Thursday, November 20, 2025

లక్ష్మణుడికంటే కొంచెం ఎక్కువ

లక్ష్మణుడు మంచి తమ్ముడు,కొడుకు,మరిది.ఊర్మిళ మంచి తనమో లేక ఆమెని ఒప్పించగలిగే నేర్పు ఉన్నవాడో కానీ మొత్తానికి అన్నావదినలతో అడవులకెళ్ళాడు. సుగ్రీవుడు హనుమ అతనికి సీత జారవిడిచిన నగలు చూపిస్తారు.ఆమె కాలి మెట్టెలు చూసి కనుక్కుంటాడు అవి వాళ్ళ వదినవే అని.మిగిలిన నగలగురించి తెలియదని చెబుతాడు. ఇక్కడే నాకు కొంచెం బాథ వేస్తుంది.వదిన అంటే తల్లి లాంటిది కదా!మరి పాదాలు తప్ప నాకు ఏమీ తెలియదు అని చెప్పడమేంటి?ఆ చెప్పడంలో వాళ్ళ వదిన పైన గౌరవము,భక్తిభావము,మర్యాద,మన్నన,కట్టుబాట్లు ఏమో! కానీ చనువు లేదేమో అనిపిస్తుంది. ఈ విషయంలో నా మరదులు చాలా గొప్ప.పెద్దొదిన మా అమ్మ అని మనస్పూర్తిగా అంటారు.మా అత్త పోయిన తరువాత మరీ.నేను అందరినీ పేరు పెట్టే పిలుస్తాను.మా తోడికోడళ్ళు అందరమూ కూడా బాగా ఉంటాము.వాళ్ళని రేయ్ అని అన్నా,పేరు పెట్టి పిలిచినా ఏమీ అనుకోరు.నిజమే కదా!నా పెళ్ళి అప్పటికి ఒకడు అయిదో క్లాసు,ఇంకోడు ఏడు,మరింకోడు పదో తరగతి. మా అత్త కొడుకులను అబ్బయ్యా అని పిలిచేది.నా సంబోధన ...రేయ్ లో వాళ్ళకు వాళ్ళ అమ్మ పిలుపులోని ప్రేమ,వాత్సల్యం కనిపిస్తున్నాయేమో!వాకు సంతోషం!

No comments: