Wednesday, November 19, 2025

Hai young lady!

చిన్నప్పుడు పెద్దన్నయ్య ఒక్కడే నన్ను బుల్లి,బుల్లెమ్మ అని పిలిచేవాడు.పెద్దయిన తరువాత తల్లీ అని పిలిచేవాడు.ఎప్పుడూ నన్ను పేరు పెట్టి పిలవ లేదు.ఇద్దరు అన్నయ్యలు,ఇద్దరు అక్కయ్యలు,అమ్మ,బాబు(నాన్న)లు లోకం అంటే ఏందో తెలియకుండా గారాబంగా పెంచారు. వాళ్ళు నా పైన చూపించిన ప్రేమను అన్నయ్య,అక్కయ్యల పిల్లలకు పంచాను.అన్నయ్య పిల్లలకు చిక్కత్తను,అక్కయ్యల పిల్లలకు పిన్నిని.అన్నయ్య పిల్లలకు అయితే ముద్ద ముద్దకు ఒక కథ చెబుతూ అన్నం పెట్టేదాన్ని,కాళ్ళపైన కూర్చోబెట్టుకుని. ఇప్పుడు మనవళ్ళు,మనవరాళ్ళ హయాం కదా.ఒక మనవడికి నేను వచ్చేసేటప్పుడు నా స్వెట్టర్ ఇచ్చేయాలి.మళ్ళీ వెళ్ళేదాకా అదే వేసుకుని తిరుగుతుంటాడు,బుడబుక్కలవాడిలాగా!ఇంకొకడు రోజూ పడుకునేముందు,ఎంత అలసిపోయినా,ఇంకెంత నిద్ర వచ్చినా,వచ్చి నా పక్కలు సర్ది,నాకు మంచిగా దుప్పటి కప్పి,గుడ్ నైట్ చెప్పి,ఒక ముద్దు ఒక హగ్ ఇచ్చి,లైటు ఆర్పేసి,తలుపు వారగా వేసి వెళతాడు. మనవరాలు అయితే నేను తన ఫ్రెండు అనుకుంటుంది.హే యంగ్ లేడీ అని పిలుస్తుంటుంది.కొత్తగా హాయ్ నైబర్ అని నామకరణం చేసింది.

No comments: