Wednesday, October 16, 2024

పొద్దున మనము లేవాలి…

పొద్దున మనమూ లేవాలి,పళ్ళను బాగా తోమాలి అని పిల్లలకు నేర్పిస్తాము.ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్ అని వింటుంటాము.ఇది నిజంగా చాలా మంచి అలవాటు.కానీ పిల్లలకు చెప్తాము కానీ,చాలా సార్లు పెద్దవాళ్ళము పాటించము.సూర్యోదయం ముందర లేవాలి.అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.తెల్లవారితే వుండే రణగొణ ధ్వనులు ఉండవు.గాలి కూడా చాలా మటుకు శుభ్రంగా,పొల్యూషన్ లేకుండా ఉంటుంది.మార్నింగ్ వాక్ చేసుకునే వాళ్ళు సంతోషంగా,స్థిమితంగా చేసుకోవచ్చు.అదే అర్ధరాత్రి దాకా మేలుకుని,అపరాహ్ణం లేస్తే ఎలా ఉంటుంది?ఇంట్లో వాళ్ళు ఇంకా లెయ్యలేదని విసుక్కుంటూ ఉంటారు.ఆ ఛీదరలు,చీత్కారాలు వింటూ లెయ్యాలి.ఆలస్యంగా లేస్తాము కాబట్టి కడుపులో జఠరాగ్ని ఎక్కువ అవుతుంది.అలా ఉన్నప్పుడు పళ్లు తోముకున్నా,కడుపులో దేవుతుంది.ఒక్కొక్కసారి నోట్లోకి కూడా వస్తుంది.పళ్ళు మళ్ళా తోముకుందాములే,ముందర కడుపులోకి ఏమన్నా తినేద్దాము అనుకునే వర్గం కూడా ఉంటుంది.ఇంక హడావుడిగా అన్నిటికీ ఉరుకులు పరుగులు పెడుతుండాలి.అదే పొద్దునే లేస్తే,అన్ని పనులు సక్రమంగా,సజావుగా,ప్రశాంతంగా జరుగుతాయి.ఎవరూ మనల్ని విసుక్కోరు,కసురుకోరు,ఈసడించుకోరు,తక్కువ చేసి మాట్లాడరు ఆలశ్యంగా వచ్చామని,పని సరిగ్గా చెయ్యలేదని.కాబట్టి రోజు అంతా సామరస్యంగా జరిగిపోతుంది.పొద్దున్నే లెయ్యాలి అంటే రాత్రిళ్ళు త్వరగా పడుకోవాలి.దేనికైనా క్రమశిక్షణ ఉండాలి.క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేము.మనం చేరుకోవాల్సిన గమ్యం దగ్గరలో ఉన్నా చెయ్యి జారిపోతుంది జీవితంలో క్రమశిక్షణ లేకపోతే.

No comments: