Thursday, July 10, 2025

బుర్రీ బుర్రడి కథ లా….

మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ కథ చెబుతుండేది.ఒక ఊర్లో బుర్రీ బుర్రడు అని మొగుడూపెళ్ళాలు ఉంటారు.ఒకరోజు బుర్రడు అడవికి పోయి కట్టెలు కొట్టుకొస్తాను అని బయలుదేరుతాడు.వెళుతూ,గడప దగ్గర ఆగి,బుర్రీ నాకు వడలు తినాలని ఉంది.సాయంత్రం నేను వచ్చేటప్పటికి చేసి పెట్టు అని అడవికి బయలు దేరుతాడు.బుర్రి వెంటనే మినపపప్పు నాన బెడతుంది.ఇంకో గంటలో బుర్రడు వస్తాడు అనంగా మినపపప్పు రుబ్బుకుంటుంది.కట్టెలపొయ్యి రాజేసి,వడలు చేయటానికి కూర్చుంటుంది.ఒక వాయ అవుతుంది.అసలు మినపపప్పు సరిగ్గా నానిందో లేదో అని ఒక నాలుగు వడలు నోట్లో వేసుకుంటుంది.రెండో వాయ కూడా కాలుస్తుంది.అసలు ఉప్పు సరిగ్గా,మోయనగా పడిందో లేదో చూసేదానికి,ఇంకో నాలుగు వడలు రుచి చూస్తుంది.మూడో వాయ కూడా కాలుస్తుంది.అసలు కారం సరిగ్గా వేసానా,లేదా?చప్పగా ఉంటే మా ఆయనకు అసలు నచ్చదు అని ఇంకో నాలుగు తిని చూస్తుంది.ఇంతకీ అసలు నేను సరిగ్గా కాలుస్తున్నానా,లేక పోతే లోపల ఏమైనా పచ్చి నిలిచి ఉందా?అట్లా అయితే తిన్న తరువాత కడుపు నొప్పి వస్తుంది అని ఇంకో నాలుగు తిని చూస్తుంది.పొయ్యి ఆపి ఇవతలకు వస్తుంది.ఇంత కష్టపడి పని చేసిన నాకు ఒక నాలుగు వడలు తినే యోగం కూడా లేదా?అని అనుకుంటూ ఇంకో నాలుగు తింటుంది. చీకటి పడి మొగుడు వస్తాడు.భలే అలసి పోయి ఉంటాడు.హాయిగా వేడి నీళ్ళు ఒంటి మీద పోసుకుని,ఆవురావురు మంటూ వస్తాడు వడలు తినేదానికి.చేసావా?అని అడిగితే నువ్వు చెబితే చేయకుండా ఉంటానా అంటుంది.కంచం ముందర కూర్చుంటాడు.బుర్రి వంటింట్లోకి పోయి గిన్నె మూత తీస్తే,ఏముంది???? గిన్నె అంతా ఖాళీ!!!ఒక్క వడ కూడా మిగిలి ఉండదు!!! చాలా సార్లు మన ఇండ్లలో కూడా ఇలానే జరుగుతుంది.ఒకసారి మా బంథువులను అన్నానికి పిలిచాను.మా పిల్లలు అప్పుడు బడికి వెళ్ళే వయసు.పిలిచిన వాళ్ళు ఒంటి గంట,రెండు అవుతున్నా రాలేదు.ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కరూ చిన్నగా వంటింట్లోకి వెళ్ళేది..।ఒక వడో,కొంచెం పులిహోర తెచ్చుకుని తినేది.పిలిచిన వాళ్ళు ఎప్పుడో వచ్చే సమయానికి చేసిన పులిహోర,వడలు,పాయసం అంతా హుష్ కాకి అయిపోయాయి. ఇలా ఒక్క తిండి విషయం లోనే కాదు.డబ్బు విషయం లో కూడా తరచూ జరుగుతుంటుంది.ఒక ఖర్చుకు అని డబ్బు దాచి పెడతాము.కానీ వేరే వేరే చిన్న చిన్న ఖర్చులు అనుకోకుండా మీద పడుతుంటాయి.అప్పుడు మన కళ్ళు అంతా దాచి పెట్చిన ఈ డబ్బు మీదే పడుతుంది.అది అంతా అయిపోయేదాకా నిద్ర పట్టదు.అసలు అవసరానికి ఆ డబ్బులు ఎప్పుడో హారతి కర్పూరం అయిపోయి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు తరచూ చెబుతుంటారు.మనపైన మనకు నియంత్రణ ఉండాలి.లేక పోతే కష్టం అని.

Wednesday, June 18, 2025

మూడు వెంట్రుకల రాణి కథ

మా మేనత్త పేరు తులసమ్మ.చిన్నప్పుడు మాకు తమాషా కథలు చాలా చెప్పేది.అందులో ఇది ఒకటి. ఒక రాజుకు ముగ్గురు రాణులు ఉంటారు.మొదటి రాణికి ఒక వెంట్రుక ఉంటుంది.రెండో రాణికి రెండు వెంట్రుకలు ఉంటాయి.అందుకని ఆమెకు గర్వం.మూడో రాణికి మూడు వెంట్రుకలు ఉంటాయి.ఆమెకు ఇంకా గర్వం ఎక్కువ,అందరికంటే తనే ఎక్కువ అందగత్తెను అని.మొదటి రాణి చాలా మంచి మనసు కల ఉత్తమురాలు.రెండు,మూడవ రాణులకు గర్వం,భేషజం ఎక్కువ.ఎప్పుడూ పెద్ద రాణిని కించ పరుస్తుంటారు.ఒక రోజు మూడవ రాణి విహారానికి వెళుతుంది.దారి అంతా గతుకుల మయంగా,మురికి నీరు నిండి ఉంటుంది.ఛీ!ఛీ!ఛీ!అని అసహ్యించుకుంటూ,ప్రక్కన మంచి దారిలో వెళ్ళి పోతుంది.ఇంకొంచెం దూరం పోయిన తరువాత ఒక గొడ్ల కొష్టం కనిపిస్తుంది.అందులో ఒక ఆవు దాహానికి అరుస్తూ ఉంటుంది.దాని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండవు.రాణి ఛీ!ఛీ!ఛీ! అనుకుంటూ,అసహ్యించుకుని వెళ్ళిపోతుంది.ఇంకొంచెం ముందరికి పోతుండగా చిన్న పిల్లవాడు ఆకలికి ఏడుస్తుంటాడు.ఛీ!ఛీ!ఛీ!ఎక్కడకు పోయినా ఈ బీద ఏడుపులు,ఆకలి గోలలు అని అసహ్యించుకుంటూ ముందరికి పోతుంది.ఇంకాసేపు ముందరికి పోయిన తరువాత ఒక కొలను కనిపిస్తుంది.చుట్టు పక్కన పరిసరాలు అన్నీ ఆహ్లాదభరితంగా,సువాసనలతో,సుందరమయిన పూతోటలతో ఉంటాయి.మూడో రాణి అక్కడకు చేరగానే,ఈ కొలనులో మూడు మునకలు వేస్తే,అసమాన సౌందర్యం మీ సొంతం అవుతుంది అని అశరీరవాణి పలుకులు వినిపిస్తాయి.రాణి ఇలా ఆలోచిస్తుంది.ఇప్పటికే నేను చాలా సౌందర్యవతిని.రాజును నా కనుసన్నలలో తిప్పుకుంటున్నాను.ఈ కొలనులో ముణిగి,ఇంకా అసమాన సౌందర్యవతిని అయితే ఇక నాకు తిరుగులేదు.ఇలా అనుకుని,మూడు మునకలు వేసి,బయటకు వస్తుంది.ఆశ్చర్యం!నెత్తి మీద ఉండే మూడు వెంట్రుకలు పోయి,బోడి గుండు దర్శనం ఇస్తుంది. రెండవ రాణికి కూడా ఇలానే జరుగుతుంది. మూడవరాణి రోజంతా కష్టపడి,అలసి పోయి,విశ్రాంతిగా ఉంటుంది మనసుకు అని బయలు దేరుతుంది.దారిలో అంతా అసహ్యంగా,గుంటలు మిట్టలుగా కనిపిస్తుంది.అయ్యో!ఇలాంటి దారిలో నడవడం ఎవరికైనా కష్టం కదా!అనుకుంటుంది.దగ్గరలో ఉండే మన్నుతో గుంతలు పూడ్చి,రాళ్ళు రప్పలు తీసి వేసి ముందరికి వెళుతుంది.ఇంకొంచెం దూరం పోయిన తరువాత గొడ్ల కొష్టంలో ఆవు దాహానికి అరుస్తూ కనిపిస్తుంది.అయ్యో!అనుకుంటూ వెళ్ళి దాని చుట్టుపక్కల కూడా శుభ్రం చేస్తుంది.దగ్గరలో నుండి మంచి నీరు,తినేదానికి గ్రాసము తెచ్చి ఇస్తుంది.ఇంకా ముందరికి వెళుతుంటే చిన్న పిల్లవాడి ఆకలి ఏడుపు వినిపిస్తుంది.అయ్యో!పిల్లవాడి అమ్మ కూడా దగ్గరలో ఉన్నట్లు లేదు!క్షణం ఆలస్యం చేయకుండా తనతో తెచ్చుకున్న పాలు,పండ్లు ఆ బిడ్డకు తినిపించి బయలుదేరుతుంది.ఇంకొంచెం దూరం వెళ్ళిన తరువాత ఒక తటాకం కనిపిస్తుంది.చాలా అలసి పోయాను.కొంచెం నీళ్ళలోకి దిగి,స్నానం చేస్తాను అని దిగుతుంది.ఆమె ఆ నీటిలో మూడు మునకలు వేయగానే అతిరూపలావణ్యవంతురాలు అవుతుంది. ఈ కథకు సారాంశం ఇది.బాహ్య సౌందర్యం శాశ్వతం కాదు.అది చూసుకుని మనుష్యులు గర్వానికి,అతిశయానికి పోకూడదు.మానసిక సౌందర్యమే మనకు ముఖ్యము.మంచి మనసు,సహనం,సహాయం చేసే గుణాలే అసలైన సౌందర్యాలు.

Sunday, June 1, 2025

ఎలుక తోలు తెచ్చి…

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు॥ ఎలుకతోలు తేవటం ఎందుకు?లోకంలో ఇక వేరే పనీపాటలు లేనట్లు సంవత్సరం పాటు వుతకటం దేనికి?మళ్ళీ తోలు తెల్లబడలేదని దిగులు పడటం దేనికి?అంత పనికిరాని,ఫలితంలేని పని కోసం మన శక్తి యుక్తులు ధార పోయడం వృథా అని కవి వేమన ఉద్దేశం.ఎలుకతోలు నల్లగా ఉండటం తప్పుకాదు.అది దాని సహజ గుణం.దానిని తెల్లగా చెయ్యాలనుకోవటమే మన తెలివి తక్కువకు నిదర్శనం,పరాకాష్ట.ఎందుకంటే స్వతహాగా,జన్మతః వచ్చే బుద్ధులు మారటం చాలా కష్టం.అలాంటిది పక్కవాళ్ళు మార్చాలనుకోవటం ఇంకా అసాధ్యం.మంచికి మారాలి అనే స్పృహ,అవగాహన,సంకల్పం,ఆ దిశగా కార్యదీక్ష ఉంటేగానీ మనము నిజంగా మారలేము.మంచికి మార్పు మనతోటే మొదలుకావాలి.మనలను మనం మార్చుకోలేని వాళ్ళము ఎదుటివారిని ఏమి మారుస్తాము?సంఘాన్ని ఏమి మార్చగలము?

Saturday, May 31, 2025

బావిలో సూది పడితే……?

చిన్నప్పుడు మా బాబు(నాన్న) మాకొక కధ చెప్పేవాడు.ఒక ముసలి ఆమె బావి గట్టు పైన కూర్చుని చినుగు కుట్టుకుంటూ వుంటుంది.దారంలాగుతూ వుండగా గబుక్కున సూది జారి బావిలో పడుతుంది.ఇప్పుడు ఎలా?సూది ఏం చేస్తే ఆమె చేతికి మళ్ళీ వస్తుందో ఉపాయం మనల్ని చెప్పమనే వాడు బాబు.ఏడుస్తే వస్తుందా? రాదు.దిగులు పడితే వస్తుందా?రానేరాదు.బావిలోకి తొంగి చూస్తే వస్తుందా?బావిలోకి దూకితే వస్తుందా?ఊ అంటే వస్తుందా?ఊహూ అంచే వస్తుందా? సమాథానం చెప్పకుంటే వస్తుందా?ఇలా అడిగేవాడు.మాకు జవాబు చెప్పటం రాక ఏడుస్తూ బాబు దగ్గర నుంచి వెళ్ళిపోయేవాళ్ళము. ఒకసారి ఆలోచిద్దాము నిదానంగా.బాబు వేసే ప్రశ్నలు నిజమే కదా!మనం జీవితంలో ఆనందాన్ని ఒక్కొక్కసారి పోగొట్టుకుంటాము.ఒక్కొక్కసారి అనాలోచితంగా పోగొట్టుకుంటాము.ఇంకో సారి దాని విలువ తెలియకుండా చేజార్చుకుంటాము.మరొకసారి మన ప్రమేయం లేకపోయినా,వేరే వాళ్ళ కారణంగా పోగొట్టుకుంటాము. కానీ కారణాలు ఏవయినా ఒకసారి చేజారిన సంతోషం,ఆనందం మనకు మరలా చేజిక్కాలంటే ఎంత కష్టం.చాలా సార్లు అసాధ్యం.కాబట్టి జీవితంలో నిజమయిన ఆనందాలను మనము కాపాడుకోవాలి.అనవసరమయిన పరిస్థితులు,మనుష్యులు వాటిని మనకు దూరం చేయకుండా మనము జాగ్రత్త పడాలి.

Thursday, May 29, 2025

లారీ తో జాలీ గా సహవాసం

chaalaa yellu naaku lorry ane oka vaahanam vundi,vuntundi ani theliyadu chinnappudu.gudur nunchi tirupathiki maaretappudu koodaa saamaanlu yelaa vachchaayo naaku theliyadu.tharuvaatha tirupathilo illu maaretpudu koodaa chaalaa saamaanulu cheththo moyyagaligevi mosukupoyevaallamu.pedda ,baruvu ayinavaatini yeddula bandilo thechchevaallu. nenu first time lorry vidavalur nunchi nellore velledaniki yekkaanu.pedda baavaku lorry vundi.daantlo yekkaanu.vimaanam yekkinappudu koodaa tharuvaatha antha khush kaaledu.peddakkayya pillalatho bus lo nellore velithe,memu lorry lo cherevaallamu okkokka saari.ye muhoortham lo lorry yekkaano theliyadu kaani,adi alaane continue ayindi.karakambadiki transfer ayinappudu oka batch samanulu theesukelledaaniki lorry lo nene yekki vellaanu.bavaku thelisina vaalla lorry theesukochchaadu bava.karakambadi nunchi nellore transfer ayinappudu koodaa saamaanulu lorry lo nene theesukellaanu.pillalani prasad tho mundare nellore ki pampinchanu.yeppudu relieve chesthaaro theliyadu.relieve ayina tharuvatha okka roju koodaa tirupathi lo vundaalanipinchaledu.kaabatti transfer order vachchinappude okkokka saamanu sardatam modalupettaanu.mallikarjuna oka lorry maatlaadi,daily wager ni thodu ichchi pampinchadu.onida portable color tv ni ollo pettukuni nellore cheraanu.chittoor nunchi tirupathi transfer ayinappudu koodaa anthe.pillalanu bus lo pampinchi,nenu prasad lorry lo saamaanulu vesukuni vellaamu.inthati tho aagindaa ante ledu.aakhariki retire ayina tharuvaatha koodaa madanapalle nunchi nellore ki saamaanlathoti lorry lo vachchesaanu.suresh thodu vachchaadu.morning yedo EAMCET vundi,buslu avi dorakavu,chaalaa rushgaa vuntundi ani annaaru. itlaa sixteen to sixties lorry prayanam konasaagindi.

Sunday, February 2, 2025

బాబు(తండ్రి) అంటే భయం!

ఆడించేది బాబు.పాలించేది బాబు.షికారు తీసుకెళ్ళేది బాబు. సినిమాకి తీసుకెళ్ళేది బాబు.బడిలో చేర్పించేది బాబు.గుడికి తీసుకెళ్ళేది బాబు.తమాషా చేసేది బాబు.తప్పుచేస్తే తడాఖా చూపించేది బాబు.అబద్థాలు చెప్తే అంతు చూసేది బాబు.అన్నీ నాకే తెలుసు అంటే ఆరున్నొక్క రాగం ఆలపించేలా చేసేది బాబు.చెప్పిన మాట వినకపోతే చెమడాలు ఊడతీస్తాడు బాబు.మనకోసం కష్టపడతాడు బాబు.మన ఎదుగుదలకు గర్వపడతాడు బాబు.దొరలా పెంచుతాడు బాబు.దొంగ కన్నీరుకు కరగడు బాబు.అందుకే బాబు అంటే ప్రేమతో పాటే భయం నాకు.

Saturday, February 1, 2025

అమ్మకు ఏమీ తెలియదు

అమ్మకు నిజంగా ఏమీ తెలియదు.బిడ్డలు ఏమి చెప్పినా నమ్మేస్తుంది.పిచ్చి తల్లి!ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంటుంది.పిల్లలను సహాయం చేయమని చెప్పటం రాదు.ఆడ అయినా,మొగ అయినా బిడ్డలను సమానంగా చూస్తుంది.ఒక బిడ్డ గొప్పగా వృద్థి చెంది,ఇంకో బిడ్డ జీవితంలో ఎదగలేక పోయినా,ఇద్దరినీ సమానంగా చూస్తుంది.నిజానికి జీవితంలో ఓడి పోయిన బిడ్డ దగ్గరే వుండి ఆ బిడ్డ కష్ట సుఖాలులో పాలు పంచుకుంటుంది.అమ్మకు అసలు చీర కూడా సరిగ్గా కట్టుకోవటంరాదు.ఎప్పుడూ హడావుడిగా,చీర పైకి దోపుకొని పనులు చేసుకుంటూ వుంటుంది.ఇంట్లో వాళ్ళు విసుక్కున్నా,కసురుకున్నా,ఆమె కష్టాన్ని గుర్తించక పోయినా,ఆమెకు అక్కర లేదు.మౌనంగా తన పనులు,మన పనులు చేసుకుంటూ పోతుంది.ఇలాంటి అమ్మలతో ఎలా ఏగాలో అర్థం కావటం లేదు.

Friday, January 24, 2025

మారు వడ్డించుకోవాలి

మారు వడ్డించుకోకపోతే అమ్మ పైన ప్రేమ లేనట్టు అట.రాజేశ్వరి చెప్పింది.మొదట తమాషా అనుకున్నాను.కానీ ఆలోచిస్తే నిజమే అనిపించింది.ఈ ప్రపంచంలో అమ్మ దగ్గరే కదా మనమందరమూ ఫ్రీగా,కేర్ ఫ్రీగా ఉండేది.మొహమాటం లేకుండా నచ్చితే,నచ్చిందని చెబుతాము.బాగా లేకపోతే బాగా లేదని చెప్తాము.నచ్చితే ఇంకా ఇంకా పెట్టించుకుంటాము.ఇంట్లో మిగిలిన వాళ్లకి మిగులుతుందో లేదో ఆలోచించము.ఇష్టం లేకపోతే ఎంత బతిమలాడినా వేలుతో కూడా ముట్టము.ఇష్టం అయినవి అడిగి మరీ చేయించుకుంటాము. అదే బయట అయితే మొహమాటపడతాము.నచ్చినా మళ్లీ అడిగి వేయించుకోము.నచ్చకపోయినా బలవంతంగా తింటాము.బాగుందని కితాబు కూడా ఇస్తాము.అమ్మ చేతి వంటలే కదా మొదట మనం తినేది.ఎవరు ఏమి పెట్టినా,అమ్మ చేసే వంటతో బేరీజు వేసుకుంటాము.అందుకనే అమ్మ అంటే నచ్చుతుంది.అమ్మ చేతి వంట నచ్చుతుంది.అందుకనే అమ్మ చేసింది మళ్లీ మళ్లీ అడిగి పెట్టించుకోని తింటాము.అందుకే మారు వడ్డించుకోకపోతే అమ్మ పైన ప్రేమలేదని,మారు వడ్డించుకుంటే అమ్మ అంటే ఇష్టమని అంటారు.