Saturday, November 15, 2025

ఈ నల్లని రాళ్ళలో…

నేను అయిదో క్లాస్లో ఉండేటప్పుడు వచ్చింది ఈ సినిమా.పెద్దక్కయ్య తీసుకెళ్ళింది.ముందర ట్రైలరు.సుమ కుంటిది.కానీ నడువగలదు అంటూ.అప్పుడే ఆర్టిఫిషియల్ లిమ్బ్స్ పెట్టడం జైపూరులో మొదలు అయింది.సినిమా మొదలు అయింది.తారాగణం,కూర్పు,పర్యవేక్షణ,మాటలు,పాటలు ...అన్ని పేర్లు వచ్చేసాయి.నాగేశ్వరరావు ఉలి పట్టుకుని టంగ్ టంగ్ అని కొడుతూ ఈ నల్లని రాళ్ళలో అని అంటున్నాడు.ఇంతలో కరెంటు పోయింది! చీకటి,ఉక్క,చెమట...సర్వం!కానీ కరెంటు రావటం లేదుఎంత సేపయినా!గంట అయింది.రెండు గంటలు అయింది.సూన్యం!ఇంక కరెంటు రాదు అని తేల్చుకుని అందరికీ చీటీలు ఇచ్చారు,రేపు వచ్చి చూడండని.మామూలుగా సినిమా వదిలి పెట్టే సమయానికే బయటపడ్డాము. రెండో రోజు ఠంచనుగా వెళ్ళి చీటీలు చూపించి జ్యోతి సినిమా హాలులో కూర్చున్నాము.మళ్ళీ ట్రైలరు...సుమ కుంటిది,కానీ నడువ గలదుఅంటూ.సినిమా మాటలు,పాటలు,నృత్యం పేర్లు వచ్చాయి.నాగేశ్వర రావు మళ్ళీ పాటందుకున్నాడు..ఈ నల్లని రాళ్ళలో అంటూ..మళ్ళీ పుటుక్కున కరెంటు పోయింది.మళ్ళీ రెండు గంటలు చీకటి,ఉక్క,చెమటలతో!మళ్ళీ హాలువాళ్ళు చీటీలు ఇచ్చారు రేపు రమ్మనమని. మళ్ళీ రెండో ఆట టైముకు ఇల్లు చేరాము. ముచ్చటగా మూడో రోజు వెళ్ళాము జ్యోతి తియేటరుకు.మళ్ళీ సుమ కుంటిది,కానీ నడువగలదు అంటూ ట్రైలరు.నాకు కంఠస్తం వచ్చేసింది.పేర్లు పడ్డాయి.నేను ఏడు కొండల వాడికి మొక్కుకున్నాను నాగేశ్వర రావు పాట మొదటి లైను దాటి రెండో లైను పాడేలా చేయమని.ఎట్లనో దేవుడు కరుణించాడు.సినిమా మొత్తం చూసి బయట పడ్డాము ఎలాంటి అవరోథాలు లేకుండా!

No comments: