Thursday, October 31, 2024
శుభకార్యాలప్పుడు పిలుపులు
మనం శుభకార్యాలకు చాలా మందిని పిలుస్తుంటాము.ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత గబుక్కున గుర్తు వస్తుంది.మనకు చాలా ముఖ్యమయిన,దగ్గర వాళ్ళను పిలవటం మరిచిపోయామని.వాళ్ళు ఎదురైతే ఏమి సమాధానం చెప్పాలా అని తల పట్టుకుంటాము.చాలా మంది భార్యాభర్తలు ఇద్దరూ పిలిస్తేనే కానీ రారు.ఇప్పుడిప్పుడు కొంచెం ఆ మొండిపట్టు తగ్గుతున్నది.మర్యాదగా అందరూ రండి అని పిలిచి వస్తాము.కానీ కొన్ని చోట్ల పిలిచేవాళ్ళ పక్కన ఒక అతను పుస్తకం పట్టుకుని ఉంటాడు.ఎంత మంది హాజరు అవుతారు మీ ఇంటి నుంచి అని అడిగి రాసుకుంటాడు.వృథా ఖర్చులు తగ్గించడానికి అని తెలిసింది.కొంత మందిని పిలవాలి కాబట్టి పిలుస్తాము.వాళ్ళు వచ్చినా రాకపోయినా మనకు పెద్ద తేడా ఉండదు.సందడి,పండగ వాతావరణం,పది మందికి భోజనాలు పెడితే మంచిది అని పిలుస్తాము.ఒక్కో సారి మనం పిలిచేదానికి వెళ్ళిన చోట వేరే వాళ్ళు ఉంటారు.పిలవకపోతే బాగుండదని మొహమాటానికి పిలుస్తాము.కొంత మందిని అసలు పిలవము కానీ శుభకార్యం జరుగుతుంది అని వస్తారు.మరీ దగ్గర వాళ్ళయితే రాకపోతే ఒప్పుకోము అని బెదిరిస్తాము.ఏది ఏమైనా ఒక కార్యం జరిగినప్పుడు పది మంది కలిస్తేనే బాగుంటుంది,హడావుడి,సంతోషం,నిండుదనం ఉంటుంది.కాబట్టి పిలిచే ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా,వాళ్ళు నిజంగానే రావాలి ఆని పిలిస్తే మంచిది కదా.అన్ని దానాలలోకి అన్నదానం మంచిది కదా.మన లోగిలిలో పది మంది సంతృప్తిగా తిని,అన్నదాతా సుఖీభవ అని దీవిస్తే మనకు సంతోషం,తృప్తిగా ఉంటుంది.అందుకనే నిజంగా పిలుపులు మొదలు పెట్టేముందు అసలు ఉరామరికగా ఎంత మందిని పిలవాలి అని తేల్చుకోవాలి.కాగితం,పెన్ను తీసుకుని మనకు తెలిసిన,ముఖ్యమమయిన వాళ్ల పేర్లు,బంధువుల పేర్లు రాసుకోవాలి.అలా అయితే మఖ్యమయిన వాళ్ళను మర్చిపోయే తప్పు చేయము.ఒక పెద్ద కార్యం అనుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి తప్పొప్పులు జరుగుతుంటాయి.అవి కావాలని చేసేవి కాదు కదా.ఆ హడావుడిలో,పని తొందరలో మర్చిపోతుంటాము.కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment