డ వాళ్ళ చేతుల్ల పడితే.కాబట్టి బిడ్డలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం.

Tuesday, April 28, 2020

భరతనాట్యమా!భాగవత నాట్యమా!

నేను ఊహ తెలియని వయసు నుండి డాన్స్ చేసే దాన్నట.మా అమ్మ చెప్పేది.నాకు ఊహ తెలిసిన తర్వాత గూడూరులో మా ఇంటి ఎదురుగా వుండే పాండురంగ మందిరంలో  ఏ చిన్న విశేషం అయినా ఎగురుతుండేదాన్ని.మా వీధి చివరలో వేంకటేశ్వరస్వామి గుంట దగ్గరగా వుండే ఇంటికి ఆడుకునే దానికి వెళుతుండేదాన్ని.ఆ ఇంట్లో వుండే ఆయన నన్ను చూడగానే భాగవతులదానా భాగవతంఆడతావా అని ఉడకాడించేవాడు.ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి నా డాన్స్ బలవంతంగా చూపించేదాన్ని.ఒకసారి పరిగెత్తుతూ పడ్డాను.మోకాళ్ళు రెండూ రణాలు అయ్యాయి.చిన్నగా చెక్క కడుతూ వున్నాయి.ఈ లోపల ఇంటికి అతిథులు వచ్చారు.నా పద విన్యాసం వాళ్ళకు చూపించాలనే ఆదుర్దాలో  మోకాళ్ళ చిప్పలు పగిలి వున్నాయనే విషయమే మర్చి పోయాను.డాన్స్ చేస్తూ మోకాళ్ళ పైన కూర్చొని తాం థిత్తా తై తత్తై అంటూ మోకాలు నేలకు వేసి కొట్టాను .ఇంకేముంది?మానుతుండే గాయం మళ్ళీ రణం అయింది.ఒక్క సారిగా ఓ అంటూ ఏడుపు!చిన్నప్పుడు డాన్స్ అంటే అంత పిచ్చి ఉండేది.
ఇంట్లో ఏడ్చి భరతనాట్యం నేర్చుకున్నాను.ఒకసారి అయితే ఇంట్లో ఒప్పు కోరంటే డాన్స్ అయ్యవారు ఊరికే నేర్పిస్తానన్నాడు.కానీ నాకే భయం వేసి ఇంట్లో ఏడ్చి మళ్ళీ భరతనాట్యంలో  చేరాను.కానీ తొమ్మిదో క్లాసు తర్వాత మానేసాను.మా చిన్నాయన అయితే బాగా నేర్చుకో తల్లీ వరల్డ్ టూరు వేస్తాముఅనే వాడు.ఆఆశలు ఏమీ తీరలేదు కానీ నాకు ఇప్పటికీ భరతనాట్యం అంటే చాలా ఇష్టం.

Monday, April 27, 2020

కరోనా వేళ...అలసత్త్వమేల?

మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎండాకాలం సెలవలకు వెళ్ళాము.పిల్లలకు అమ్మవారు వచ్చింది.ఆ సమయంలోనే మా మామ వాళ్ళనెలల బిడ్డను కూడా తీసుకుని వేరే ఊరి నుంచి వచ్చాడు.మా అమ్మమ్మ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా మా చినతాత వాళ్ళ యింట్లో వుంచింది.పాత రోజుల్లోనే మన వాళ్ళు అంటువ్యాధులు అంటే అన్నిజాగ్రత్తలు తీసుకునే వాళ్ళు.బయటనుంచి వస్తే కాళ్ళూచేతులు కడుక్కోవాలి.బడి నుంచి వస్తే బట్టలు మార్చాలి.మా అమ్మ మాకు బాగా లేకపోతే మమ్మల్ని నిమురుతూ లక్ష్మీనరసింహ!లక్ష్మీనరసింహ!అని అంటుండేది.అంటే మనకు ధైర్యం చెప్పటంఅన్నమాట మౌనంగా.పల్లెటూరి వాళ్ళు,చదువురానివాళ్ళు,పాతకాలంవాళ్ళు,పనికిరానివాళ్ళు అంటుంటాము.కనీసం వాళ్ళకుండే అవగాహన,వాళ్ళకుండే జాగ్రత్త,వాళ్ళు పాటించే శుభ్రత,వాళ్ళు రోగికి ఇచ్చే మానసిక థైర్యం మనకు లేవా?మనం పాటించలేమా?మనంఇవన్నీ పాటించాలంటే ప్రభుత్వం లాక్ డౌను పెట్టాలా?పోలీసులు లాఠీలు ఝళిపించాలా?వైద్యులు ఇంట్లోనే వుండండి,శుభ్రంగా వుండండి అని కాళ్ళా వేళ్ళా బతిమలాడుకోవాలా?మనం సంఘ జీవులం కాదా?ఈ సంఘంలో బతకడంలేదా?వేరే గ్రహం నుంచి ఊడి పడ్డామా?ఒక సారి చెపితే అర్ధంకాదా?మనంఆరోగ్య పరమైన జాగ్రత్తలు పాటిస్తూ పక్క వాళ్ళకు అవగాహన కలిపించలేమా?ప్రభుత్వం విధించే నిబంధనలు మామూలు ప్రజానీకానికి మనకు కాదు అని ఎవరికి వాళ్ళు అనుకోవద్దు.మన జాగ్రత్తే మనకు మన చుట్టూ ఉండే వాళ్ళకూ శ్రీరామ రక్ష,.

యాభైలో ఇరవై అయిదు పోతే ఎంత?

50-25=? ఇదినేను రెండో తరగతిలో వుండగా సంవత్సర పరీక్షలకు అడిగిన ప్రశ్న.పరీక్ష హాలులో దీనికే ఎక్కువ సమయం తీసుకున్నాను.మల్లగుల్లాలు పడ్డాను.జవాబు 25,35,30తేల్చుకోలేక పోయాను.చివి ఆఖరికి ధైర్యం చేసి,సక్సెస్ ఫుల్ గా 35 అని తప్పు జవాబు రాశాను.ఇంటికి వచ్చిన తర్వాత అది తప్పని,సరి అయిన జవాబు25 అని తెలిసింది.నాకు మొదటి నుంచి అదే సరైన జవాబు అని అనుమానం.కానీ ప్రశ్నలోనే జవాబు ఇవ్వరు అని నమ్మకం.అందుకని అది జవాబు గా రాయలేదు.సున్నాలో అయిదు పోతే సున్నా రాదు కాబట్టి 30 వ్రాయలేదు.ఇక మిగిలింది 35 కాబట్టి అది వ్రాశాను.మొత్తానికి తప్పు రాశాను.
ఇదే మనం ఎప్పుడూ చేసే తప్పు.కళ్ళ ముందే పరిష్కారం వున్నా గ్రహించలేము.శాస్త్రీయపరమైన విశ్లేషణ పూర్తిగా చెయ్యము.అంతా దైవాధీనంగా చేస్తాము.100%నిష్టగా ఏ పని చెయ్యము.పదిలో అయిదు పోతే అయిదు అని వ్రాసినదానిని,పక్కకు ఒకటి ఇచ్చేస్తే ఇక నాలుగే కదా మిగిలేది అని నిదానంగా ఆలోచించలేకపోయాను.అన్నిటికీ తొందరే,నిదానంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించే కుదురు వుండదు.మనకు ఫలితం మంచిగా దక్కాలంటే మనం చేసే ప్రతి పనిని నియమ నిష్టలతో,నిబద్ధతలతో చెయ్యాలి.

Sunday, April 26, 2020

వాసనలు —సువాసనలు

చిన్నప్పుడు నాకు సంపూర్ణ అనే ఫ్రెండ్ వుండేది.ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్లాను .ఆ అమ్మాయి చాలా మంచిది.కానీ తన దగ్గరకువెళ్ళగానే ఘాటుగా వాసన అనిపించేది.తర్వాత దానిని బాడీ ఓడర్ అంటారని తెలిసింది.అది నచ్చక ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేసాను.అలా చెయ్యటం తప్పని అప్పట్లో తెలియదు.ఇప్పటికీ నాకు ఆ విషయమై గిల్టీ గా వుంటుంది.తర్వాత తర్వాత మా పిల్లలు అమ్మ వాసన నాన్న వాసన అనేవాళ్ళు.మన శరీరం నుంచి చాలా మైల్డగా వాసన వస్తుంది.అది చిన్నప్పుడు బాగా తెలుస్తుంది.అప్పుడు ఘ్రాణ శక్తి బాగుంటుందేమో పెద్దయ్యాక కంటే.
వంటలు చేసేటప్పుడు భలే వాసనలు వస్తాయి.కానీ నేను కనుక్కున్నదేంటంటే వంటల్లో ఉప్పు తక్కువ అయితే వాసనలు బాగా వస్తాయి.ఒక సారి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది.అప్పటి నుంచి ఒక ఆరు నెలల దాకా కాఫీ వాసన తగిలితే కడుపులో  తిప్పేది.ఆఖరకు ఎట్లా అయ్యాను అంటే కాఫీని కళ్ళతో చూసేదానికి భయపడేదాన్ని.
ఒక సారి ఒక పార్టీకి వెళ్లాము.అక్కడ చాలా రకాల డ్రింక్స్,జ్యూస్ లు వున్నాయి.అందరూ మామిడిరసం తాగుతున్నారని నేను కూడా తెచ్చుకున్నాను.అది నోటి దగ్గరకు తీసుకెళుతుంటే ఘాటుగా వాసన వచ్చింది.ఆవాసనకు మళ్ళీ కడుపులో తిప్పటం.షరా మామూలు.నేను అది నా ఒక్క ఇబ్బంది అని తెలుసుకోలేక పోయాను.మా అమ్మాయిని పిలిచి అది చెడి పోయినట్లుంది.అందరికీ తాగొద్దని చెప్పు అని అన్నాను.కానీ మా పిల్ల ఎవళ్ళకీ చెప్పినట్లు లేదు.తర్వాత గమనిస్తే అన్నిటికంటే అదే ఎక్కువ తాగారు.
దీని పట్టి ఏమి అర్ధం అవుతుంది?మన ఆలోచనలు,మన భావాలు,మన రుచులు,మన ఇష్టాయిష్టాలు అందరికీ నచ్చాలని లేదు.ఎదుటి వాళ్ళకు నచ్చింది మనకు నచ్చాలని లేదు.అంత మందికి నచ్చిన పళ్ళరసం నాకెందుకు కడుపులో తిప్పింది?
ప్రతి విషయాన్ని గ్రహించటంలో మన దృష్టి కోణం,మన అవగాహన,మన జ్ఞానం,మన అజ్ఞానం,మన పరిధి,మనం పుట్టి పెరిగిన వాతావరణం,ఇలా చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి.కాబట్టి మనం చెప్పిందే వేదం,అందరూ అది ఒప్పుకోవాలి అనుకోకూడద.అలా అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకెవరూ  వుండరు.

Friday, April 24, 2020

Aacharana,anukaranaa?

Pillalu chinnappudu peddavaallu palaka ,balapam ichchi A,Aa diddisthaaru.Vaallaku yemi chesthunnaamu,yenduku chesthunnaamu,atlaa chesina daani valla laabhaalu,aa aksharaalu yendi anedi ardham kaadu.Kaani chinnagaa vaati gurinchi ardham,avagaahana,vishaya parijnaanam,visleshana vasthaayi.Raavaali koodaa.Lekapothe ardhame ledu.Ye pani koodaa manam yaanthrikangaa cheyakoodadu.Vishaya parijnaanam,visleshana lekundaa guddi gaa yeduti vaallanu anukaristhe manaku yemi oragadu,samaajaaniki yemi laabham ledu.Manam yedige koddee mana pedda vaallu yemi chesthunnaaru,yenduku chesthunnaaru,yelaa chesthunnaaru,daani poorvaaparaalu yendi,daani laabhanashtaalu yendi ane vishayam pai bereeju vesukovaali.Adi aacharana yogyam avunaa kaadaa anedi koodaa oka avagaahanaku raavaali.Manchi kaani,chedu kaani yedee guddigaa cheyyakoodadu.
Anukaranaku,aacharanaku nakkaku,naagalokaaniki unnantha thedaa vundi.Anukarana anedi manam pareekshallo choochi copy kottinatlu.Aacharana ante ichchina lekkaku,kaani prasnaku kaani reasoningtho,aa vishayam paina avagaahana tho,ardham chesukoni,prasnaku kaavaalaasinantha jawaabu ivvatam.Running race ante oka geetu daakaa parigeththamani.Anthe kaani parigesthu pothu vundamani kaadu.Manaku yekkada aapaalo,yekkada,yeppudu,yelaa modalu pettaalo thelisi vundaali.Mundara vaadu parigesthe parigettedi,aagithe aagedi cheyyakoodadu.Mana dhyeyam lo ,mana aacharanalo,mana vishaya parijnaanam lo yekkadaa lotu,lopaalu vundakoodadu.
Oka rakangaa cheppaalante anukarana anedi soulless act.Aacharana anedi manasu lagnam chesi saadhinchedi.
Okadiki moksham vachchindi manaku raavaalante yaanthrikangaa vaadu koorchunnaadani koorchovadam,kallu moosukunnaadani kallu moosukovatam,mukku moosukunnaadani mukku moosukovatam kaduna.

అన్న మాట...వున్న మాట

చిన్నప్పుడు అన్నయ్య బడికి పోతుంటే వాడి వెనకల పరిగెత్తే దాన్ని.వాడేమో గబుక్కున యేదో ఒక సందులోకి వెళ్ళి మాయమైపోయేవాడు.ఏడుస్తూ వెనక్కి వచ్చేదాన్ని.వాడు చేసేదంతా నేను చేసెయ్యాలి అని ఆశ.నేను కూడా బడికి వెళ్ళి పోవాలని ఆదుర్దా...అంతే!అక్కడ పాఠాలు చెప్తారని తెలియదు.ఆ పాఠాలు ఒప్ప చెప్పాలని తెలియదు.చెప్పకపోతే తాట తీస్తారని అసలు తెలియదు.అంతా అజ్ఞానం,అమాయకత్వం.అందుకే సగంసగం తెలుసుకుని ఊరికే ఉరకగూడదు.చూసిందే అంతా అనుకోకూడదు.దాని వెనకల వుండే అర్ధం,పరమార్థం గ్రహించాలి.బడికి వెళ్ళేదానికే ప్రాముఖ్యం యిచ్చాను గాని జ్ఞానం సంపాదించుకోలేకపోయాను.అందుకే పెద్దలు ఏదైనా చెయ్యాలంటే ముందు దాని పూర్వా పరాలు కనుక్కోమంటారు.భేషజాలు లేకుండా ఆ పని మనము సంత్రుప్తికరంగా చెయ్యగలమా లేదా అని బేరీజు వేసుకోమంటారు.అప్పుడు అయితే కార్య సాఫల్యం తప్పక అవుతుంది.