Sunday, November 9, 2025

ఇదిగో కష్టాల కడలి…అదిగో కుంతి!

కుంతి జన్మ మొత్తమూ,ఒకటి పోతే ఇంకోటి...ఒకదాని తర్వాత ఇంకోటి కష్టాలు పడుతూ వచ్చింది. యవ్వనం తొలి నాళ్ళలో ఆతురత,అసహనం,అలజడి,అన్నీ త్వరత్వరగా తెలుసుకోవాలనే తొందరలో కర్ణుడు పుట్టేసాడు.పెళ్ళికాని పిల్ల,అప్పుడైనా,ఇప్పుడైనా,ఇంకెప్పుడైనా,తల్లి అయితే పరిస్థితి ఒక్కటే.ఆ బిడ్డను వదిలించుకుంది,కానీ ఆ బిడ్డ పైన మమకారం పోగొట్టుకోలేక పోయింది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది.మాద్రి కోరిక పైన తన బిడ్డలైన నకుల సహదేవులను కూడా సొంత బిడ్డలలాగా చూసుకుంది.బావగారి పంచన ఐదుగురు బిడ్డలను పోషించుకోవాలంటే ఎంత కష్టం!అయినా పెదవి విప్పకుండా,మాట జారకుండా నెట్టుకుని వచ్చింది.దుర్యోధనుడు భీముడికి విషప్రయోగం చేసినా కిమ్మనలేదు.లక్క గృహము అగ్నికీలల పాలైనా అసహనానికి లోనుకాకుంకా,మౌనంగా బిడ్డలతోపాటు అడవులవెంట నడిచింది. బిడ్డలు,కోడలు అరణ్యవాసం,అజ్ఞాతవాసానికి కారణమైన కౌరవుల చెంతనే ఉండాల్సి వచ్చినా నోరు మెదపకుండా సహనం పాటించింది. కర్ణుడే తన మొదటి కొడుకు అని తెలిసినా నిస్సహాయంగా నిలబడిపోయింది!తన కళ్ళ ముందే మనవళ్ళు పోయినా నిర్వికారంగా దిక్కులు చూసింది. భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో బిడ్డని కాపాడి వాళ్ళ వంశాన్ని నిలబెట్టడమే ఆమెకు ఆనందం ప్రసాదించిన క్షణం. ఆమె అన్ని ఆటుపోటులకు ధైర్యంగా,మనోనిబ్బరంతో ఎదురు నిలిచింది కాబట్టే వాళ్ళ వంశం నిలద్రొక్కుకుంది!ఏనాడూ తన బిడ్డలు తప్పుదోవలో పోకుండా కాపాడుకుంటూ వచ్చింది.ఆమె విజయం అదే!

No comments: