Tuesday, December 2, 2025

Short sightedness

నాకు షార్ట్ సైటు ఉంది.చిన్నప్పుడు భలే ఏడ్చేదాన్ని,నాకే ఎందుకు ఇలా అని.కానీ పోను పోను అర్థం అయింది ఆ కొరత,కొరవ ఆనందించాల్సిన విషయాలే కానీ అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదని.దీనినే blessing in disguise అంటారు. ఎవరు ఏమడిగినా నాకు కనిపించలేదు,తెలియదు,అర్థం కాలేదు అనే అస్త్రాలు మన అంబుల పొదిలో ఎప్పుడూ కళకళలాడుతూ సజీవంగా ఉంటాయి. ఎంత సేపూ దిగేడుపు మొహం పెట్టుకుని కనిపించిన వాళ్ళనీ,కనపడని వాళ్ళనీ అందరినీ మన దీనపు మాటలతో,జాలి గొలిపే చూపులతో సహాయం అర్థించ వచ్చు.పైపెచ్చు ఎవరైనా నీకు అప్పుడు అలా సహాయం చేసాము,ఇంకొకప్పుడు ఇంకోలా సహాయం చేసాము అని అంటే మేము అడిగామా అని బుకాయించవచ్చు.ఇప్పుడు మాకు సహాయం చేయండి అని ఎవరైనా అడిగితే..నేనే అందరి దగ్గర సహాయసహకారాలు పొందుతుంటాను.అసలు సహాయం చేయగలిగే సత్తా ఉంటే ముందు నాకు నేనే చేసుకుంటాను కదా అని ఎదురు సవాలు విసరవచ్చు. కానీ నిజంగా ఇది మన తప్పు కాదు,మన ఇరుకు మనస్తత్త్వానికి నిదర్శనం.ఎంత సేపూ నాకే ఇన్ని కష్టాలూ కడగళ్ళూ ఎందుకు?అని వాపోతుంటాము.లోకంలో ప్రతి ఒక్కరూ మనలను,మన పరిస్థితులను అర్థం చేసుకొని సకాలంలో సానుకూలంగా స్పందించాలని అనుకుంటాము.కానీ ఒక్కసారి కూడా ఆత్మ విమర్శ చేసుకోము.మన చుట్టు ప్రక్కల వాళ్ళకి మనకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయేమో అని.వాళ్ళకు మనము కూడా మన వంతు సహాయ సహకారాలు అందించ గలము అని. కాబట్టి మన హ్రస్వ దృష్టిని మనసు పెడితే మనమే సరి చేసుకోగలము.పది మందికి సహాయంగా ఉండగలము.

No comments: