Saturday, November 22, 2025
పెద్ద గీత,చిన్న గీత
నేను నలభైలలోకి వచ్చేటప్పటికి బాగా ఇక్కట్లు.పిల్లలకు సంవత్సరానికి ఒక్కసారి కొత్తబట్టలు తలా ఒక జత కొనేదాన్ని.నేను వంద రూపాయల్లో ఒక చీర కొనేదాన్ని.ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి.భుజానికి,మణికట్టుకి అమెరికా అన్నయ్య ఇచ్చిన పర్సు,గడియారము ఉండేవి.ఒంటి మీద అక్కయ్యల చీరలు ఉండేవి.చెవుల్లో,చేతుల్లో,మెడలో బంగారంఆనవాళ్ళు దివిటీ పెట్టి చూసినా ఉండేవి కావు.పిల్లలు వీథి బడిలో చదువుకునేవాళ్ళు.పిల్లల పుట్టిన రోజుకు స్కూల్ యూనిఫార్మ్ కొనేదాన్ని.
నా పైన నాకే జాలి వేసేలా దీనంగా ఉండేదాన్ని.నా అనుకునే వాళ్ళు అందరూ కనుచూపు మేరలో కనిపించేవారు కాదు.వాళ్ళ భయాలు వాళ్ళవి.
ఆఫీసులో ఏదైనా పార్టీ అని ఒక స్వీటు,ఒక చిన్న మిక్స్చరు పొట్లం ఇస్తే ఇంటికి తీసుకుని వచ్చి పిల్లలకు పంచి ఇచ్చేదాన్ని.
ఒకరోజు మాఅబ్బాయి అన్నాడు.అమ్మా!మనం బీదవాళ్ళము కాదు.మా ఫ్రెండ్స్ చిన్న పూరి గుడిసెలో ఉంటారు.అన్నంలోకి నాలుగు వేరుశనగ గింజలు నంచుకుంటారు.అంతే!వాళ్ళకు మనకు లాగా ఫ్రిజ్జ్,వాషింగ్ మెషీను,టివి,ఫ్యాన్స్ లేవు.
నాకు జ్ఞానోదయం అయింది.ఎంత మంది మనకంటే దీనమైన దుస్థితిలో ఉంటారు?మనమేమో లోకంలో కష్టాలు అన్నీ దేవుడు మనకే ఎందుకు ఇచ్చాడు అని దిగులు పడతాము.
నాకు M.Sc,CAIIB 1&2,B.L.,DCBA డిగ్రీలు ఉన్నాయి.ఎంత మంది చదువు సంధ్యలు లేకపోయినా బిడ్డలను కష్టపడి ఎలా పెంచి పెద్ద చేసుకుంటారు!
నిజానికి మా కస్టమర్ ఒక పెద్దాయన ఉండేవాడు.చదువులేదు.బండి మీద బట్టలు ఇస్త్రీ చేస్తాడు.అతను వాళ్ళబ్బాయిని అమెరికా పంపించాడు.వాళ్ళ అబ్బాయి ప్రతి నెలా డబ్బులు పంపేవాడు.వాళ్ళ అబ్బాయి ఎంత పంపింది మనమే చెప్పాలి ఆయనకు.
నేనేమో బర్రెలాగా ఉండి,దిగ ఏడుస్తూ కూర్చున్నాను.ఛట్!ఈ ఏడుపులు,దీనాలాపనలు అవసరమా నాకు?అని అనిపించింది.అప్పటి నుంచి నేను సెల్ఫ్ పిటీ మానుకున్నాను.
Friday, November 21, 2025
కాగితం అపురూపం!
మా అమ్మ కరేడులో పుట్టి పెరిగింది.అది సముద్రతీర ప్రాంతం,బకింగ్ హామ్ కెనాలుదగ్గర.అమ్మ చిన్నప్పుడు ఇసుకలో అక్షరాలు దిద్దుతూ చదువుకుంది.అప్పట్లో అమ్మ ఏదో పోటీలో గెలిస్తే ఒక తెల్ల పేపరు బహుమానంగా ఇచ్చారట!అమ్మ గొప్పగా మాకు చెబుతుండేది.అమ్మ రెండో ప్రపంచ యుద్ధం కూడా చూసింది.రాత్రుళ్ళు వీథి దీపాలు వెలుగుతాయి కదా!ఆ వెలుతురు కనిపిస్తే పైనుంచి,ఊరు ఉందని తెలుస్తుంది కదా!బాంబులు వేస్తారేమో అని భయపడేవాళ్ళట.అందుకని వెలుతురు పైకి కనిపించకుండా ముళ్ళకంపలు కప్పేవాళ్ళట ఊర్లోవాళ్ళు.
అప్పట్లో కాగితం అంత అపురూపం!సగటు మానవుడు విరివిగా వాడగలిగే పరిస్థితి ఉండేది కాదేమో!అదీ కాకుండా అక్షరాస్యత కూడా అంతంత మాత్రంగానే ఉండేదేమో!ఊరంతటికీ చదవటం,వ్రాయటం తెలిసిన వాళ్ళు ఒక్కరోఇద్దరో ఉండేవాళ్ళు.స్వతహాగా కాగితం చెట్లనుంచి తయారు చేస్తారు కాబట్టి పర్యావరణ సమస్య కూడా.
అందుకనే ఇప్పుడు అంతా పేపర్ లెస్ లావాదేవీలు,మనీ ట్రాన్సాక్షన్స్ కు ఊతం ఇస్తున్నారు.ఒక రకంగా మంచిదే కదా!
Thursday, November 20, 2025
లక్ష్మణుడికంటే కొంచెం ఎక్కువ
లక్ష్మణుడు మంచి తమ్ముడు,కొడుకు,మరిది.ఊర్మిళ మంచి తనమో లేక ఆమెని ఒప్పించగలిగే నేర్పు ఉన్నవాడో కానీ మొత్తానికి అన్నావదినలతో అడవులకెళ్ళాడు.
సుగ్రీవుడు హనుమ అతనికి సీత జారవిడిచిన నగలు చూపిస్తారు.ఆమె కాలి మెట్టెలు చూసి కనుక్కుంటాడు అవి వాళ్ళ వదినవే అని.మిగిలిన నగలగురించి తెలియదని చెబుతాడు.
ఇక్కడే నాకు కొంచెం బాథ వేస్తుంది.వదిన అంటే తల్లి లాంటిది కదా!మరి పాదాలు తప్ప నాకు ఏమీ తెలియదు అని చెప్పడమేంటి?ఆ చెప్పడంలో వాళ్ళ వదిన పైన గౌరవము,భక్తిభావము,మర్యాద,మన్నన,కట్టుబాట్లు ఏమో!
కానీ చనువు లేదేమో అనిపిస్తుంది.
ఈ విషయంలో నా మరదులు చాలా గొప్ప.పెద్దొదిన మా అమ్మ అని మనస్పూర్తిగా అంటారు.మా అత్త పోయిన తరువాత మరీ.నేను అందరినీ పేరు పెట్టే పిలుస్తాను.మా తోడికోడళ్ళు అందరమూ కూడా బాగా ఉంటాము.వాళ్ళని రేయ్ అని అన్నా,పేరు పెట్టి పిలిచినా ఏమీ అనుకోరు.నిజమే కదా!నా పెళ్ళి అప్పటికి ఒకడు అయిదో క్లాసు,ఇంకోడు ఏడు,మరింకోడు పదో తరగతి.
మా అత్త కొడుకులను అబ్బయ్యా అని పిలిచేది.నా సంబోధన ...రేయ్ లో వాళ్ళకు వాళ్ళ అమ్మ పిలుపులోని ప్రేమ,వాత్సల్యం కనిపిస్తున్నాయేమో!వాకు సంతోషం!
Wednesday, November 19, 2025
Hai young lady!
చిన్నప్పుడు పెద్దన్నయ్య ఒక్కడే నన్ను బుల్లి,బుల్లెమ్మ అని పిలిచేవాడు.పెద్దయిన తరువాత తల్లీ అని పిలిచేవాడు.ఎప్పుడూ నన్ను పేరు పెట్టి పిలవ లేదు.ఇద్దరు అన్నయ్యలు,ఇద్దరు అక్కయ్యలు,అమ్మ,బాబు(నాన్న)లు లోకం అంటే ఏందో తెలియకుండా గారాబంగా పెంచారు.
వాళ్ళు నా పైన చూపించిన ప్రేమను అన్నయ్య,అక్కయ్యల పిల్లలకు పంచాను.అన్నయ్య పిల్లలకు చిక్కత్తను,అక్కయ్యల పిల్లలకు పిన్నిని.అన్నయ్య పిల్లలకు అయితే ముద్ద ముద్దకు ఒక కథ చెబుతూ అన్నం పెట్టేదాన్ని,కాళ్ళపైన కూర్చోబెట్టుకుని.
ఇప్పుడు మనవళ్ళు,మనవరాళ్ళ హయాం కదా.ఒక మనవడికి నేను వచ్చేసేటప్పుడు నా స్వెట్టర్ ఇచ్చేయాలి.మళ్ళీ వెళ్ళేదాకా అదే వేసుకుని తిరుగుతుంటాడు,బుడబుక్కలవాడిలాగా!ఇంకొకడు రోజూ పడుకునేముందు,ఎంత అలసిపోయినా,ఇంకెంత నిద్ర వచ్చినా,వచ్చి నా పక్కలు సర్ది,నాకు మంచిగా దుప్పటి కప్పి,గుడ్ నైట్ చెప్పి,ఒక ముద్దు ఒక హగ్ ఇచ్చి,లైటు ఆర్పేసి,తలుపు వారగా వేసి వెళతాడు.
మనవరాలు అయితే నేను తన ఫ్రెండు అనుకుంటుంది.హే యంగ్ లేడీ అని పిలుస్తుంటుంది.కొత్తగా హాయ్ నైబర్ అని నామకరణం చేసింది.
Tuesday, November 18, 2025
వేరు తొలిచే పురుగు
వేరు తొలిచే పురుగు చెట్టుకు పట్టింది అనుకో,మహావృక్షమైనా కూకటి వ్రేళ్ళతో నేలకొరుగుతుంది.ఇది ముమ్మాటికీ సత్యం!
రావణుడిని రావణబ్రహ్మ అంటారు.మహా శివ భక్తుడు.మంచి యోద్ధ.మంచి జ్ఞాని.ఇంకా ఎన్నెన్నో మంచి గుణాలు ఉన్నాయి.కానీ పరస్త్రీ వ్యామోహం అథః పాతాళానికి తీసుకెళ్ళింది.అతను సీతను మోహించకపోతే,అపహరించక పోయి ఉంటే బంగారు లంక దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది.కానీ ఇంకొకరి ఆలిని కోరుకోవటం తన మూలాలు కదిలిపోయేలా చేసింది.ఒక్క కామమే కాదు,ఏదైనా బలీయమయిన కోరరాని కోరిక మనిషిని కలుషితం చేస్తుంది.కకలావికలం చేస్తుంది.కృంగిపోయేలా చేస్తుంది.విచక్షణారహితుడిని చేస్తుంది.వివేకం కోల్పోయేలా చేస్తుంది.రావణబ్రహ్మలాంటి వాడిని కూడా రాళ్ళపాలు చేస్తుంది.ఎంతటి శివభక్తుడు అయినా శిథిలావస్థకు చేరుస్తుంది.
అందుకే మానవుడు బలహీనతలకు బానిస కాకూడదు.మానసికంగా,శారీరకంగా ఎంత బలవంతుడు,శూరుడు,విక్రమార్కుడు అయినా ఒక్క క్షణంలో నిర్వీర్యుడుని చేస్తుంది.
Sunday, November 16, 2025
మంచె మీద మంచి పుస్తకాలతో
నేను ఆరో తరగతిలో ABCDలు నేర్చుకున్నాను.ఏడో క్లాసుకి వచ్చేటప్పటికి ఇంగ్లీషు అంటే ఇష్టం పుట్టింది.ఎండా కాలం సెలవుల్లో చుట్టు పక్కల ఇండ్లు తిరిగి పెద్ద క్లాసు పిల్లల నాన్డిటైల్సు,ప్రైజు పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని.అలా చదివినవే...coral island,treasure island,westward ho,kenilworth,tombrown school days,oliver twist,david copperfield...
మా పెద్దన్నయ్యకు పుస్తకాలు అంటే ఇష్టం.కొన్ని కొనేవాడు.తొమ్మిదో క్లాసు సెలవుల్లో Emma,Sven hassel world war series.ఇంక ఆ ప్రస్థానం అలా కొనసాగింది.emesco పుస్తకాలు చదివాను.readers digestlo వచ్చే abridged editions చదివేదాన్ని.వాటిల్లో roots నాకు బాగా నచ్చింది.
కాలేజీకి వచ్చిన తరువాత రెచ్చిపోయాను.mills&boon అయితే వందలు,వేలలోనే!harold robbins,denise robins,barbara cartland,hermina black..నేను చదివిన మొట్ట మొదటి తెలుగు నవల సెక్రటరీ.
పెద్దక్కయ్యకు పెళ్ళి అయిన తరువాత ఎండా కాలం సెలవులకు అక్కడకు వెళ్ళాను.అక్కడ arthur donnan coyle వి perry mason series,james hadly chase series,james bond series ఔపోసన పట్టేసాను.
కాలేజీలో వెనక బెంచీలో కూర్చుని చదివేదాన్ని BSC,Mscలలో.అమ్మకు తెలియకూడదని కథల పుస్తకాలకు అట్టలు వేసి ఇంట్లో చదివేదాన్ని.
Arthur haileys airport,hotel,final diagnosis...strong medicine...
pearl s buck good earth,concubine..
Emily bronteS wuthering heights...నన్ను చాలా కదిలించింది.మన దేవదాసు నవల లాగా అది చదివిన చాలా రోజులు మామూలు కాలేకపోయాను.
mario puzos godfather 1&2,henry charrieres papillon,robert ludlum novels,scarlet letter,gone with the wind,dark of the sun,love camp,second lady by Irving wallace,Ayn rand fountainhead...ఇలా ఎన్నో,ఎన్నెన్నో...
arun joshi,Sasti bratas..my god died young...I take this woman by rajinder singh bedi
harleQuin romances....
నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది.మంచె మీద బాగా సర్దుకుని కూర్చోవాలి.ఒక తట్టు చదివిన పుస్తకాలు,ఇంకో తట్టు చదవాల్సిన పుస్తకాలు ఉండాలి.ఆకలి అయితే తినేదానికి చేతికి తడి,నూనె అంటకుండా ఉండే తినుబండారాలు ఉండాలి.మంచి నీళ్ళు పక్కనే ఉండాలి.ఎవళ్ళూ నన్ను గలభా చేయకుండా ప్రశాంతంగా చదువుకోగలగాలి.
ఇప్పుడు ఒక రకంగా కుదిరింది..కానీ కొన్ని మార్పులూ చేర్పులతో!మంచె కాస్తా మంచం అయింది.కథల పుస్తకాలు కాకుండా దేవుడి పుస్తకాలు చేరాయి.
Saturday, November 15, 2025
ఈ నల్లని రాళ్ళలో…
నేను అయిదో క్లాస్లో ఉండేటప్పుడు వచ్చింది ఈ సినిమా.పెద్దక్కయ్య తీసుకెళ్ళింది.ముందర ట్రైలరు.సుమ కుంటిది.కానీ నడువగలదు అంటూ.అప్పుడే ఆర్టిఫిషియల్ లిమ్బ్స్ పెట్టడం జైపూరులో మొదలు అయింది.సినిమా మొదలు అయింది.తారాగణం,కూర్పు,పర్యవేక్షణ,మాటలు,పాటలు ...అన్ని పేర్లు వచ్చేసాయి.నాగేశ్వరరావు ఉలి పట్టుకుని టంగ్ టంగ్ అని కొడుతూ ఈ నల్లని రాళ్ళలో అని అంటున్నాడు.ఇంతలో కరెంటు పోయింది!
చీకటి,ఉక్క,చెమట...సర్వం!కానీ కరెంటు రావటం లేదుఎంత సేపయినా!గంట అయింది.రెండు గంటలు అయింది.సూన్యం!ఇంక కరెంటు రాదు అని తేల్చుకుని అందరికీ చీటీలు ఇచ్చారు,రేపు వచ్చి చూడండని.మామూలుగా సినిమా వదిలి పెట్టే సమయానికే బయటపడ్డాము.
రెండో రోజు ఠంచనుగా వెళ్ళి చీటీలు చూపించి జ్యోతి సినిమా హాలులో కూర్చున్నాము.మళ్ళీ ట్రైలరు...సుమ కుంటిది,కానీ నడువ గలదుఅంటూ.సినిమా మాటలు,పాటలు,నృత్యం పేర్లు వచ్చాయి.నాగేశ్వర రావు మళ్ళీ పాటందుకున్నాడు..ఈ నల్లని రాళ్ళలో అంటూ..మళ్ళీ పుటుక్కున కరెంటు పోయింది.మళ్ళీ రెండు గంటలు చీకటి,ఉక్క,చెమటలతో!మళ్ళీ హాలువాళ్ళు చీటీలు ఇచ్చారు రేపు రమ్మనమని.
మళ్ళీ రెండో ఆట టైముకు ఇల్లు చేరాము.
ముచ్చటగా మూడో రోజు వెళ్ళాము జ్యోతి తియేటరుకు.మళ్ళీ సుమ కుంటిది,కానీ నడువగలదు అంటూ ట్రైలరు.నాకు కంఠస్తం వచ్చేసింది.పేర్లు పడ్డాయి.నేను ఏడు కొండల వాడికి మొక్కుకున్నాను నాగేశ్వర రావు పాట మొదటి లైను దాటి రెండో లైను పాడేలా చేయమని.ఎట్లనో దేవుడు కరుణించాడు.సినిమా మొత్తం చూసి బయట పడ్డాము ఎలాంటి అవరోథాలు లేకుండా!
Sunday, November 9, 2025
ఇదిగో కష్టాల కడలి…అదిగో కుంతి!
కుంతి జన్మ మొత్తమూ,ఒకటి పోతే ఇంకోటి...ఒకదాని తర్వాత ఇంకోటి కష్టాలు పడుతూ వచ్చింది.
యవ్వనం తొలి నాళ్ళలో ఆతురత,అసహనం,అలజడి,అన్నీ త్వరత్వరగా తెలుసుకోవాలనే తొందరలో కర్ణుడు పుట్టేసాడు.పెళ్ళికాని పిల్ల,అప్పుడైనా,ఇప్పుడైనా,ఇంకెప్పుడైనా,తల్లి అయితే పరిస్థితి ఒక్కటే.ఆ బిడ్డను వదిలించుకుంది,కానీ ఆ బిడ్డ పైన మమకారం పోగొట్టుకోలేక పోయింది.
చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది.మాద్రి కోరిక పైన తన బిడ్డలైన నకుల సహదేవులను కూడా సొంత బిడ్డలలాగా చూసుకుంది.బావగారి పంచన ఐదుగురు బిడ్డలను పోషించుకోవాలంటే ఎంత కష్టం!అయినా పెదవి విప్పకుండా,మాట జారకుండా నెట్టుకుని వచ్చింది.దుర్యోధనుడు భీముడికి విషప్రయోగం చేసినా కిమ్మనలేదు.లక్క గృహము అగ్నికీలల పాలైనా అసహనానికి లోనుకాకుంకా,మౌనంగా బిడ్డలతోపాటు అడవులవెంట నడిచింది.
బిడ్డలు,కోడలు అరణ్యవాసం,అజ్ఞాతవాసానికి కారణమైన కౌరవుల చెంతనే ఉండాల్సి వచ్చినా నోరు మెదపకుండా సహనం పాటించింది.
కర్ణుడే తన మొదటి కొడుకు అని తెలిసినా నిస్సహాయంగా నిలబడిపోయింది!తన కళ్ళ ముందే మనవళ్ళు పోయినా నిర్వికారంగా దిక్కులు చూసింది.
భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో బిడ్డని కాపాడి వాళ్ళ వంశాన్ని నిలబెట్టడమే ఆమెకు ఆనందం ప్రసాదించిన క్షణం.
ఆమె అన్ని ఆటుపోటులకు ధైర్యంగా,మనోనిబ్బరంతో ఎదురు నిలిచింది కాబట్టే వాళ్ళ వంశం నిలద్రొక్కుకుంది!ఏనాడూ తన బిడ్డలు తప్పుదోవలో పోకుండా కాపాడుకుంటూ వచ్చింది.ఆమె విజయం అదే!
Saturday, November 8, 2025
Just miss miss universe!
అప్పుడే కాలేజీలో చేరాను.లైబ్రరీలో woman and home,femina,illustrated weekly చూసేదాన్ని.ఒకరోజు miss india contest application కనిపించింది ఒక పుస్తకంలో.
నాకు ఏమి తక్కువ!వాళ్ళు అడిగిన అంశాలు అన్నీ ఉన్నాయి.లైబ్రరీలో పుస్తకాలు చించడం నేరం.కానీ రాక్స్ మధ్యలోకి వెళ్ళి ఆ పేపర్ మంచిగా చించి తీసుకుని వచ్చాను.ఫారమ్ అంతా పూర్తి చేసాను.మైనర్లకు తల్లి దండ్రులు సంతకం చేయాలని ఉంది.బాబు(నాన్న)ఒప్పుకోడేమో!అమ్మ మూడో తరగతిలోనే మూడు ముళ్ళు వేయించుకుంది.ఇంగ్లీషు అసలు రాదు.కాబట్టి అమ్మ చేత సంతకం చేయించుకుందాము అని నిర్ణయించుకున్నాను.
అమ్మ వంటింట్లో ఉంది.చిన్నగా దగ్గరకు వెళ్ళి అమ్మా!ఇక్కడ సంతకం చేయవే అని అడిగాను.ప్రింటెడ్ కాగితం అయ్యేటప్పటికి ఏంది ఇది అని అడిగింది.నేను ఏమీ మాట్లాడలేదు.అమ్మ ఇంక అక్కయ్యలని పిలిచి చూపించింది.
ఇంక అందరూ అక్షింతలు...ఏందీ పిచ్చి వేషాలు అని.
నిజమే!ప్రాక్టికాలిటీ ఆలోచించ కుండా చేసే పనులు!అసలు అమ్మ ఏమీ అనకుండా సంతకం చేసింది అనుకో.ఏమి అవుతుంది?ఆ ఫారమ్ పంపిస్తాను.తప్పీ దారీ కాల్ లెటరు వచ్చినా పెద్ద పీకబోయేది ఏమీ ఉండదు.అమ్మ బాబు ఒప్పుకోవాలి.ఒప్పుకున్నా నన్ను ఎక్కడికీ పంపించరు.
ఇలా నా కథ,నా కల అసంపూర్తిగా మిగిలి పోయాయి.అందుకే మా పిల్లలతో అంటుంటాను నేను మిస్ అయిన మిస్ యూనివర్స్ అని.
Friday, November 7, 2025
పాపం భీష్ముడు
తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని అంటారు కదా!అలానే అపాత్ర దానం చేయకూడదు అని కూడా అంటరు కదా!నాదృష్టిలో భీష్ముడు ఈ రెండు తప్పులూ చేసాడు.
చెట్టంత ఎదిగిన కొడుకు ఉండి స్త్రీవ్యామోహానికి గురి అయిన తండ్రికి కొడుకుగా పుట్టడం!అదేందో మహాయజ్ఞమో,యాగమో అన్నట్లు దానికోసరము కఠోరమయిన బ్రహ్మచర్యం పాటిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేయడం!
ఇలా చేసి ఎవరికి,దేనికి మార్గ దర్శకము అయినట్లు!
ఇంతా చేసి ఏమైనా సుఖ పడ్డాడా అంటే అదీలేదు.
అంత జ్ఞానము ఉండి ధర్మం వైపు నిలబడ్డాడా అంటే అదీ లేదు.పాండవులు మంచి వారని తెలిసినా,ధర్మమార్గంలో ఉన్నారని తెలిసినా కౌరవుల పక్షమే నిలిచాడు.నాకైతే ఈయనకు ఇంకో రకం అంధత్వం...అన్నీ కనిపించినా,తెలిసినా ఏమీ చేయలేని అశక్తత!
Sunday, November 2, 2025
గాంధారి నచ్చలేదు
గాంధారి ధృతరాష్ట్రుడి భార్య.భర్త చూడలేని ప్రపంచం తనకు వద్దని కళ్ళకు గంతలు కట్టుకుంటుంది.
ఇది ఏమి తర్కం?ఇది ఏమి పతివ్రతా ధర్మం?
మొగుడికి కళ్ళు లేకపోతే తను అతనికి కళ్ళలాగా ఉపయోగపడాలి.అంతేకానీ,కళ్ళు బలవంతంగా మూసుకునేదేంటి?అదే ఇంక కాళ్ళు,చేతులు లేకపోతే కట్టేసుకుని కూర్చుంటుందా?ఇంట్లో ఒకళ్ళకి బాగా లేకపోయినా మిగిలిన కుటుంబ సభ్యులు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారు?అట్లాంటిది,అల్లుడితోడు గిల్లుడు అన్నట్లు బలవంతపు అంథత్వం ఏంది?
ఆమె అసలు మామూలుగా ఉండి ఉంటే పరిస్థితి వంశనాశనం దాకా వచ్చేది కాదేమో!మొగుడికి మంచి చెడ్డా చెప్పగలిగేది ఏమో!బిడ్డలు తప్పుదోవన పోకుండా ఆపేది ఏమో!లేకపోతే వదిన తల్లి లాంటిది అంటారు కదా!అలాంటి ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణం చేసారంటే తన కొడుకులు,ఆమె బిడ్డలను కూడా సరైన విలువలతో పెంచలేదనే కదా!
బిడ్డలకు హితవు చెప్పకుండా,ఏకంగా ఎద్దులా పెరిగిన కొడుకు శరీరాన్ని ఉక్కులాగా చేసేదానికి నడుము బిగించడం ఏంది?
ఆమెకు తనపై తనకే జాలి,గ్రుడ్డి మొగుడు దొరికాడని!
తన పైన తనకే అసహ్యం అశక్తుడు అయిన మొగుడిని చూడాలంటే!ఈ తలకాయ నొప్పులు అంతా దేనికి?నేను కూడా గ్రుడ్డి వేషం వేసుకుంటే అందరూ తనను చూసి జాలి పడతారు అనుకుంది.పతివ్రత అని మెచ్చుకుంటారు అని భావించింది.
తనకు తను అన్యాయం చేసుకుంది.మొగుడికి,బిడ్డలకు కూడా అన్యాయం చేసింది చివరకు.
Subscribe to:
Comments (Atom)