Saturday, November 22, 2025

పెద్ద గీత,చిన్న గీత

నేను నలభైలలోకి వచ్చేటప్పటికి బాగా ఇక్కట్లు.పిల్లలకు సంవత్సరానికి ఒక్కసారి కొత్తబట్టలు తలా ఒక జత కొనేదాన్ని.నేను వంద రూపాయల్లో ఒక చీర కొనేదాన్ని.ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి.భుజానికి,మణికట్టుకి అమెరికా అన్నయ్య ఇచ్చిన పర్సు,గడియారము ఉండేవి.ఒంటి మీద అక్కయ్యల చీరలు ఉండేవి.చెవుల్లో,చేతుల్లో,మెడలో బంగారంఆనవాళ్ళు దివిటీ పెట్టి చూసినా ఉండేవి కావు.పిల్లలు వీథి బడిలో చదువుకునేవాళ్ళు.పిల్లల పుట్టిన రోజుకు స్కూల్ యూనిఫార్మ్ కొనేదాన్ని. నా పైన నాకే జాలి వేసేలా దీనంగా ఉండేదాన్ని.నా అనుకునే వాళ్ళు అందరూ కనుచూపు మేరలో కనిపించేవారు కాదు.వాళ్ళ భయాలు వాళ్ళవి. ఆఫీసులో ఏదైనా పార్టీ అని ఒక స్వీటు,ఒక చిన్న మిక్స్చరు పొట్లం ఇస్తే ఇంటికి తీసుకుని వచ్చి పిల్లలకు పంచి ఇచ్చేదాన్ని. ఒకరోజు మాఅబ్బాయి అన్నాడు.అమ్మా!మనం బీదవాళ్ళము కాదు.మా ఫ్రెండ్స్ చిన్న పూరి గుడిసెలో ఉంటారు.అన్నంలోకి నాలుగు వేరుశనగ గింజలు నంచుకుంటారు.అంతే!వాళ్ళకు మనకు లాగా ఫ్రిజ్జ్,వాషింగ్ మెషీను,టివి,ఫ్యాన్స్ లేవు. నాకు జ్ఞానోదయం అయింది.ఎంత మంది మనకంటే దీనమైన దుస్థితిలో ఉంటారు?మనమేమో లోకంలో కష్టాలు అన్నీ దేవుడు మనకే ఎందుకు ఇచ్చాడు అని దిగులు పడతాము. నాకు M.Sc,CAIIB 1&2,B.L.,DCBA డిగ్రీలు ఉన్నాయి.ఎంత మంది చదువు సంధ్యలు లేకపోయినా బిడ్డలను కష్టపడి ఎలా పెంచి పెద్ద చేసుకుంటారు! నిజానికి మా కస్టమర్ ఒక పెద్దాయన ఉండేవాడు.చదువులేదు.బండి మీద బట్టలు ఇస్త్రీ చేస్తాడు.అతను వాళ్ళబ్బాయిని అమెరికా పంపించాడు.వాళ్ళ అబ్బాయి ప్రతి నెలా డబ్బులు పంపేవాడు.వాళ్ళ అబ్బాయి ఎంత పంపింది మనమే చెప్పాలి ఆయనకు. నేనేమో బర్రెలాగా ఉండి,దిగ ఏడుస్తూ కూర్చున్నాను.ఛట్!ఈ ఏడుపులు,దీనాలాపనలు అవసరమా నాకు?అని అనిపించింది.అప్పటి నుంచి నేను సెల్ఫ్ పిటీ మానుకున్నాను.

No comments: